ఇంట్లో ఆడపిల్ల ప్రసవించాలంటే? కంగన చెప్పిన షాకింగ్ విషయం!
కంగన చాలా ఇంటర్వ్యూల్లో తాను ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి సినీపరిశ్రమకు వచ్చానని వెల్లడించింది.
By: Sivaji Kontham | 20 Aug 2025 3:00 AM ISTఏదైనా విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడేయడం, ఎదుటి వారు ఎంత పెద్ద వారైనా నిలదీయడం క్వీన్ కంగన స్టైల్. హిమచల్ ప్రదేశ్ మనాలీకి చెందిన కంగన బాలీవుడ్ లో కథానాయికగా ఎదిగేందుకు చాలా అవమానాల్ని, ధిక్కారాల్ని, వేధింపుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి ముందే ఇంట్లో సాంప్రదాయ వాదులందరినీ ఎదురించి ముంబైలో తనకు తానుగానే ఉపాధి కోసం ఎదురీదాల్సి వచ్చింది.
కంగన చాలా ఇంటర్వ్యూల్లో తాను ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి సినీపరిశ్రమకు వచ్చానని వెల్లడించింది. అలాగే సినీపరిశ్రమ దిగ్గజాలకు వ్యతిరేకంగా దూకుడుగా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించేప్పుడు తనకు వెన్నుదన్నుగా తన సోదరి రంగోలి నిలిచేది. కంగనకు ఎదురయ్యే చట్టపరమైన సమస్యలన్నిటినీ రంగోలి డీల్ చేసింది. అయితే కంగనకు ఒక సోదరి ఉన్న విషయం తెలుసు.. ఇంట్లో చిన్నవాడైన సోదరుడు అక్ష్ కి పెళ్లయిన విషయం కూడా తెలుసు. కానీ కంగన- రంగోలి ఇద్దరికీ ఒక అన్నయ్య ఉన్న విషయం ఎవరికైనా తెలుసా?
కంగన స్వస్థలం హిమచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోని ఒక చిన్న గ్రామం. అందుకే `మండి` నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి భాజపా ఎమ్మెల్యేగా గెలిచిన కంగన తర్వాత ఎంపీ అయింది. అనుభవ లేమితో కొన్ని వివాదాలు తలెత్తినా కానీ, మహిళా నాయకురాలిగా తన స్వరాన్ని బలంగానే వినిపిస్తోంది. అయితే తాజా ఇంటర్వ్యూలో కంగన తనకు ఒక అన్నయ్య ఉన్నాడని చెప్పి ఆశ్చర్యపరిచింది. తన తల్లిదండ్రులకు మొదటి సంతానం ఒక మగశిషువు. కానీ అతడు 10రోజులకే మరణించాడు. శిషువు 3.5 కేజీల బరువుతో పుట్టాడు. ఎలాంటి అనారోగ్యం లేదు. అయినా చనిపోయాడు. దానికి కారణం వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం. ఆస్పత్రి నర్సు బొడ్డు తాడు సరిగా కోయలేదని తన తల్లి నమ్ముతుంది. ఆ విషాదాన్ని అమ్మా నాన్నతో పాటు ఇంట్లో వాళ్లు తట్టుకోలేకపోయారు. ఆ తర్వాత ఆస్పత్రిలో ప్రసవాన్ని మా ఇంట్లో నిషేధించారు. మొత్తం కుటుంబంలోని ఏ ఒక్క మహిళా కూడా ఆస్పత్రిలో ప్రసవించకూడదని నిషేధాజ్ఞలు విధించారు.
ఆ తర్వాత నా అమ్మమ్మ బాధ్యత తీసుకుని, మాలో ఎవరూ ఆసుపత్రిలో పుట్టరని ప్రకటించింది. ఈ సంఘటన తర్వాత నా తల్లి మరో మూడుసార్లు గర్భం దాల్చింది.. నా అత్త రెండుసార్లు గర్భం దాల్చింది.. మేమంతా ఒకే ఇంట్లో ఒకే గదిలో జన్మించాము.. మాకు ఆసుపత్రులు నిషేధం..! అని కంగన తెలిపింది.
ఇదే ఇంటర్వ్యూలో ఫ్యామిలీలో పితృస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు గళం వినిపించిన విషయాన్ని కూడా కంగన గుర్తు చేసుకుంది. పెద్దమ్మాయిని సరిగా పెంచకపోతే, ఇంట్లో తోబుట్టువులైన ఆడపిల్లల పెళ్లిళ్లపై ఆ ప్రభావం పడుతుందని పెద్దలు చెప్పేవారు. ఈ వ్యాఖ్యలు నా తోబుట్టువులతో నా బంధాన్ని ప్రభావితం చేశాయి.. తరచుగా నేను ఒంటరిని అయ్యానని భావించేలా చేశాయి! అని కౌమారంలో తన పరిస్థితిని గుర్తు చేసుకుంది కంగన. అలాగే తన స్కూల్ లో అందరికీ 6-9 తరగతుల మధ్య రుతుస్రావం అయ్యేది. కానీ తనకు అలా అవ్వలేదు. అయితే తాను బొమ్మలతో నిర్మించుకున్న ఇల్లు కారణమని భావించి వాటిని తీసి బయటపారేసారు. ఆ ఆలస్యానికి అవే కారణమని భావించి అమ్మ వాటిని పారవేసింది. అప్పుడు ఒక రోజు నేను మేల్కొన్నాను. నా చుట్టూ ఉన్న ప్రతి వస్త్రంపైనా రక్తం ఉంది. చివరకు నేను ఋతుస్రావం ప్రారంభించానని నా తల్లి సంతోషించింది. నేను మాత్రం భయపడ్డాను.. అని కంగన చెప్పుకొచ్చింది.
