క్యాస్టింగ్ కౌచ్ కలకలం.. ఛాన్స్ ఇప్పిస్తానంటూ కార్లోనే!
సినిమాలపై కలలు కన్న ఎంతో మంది యూత్ కు సినీ ఇండస్ట్రీలో ఓ అవకాశాల ప్రపంచంలా కనిపిస్తుందని చెప్పాలి.
By: M Prashanth | 15 Jun 2026 9:49 AM ISTసినిమాలపై కలలు కన్న ఎంతో మంది యూత్ కు సినీ ఇండస్ట్రీలో ఓ అవకాశాల ప్రపంచంలా కనిపిస్తుందని చెప్పాలి. అయితే అదే చోట అవకాశాల పేరుతో మోసాలు, వేధింపులు జరుగుతున్నాయన్న ఆరోపణలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి మరో ఘటన బయటపడటం ఇప్పుడు కలకలం రేపింది. సినిమా అవకాశాలు కల్పిస్తానంటూ నమ్మించి, రెమ్యూనరేషన్ ఇవ్వడమే లేట్ చేయడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ సినీ నటి చేసిన ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులకు అందిన వివరాల ప్రకారం.. కొన్నేళ్లుగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఓ నటిని కొన్ని నెలల క్రితం ఓ వ్యక్తి సంప్రదించాడు. ఓ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ ఇప్పిస్తానని చెప్పి ఆమెను ఒప్పించాడు. అయితే ఆమె కూడా ఛాన్స్ పై ఆ మూవీలో నటించారు. కొన్ని నెలల పాటు జరిగిన షూటింగ్ లో పాల్గొని తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను రీసెంట్ గా కంప్లీట్ చేశారు.
అయితే షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అగ్రిమెంట్ ప్రకారం తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ తోపాటు ప్రయాణ ఖర్చులు కూడా చెల్లించకుండా ఆ వ్యక్తి పదేపదే వాయిదా వేస్తూ వచ్చాడని తెలిపింది. డబ్బులు ఎప్పుడు ఇస్తామని అడిగిన ప్రతిసారీ ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకున్నాడని బాధితురాలు ఆరోపించారు.
అదే సమయంలో రీసెంట్ గా పెండింగ్ పేమెంట్ విషయమై మాట్లాడేందుకు సిటీలోని ఓ ఏరియాకు రావాలని అతడు పిలిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు దిగాడని బాధితురాలు ఆరోపించారు. అక్కడితో ఆగకుండా బలవంతంగా కారులో తీసుకెళ్లి, ఫ్యూచర్ లో మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానంటూ తన వ్యక్తిగత కోరికలకు సహకరించాలని ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు. కాదు అంటే.. ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
భయపడిన బాధితురాలు అక్కడి నుంచి బయటపడి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఆమె తరఫు నుంచి ప్రశ్నించగా, వారితో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో చివరకు పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు తనకు రక్షణ కల్పించాలని కోరారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ఘటనకు సంబంధించిన అన్ని యాంగిల్స్ లో ప్రూఫులు సేకరిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇలాంటి సంఘటనలు మరోసారి సినీ ఇండస్ట్రీలో సెక్యూరిటీపై చర్చకు దారితీస్తున్నాయి. అవకాశాల కోసం వచ్చిన మహిళలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వస్తున్నాయి. మరోవైపు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆ వ్యవహారం దర్యాప్తులో ఉండగా, నిజానిజాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మరి చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
