విజయాదశమి ప్రత్యేక కథనం: బుల్లితెరపై..వెండితెరపై అమరమైన రావణాసురుడి పాత్రలు!
తెలుగు చలనచిత్ర రంగానికి గర్వకారణమైన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావు తెరపై శ్రీరాముడిగా, రావణాసురుడిగా రెండింట్లోనూ అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించారు.
By: Srikanth Kontham | 18 Oct 2026 7:00 PM ISTభారతీయ చలనచిత్ర, బుల్లితెర చరిత్రలో రామాయణ ఆధారిత చిత్రాలకు.. సీరియళ్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. శ్రీరాముడి విజయాన్ని విజయదశమి పర్వదినాన జరుపుకునే వేళ రామాయణంలో అత్యంత శక్తివంతమైన, సంక్లిష్టమైన రావణాసురుడి పాత్రను ప్రతిభావంతంగా పోషించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన నటుల గురించి మాట్లాడుకోవడం ఎంతో ఆసక్తికరం. 1917లో దాదాసాహెబ్ ఫాల్కే రూపొందించిన `లంకా దహన్` అప్ కమింగ్ నితేష్ తివారీ `రామాయణ` వరకు అనేక చిత్రాల్లో రావణుడి పాత్ర సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది.
తెలుగు చలనచిత్ర రంగానికి గర్వకారణమైన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావు తెరపై శ్రీరాముడిగా, రావణాసురుడిగా రెండింట్లోనూ అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించారు. 1958లో వచ్చిన `భూకైలాస్`, 1961లోని `సీతారామ కళ్యాణం` చిత్రాలలో రావణుడిగా ఆయన చూపిన రౌద్రం.. గంభీరమైన గొంతు.. ఆహార్యం ప్రేక్షకులను అబ్బురపరిచాయి. అటుపై 1963లో రిలీజ్ అయిన `లవకుశ`లో శ్రీరాముడిగా అలరించడం విశేషం. రావణాసురుడి వ్యక్తిత్వంలోని భక్తి పారవశ్యాన్ని.. అహంకారాన్ని ఎన్టీఆర్ ఆవిష్కరించిన తీరు చిరస్మరణీయం.
ఇక బుల్లితెర రంగంలో రామాయణం అనగానే గుర్తుకువచ్చే ఏకైక నటుడు అరవింద్ త్రివేది. రామానంద్ సాగర్ ప్రతిష్టాత్మక సీరియల్ `రామాయణ్` (1987)లో ఆయన పోషించిన రావణుడి పాత్ర భారతీయ గడపగడపకూ చేరింది. ఆయన నటనకు లభించిన ప్రజాదరణతో అరవింద్ త్రివేది `ఓజీ రావణ్` గా పేరుపొందారు. ఆ తర్వాత ఆనంద్ సాగర్ 2008 `రామాయణ్` సీరియల్లో అఖిలేంద్ర మిశ్రా రావణుడిగా మెప్పించారు. తొలుత కేవలం 6 నెలల కాంట్రాక్ట్తో నటించినా? ఆయన నటనకు వచ్చిన అపారమైన ఆదరణతో షూటింగ్ను మరింత కాలం పొడిగించారు.
వీరితో పాటు 2006లో ప్రారంభమైన `రావణ్` సీరియల్లో దివంగత నటుడు నరేంద్ర ఝా లంకాధిపతిగా న భూతో న భవిష్యత్ అన్నట్లుగా నటించి గుర్తింపు పొందారు. అలాగే `సంకట్ మోచన్ మహాబలి హనుమాన్` (2015-17)లో ఆర్య బబ్బర్, `విఘ్నహర్త గణేష్` (2019)లో పరాస్ ఛబ్రా, `రామ్ యుగ్` (2021) అనే ఓటీటీ సిరీస్లో కబీర్ దుహాన్ సింగ్ రావణాసురుడి పాత్రలలో తమదైన ముద్ర వేశారు. రావణుడిలోని మానవీయ కోణాలను.. అహంకారాన్ని వీరు వైవిధ్యంగా ప్రదర్శించారు.
ఆధునిక సినిమాలో డిజిటల్ విజువల్స్ ప్రాధాన్యత పెరిగిన కాలంలో సైఫ్ అలీ ఖాన్, రజనీష్ దుగ్గల్ రావణుడి పాత్రను కొత్త కోణంలో చూపించారు. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన `ఆదిపురుష్` (2023)లో సైఫ్ అలీ ఖాన్ రావణుడిని అహంకారానికి ప్రతిరూపంగా అభివర్ణిస్తూ సరికొత్త తరహాలో నటించారు. ఇటీవలే విడుదలైన `మహాకావ్య శ్రీ రామాయణ్ కథ`లో రజనీష్ దుగ్గల్ రావణుడిగా కనిపిస్తూ రావణుడు కేవలం బయటి శత్రువు మాత్రమే కాదు. మనలోని అహంకారం, కోపం, కోరికల రూపంలో ఉంటాడు` అని తన భావాన్ని వ్యక్తం చేశారు.
త్వరలో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం `రామాయణ: పార్ట్ 1`లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నారు. అందరికీ సుపరిచితమైన ఇలాంటి పౌరాణిక పాత్రను పోషించడం చాలా సవాలుతో కూడుకున్నదని.. ఐకానిక్ నటుల అడుగుజాడల్లో నడుస్తూ పాత్రకు కొత్తదనం తీసుకురావడం పెద్ద బాధ్యత అని యశ్ ఇటీవల పేర్కొన్నారు. దీంతో యశ్ పాత్రపై ఆసక్తి అంతకంతకు రెట్టింపు అవుతుంది.
