Begin typing your search above and press return to search.

వంట చేయకున్నా మా ఆయన ఏమనరు..!

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌గా అవకాశాలు దక్కించుకోవడం అనేది చాలా కష్టంగా ఉంది.

By:  Ramesh Palla   |   28 Oct 2026 9:08 AM IST
వంట చేయకున్నా మా ఆయన ఏమనరు..!
X

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌గా అవకాశాలు దక్కించుకోవడం అనేది చాలా కష్టంగా ఉంది. ఒకరు ఇద్దరు తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌గా ఉన్నప్పటికీ వారు కేవలం మీడియం రేంజ్ సినిమాలకు పరిమితం అవుతున్నారు. శ్రీలీల తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఎంట్రీ ఇచ్చింది మాత్రం కన్నడ ఇండస్ట్రీ నుంచే. కనుక ఆమె తెలుగు అమ్మాయి జాబితాలో తీసుకోలేం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా స్టార్‌డం అనుభవించిన చివరి తరం హీరోయిన్స్‌లో లయ ఒకరు. ఆమె ఒక దశాబ్ద కాలం పాటు టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా నిలిచింది. ఆమె పెళ్లి చేసుకుని వెళ్లి పోయిన తర్వాత కూడా చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్‌ ఆమెను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. హీరోయిన్‌గా భారీ పారితోషికం ఇచ్చి మరీ ఆమెను తీసుకు రావాలని భావించిన వారు ఉన్నారు. కానీ పెళ్లి తర్వాత లయ సినిమాలకు దూరం అయింది.

గణేష్‌ గోర్టీతో వివాహం తర్వాత లయ...

పెళ్లి, పిల్లలు అనే బంధాలు, బాధ్యతల కారణంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లయ, ఆ బాధ్యతలు కాస్త తగ్గడం, పిల్లలు పెద్ద వారు కావడం, ఇతర కారణాల వల్ల మళ్లీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తెలుగు ప్రేక్షకుల ముందుకు లయ మళ్లీ వచ్చింది. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అంటూ అభిమానులతో పాటు, అంతా మాట్లాడుకున్నారు. ఈ మధ్య కాలంలో లయ ఎక్కువ సినిమాలు, సిరీస్‌ల్లో కనిపిస్తోంది. ఇదే సమయంలో లయ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ, పాడ్‌ కాస్ట్‌లో కనిపిస్తూ వస్తోంది. పెళ్లి తర్వాత ముచ్చట్లు లయ పెద్దగా చెప్పలేదు. కానీ తాజాగా లయ ఒక పాడ్‌ కాస్ట్‌లో పెళ్లి గురించి, ఆమె భర్త గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. 2006లో లాస్ ఏంజిల్స్‌కు చెందిన డాక్టర్ గణేష్ గోర్టీని లయ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు గుడ్‌ బై చెప్పి అమెరికాలో సెటిల్‌ అయ్యింది. గణేష్‌ గోర్టీ కి అమెరికాలో డాక్టర్‌గా మంచి పేరు ఉందని లయ చెప్పుకొచ్చింది.

తెలుగు సినిమా ఇండస్ట్రీకి లయ గుడ్‌ బై...

లయ పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పడంతో ఆమె భర్త గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. ఆమె భర్త డాక్టర్‌ గణేష్ బలవంతంగా కెరీర్‌కి దూరం చేసినట్లుగా ప్రచారం జరిగింది. లయకు నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ భర్త కట్టుబాట్లు పెట్టడం వల్ల ఆమె ఇన్నాళ్లు నటనకు దూరంగా ఉన్నట్లుగా కూడా చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు లయ రీ ఎంట్రీ ఇవ్వడంతో భర్త నుంచి లయ దూరం అయిందేమో అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేశారు. ఆ అనుమానాలు అన్నింటికి లయ చెక్‌ పెట్టింది. తన భర్త చాలా గొప్ప వాడని, ప్రతి విషయంలోనూ స్వేచ్చ ఇచ్చాడని క్లారిటీ ఇచ్చింది. వంట నుంచి తన కెరీర్‌ వరకు అన్ని విషయాల్లో స్వేచ్చ ఇచ్చాడని లయ చెప్పుకొచ్చింది. ఆయన ఎప్పుడూ యాక్టింగ్‌ కు అడ్డు పడలేదని పేర్కొంది. అంతే కాకుండా లయ తన వ్యక్తిగత జీవితంలో గణేష్‌ చాలా మద్దతుగా నిలిచాడని కూడా లయ చెప్పింది.

లయ భర్త గురించి...

లయ మాట్లాడుతూ... పెళ్లిలో నాకు ఏదైతే స్వేచ్ఛ కావాలని కోరుకున్నానో, ఆ స్వేచ్ఛ పూర్తిగా లభించింది. నేను ఎలా వంట చేసినా నా భర్త తినేవారు. ఒకవేళ ఏదైనా రోజు వంట చేయలేదు అంటే, నీకు పని పాట ఏం లేదు కదా, ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఎందుకు వంట చేయలేదు అని ఎప్పుడూ అనలేదు. నేను వంట చేయని సమయంలో ఆయన 'నేను వంట చేయనా, లేదంటే బయట నుంచి తెచ్చుకుందామా' అని అనే వారని లయ చెప్పుకొచ్చింది. అంతటి మంచి భర్త చాలా అరుదుగా మాత్రమే అమ్మాయిలకు లభిస్తాడని, ఆ అదృష్టం తనకు దక్కిందని లయ తన భర్త గురించి చెప్పుకొచ్చింది. దేశం కాని దేశంలో లయకు అంత మంచి భర్త దొరకడం అదృష్టం అంటూ ఆమె అభిమానులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లయ నటించేందుకు ఇండియా వచ్చినా ఆయన మద్దతు, ప్రోత్సాహం ఉందట. లయ ఇక్కడికి వచ్చిన సమయంలో ఆయన కుటుంబ బాధ్యత పూర్తిగా చూసుకుంటూ, తన డ్యూటీస్ చేసుకుంటున్నాడట. ఇలాంటి భర్త దొరకాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది కదా.. మీరు ఏమంటారు?