Begin typing your search above and press return to search.

లీక్డ్ వీడియోని డ్రైవ‌ర్-వాచ్‌మ‌న్ చూసారు.. ఇలాంటి స‌మ‌యంలో బాధితురాలు ఏం చేయాలి?

అయితే ఈ ఎపిసోడ్ లో న‌టి ఎవ‌రు? అనేదానికంటే.. ఇలాంటి ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

By:  Sivaji Kontham   |   24 Sept 2026 9:52 AM IST
లీక్డ్ వీడియోని డ్రైవ‌ర్-వాచ్‌మ‌న్ చూసారు.. ఇలాంటి స‌మ‌యంలో బాధితురాలు ఏం చేయాలి?
X

బాలీవుడ్ - సౌత్ ఇండస్ట్రీలో బో*ల్డ్ & టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఒక ప్ర‌ముఖ న‌టి ఇటీవల తన కెరీర్‌లోని ఒక భయానక - బాధాకరమైన అనుభవాన్ని గుర్తు చేసుకుని వాపోయారు. తాను నటించిన ఒక సినిమాలోని రొమాంటిక్ - ఇంటిమేట్ సీన్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం తనను మానసికంగా ఎంతగానో కుంగదీసిందని తెలిపారు. ఆ వీడియో లీకైన తర్వాత తాను ఎంతగానో ఇబ్బందిపడ్డానని.. బయటికి వెళ్లడానికి మొహం చెల్లక ఏకంగా నాలుగు రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాలేదని వాపోయారు. ముఖ్యంగా తన అపార్ట్‌మెంట్‌లోని వాచ్‌మెన్, తన స్టైలిస్ట్, డ్రైవర్ ఇంకా ఇత‌రులు కూడా ఆ లీకైన క్లిప్‌ను చూశారనే విషయం తనను మరింతగా భయపెట్టిందని చెప్పారు. ఆ సమయంలో తాను ఒంటరిగా నివసిస్తుండటంతో భద్రతపై తీవ్రమైన ఆందోళన కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

చివరకు తన డ్రైవర్, స్పాట్ బాయ్‌లతో ఈ పరిస్థితిని మాట్లాడి తనకు అండగా ఉండమని కోరగా.. వారు ఇచ్చిన భరోసాతో కొంత ధైర్యం వచ్చిందని తెలిపారు. నటీనటులకు సంబంధించిన వ్యక్తిగత లేదా ఇంటిమేట్ దృశ్యాలు లీకైతే అది కేవలం విమర్శలకే పరిమితం కాకుండా.. వారి వ్యక్తిగత జీవితాన్ని, గోప్యతను- భద్రతా భావాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని క‌ల‌త చెందారు.

అయితే ఈ ఎపిసోడ్ లో న‌టి ఎవ‌రు? అనేదానికంటే.. ఇలాంటి ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? అనేది చాలా ముఖ్యం. ఈ రకమైన డిజిటల్ పైరసీ- గోప్యతా ఉల్లంఘనలపై భారతదేశంలో చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకునేందుకు పటిష్టమైన చట్టాలు అందుబాటులో ఉన్నాయి. అది సెల‌బ్రిటీ అయినా, సామాన్య మ‌హిళ అయినా వెంట‌నే త‌గిన‌న్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రధాన చట్టాలు - నిబంధనలు:

భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్ - సెక్షన్ 77):

మహిళల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా లేదా వారి అనుమతి లేకుండా ప్రైవేట్ -ఇంటిమేట్ దృశ్యాలను రికార్డ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం లేదా ప్రచారం చేయడం నేరం కిందకు వస్తుంది. తొలిసారి తప్పు చేసిన వారికి 1 నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష- జరిమానా విధిస్తారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ (ఐటి యాక్ట్ - సెక్షన్ 67 & 67ఏ):

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, వెబ్‌సైట్లు లేదా మెసేజింగ్ యాప్‌ల ద్వారా అసభ్యకరమైన- లైంగికపరమైన లేదా వ్యక్తిగత ఇంటర్‌మేట్ వీడియోలను లీక్ చేయడం, షేర్ చేయడం లేదా ఫార్వర్డ్ చేయడం లాంటి చర్యలకు పాల్పడితే ఐటీ చట్టం కింద కఠిన శిక్షలు ఉంటాయి. దీని కింద 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష-భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.

కాపీరైట్ చట్టం:

సినిమాకు సంబంధించిన ఒరిజినల్ కంటెంట్‌ను లేదా లీకైన క్లిప్‌లను అనధికారికంగా టెలిగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ లేదా టోరెంట్స్ ద్వారా షేర్ చేసే వారిపై కాపీరైట్ ఉల్లంఘన కింద కేసులు నమోదు చేస్తారు. ఇటీవల కాలంలో ఇలాంటి లీక్‌లకు పాల్పడిన పలువురు సైబర్ క్రైమ్ పోలీసుల చేతిలో అరెస్ట్ అయిన ఉదాహరణలు ఉన్నాయి.

బాధితులు తీసుకోవాల్సిన చర్యలు:

ఇంటర్‌మేట్ వీడియోలు లేదా లీకైన కంటెంట్ సోషల్ మీడియాలో కనిపిస్తే వెంటనే రాష్ట్ర లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (cybercrime.gov.in) ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఎక్స్, మెటా, యూట్యూబ్ ల‌కు చెందిన తొల‌గింపుపై గ్రీవెన్స్ అధికారులను సంప్రదించి.. ఆయా లింక్‌లను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవచ్చు. ఇలాంటి లీకైన వీడియోలను చూసేవారు లేదా ఇతరులకు షేర్ చేసేవారు కూడా చట్టపరంగా నేరస్తులే అవుతారనే విషయాన్ని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తుంటారు.