Begin typing your search above and press return to search.

"నేను ఏ హీరోయిన్ తోనూ మిస్ బిహేవ్ చేయలేదు": శివాజీ

తాను కావాలనే అమ్మాయిలకు దూరంగా ఉంటానని, ఎవరైనా అమ్మాయిలు దగ్గరగా కనిపిస్తే తాను దూరంగా జరిగిపోతానని శివాజీ అన్నారు.

By:  M Prashanth   |   24 Dec 2025 6:11 PM IST
నేను ఏ హీరోయిన్ తోనూ మిస్ బిహేవ్ చేయలేదు: శివాజీ
X

దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నటుడు శివాజీ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో హీరోయిన్లతో తన ప్రవర్తన ఎలా ఉంటుంది, తన వ్యక్తిత్వం ఎలాంటిది అనే విషయాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన కెరీర్ లో ఏ హీరోయిన్ తోనూ, ఎప్పుడూ చిన్నగా కూడా అసభ్యంగా ప్రవర్తించలేదని, ఇకపై కూడా చేయనని శివాజీ స్పష్టం చేశారు. తనకు చాలామంది హీరోయిన్లు తెలుసని, వారందరినీ తాను ఎంతో గౌరవిస్తానని చెప్పారు. తాను నటించిన హీరోయిన్లందరినీ ఇప్పటికీ 'మేడమ్' అనే పిలుస్తానని గుర్తుచేశారు. భూమిక, లయ, రంభ, సంఘవి.. ఇలా ఎవరితో నటించినా వారికి పూర్తి గౌరవం ఇస్తానని తెలిపారు.

తాను కావాలనే అమ్మాయిలకు దూరంగా ఉంటానని, ఎవరైనా అమ్మాయిలు దగ్గరగా కనిపిస్తే తాను దూరంగా జరిగిపోతానని శివాజీ అన్నారు. తన ప్రవర్తన చూసి చాలామంది తనకు 'ఆటిట్యూడ్' అని అనుకుంటారని, కానీ అది ఆటిట్యూడ్ కాదని, భయం అని వివరించారు. ఏదో ఒకరోజు చిన్న తప్పు కూడా మనకు గుదిబండలా మారి కూర్చుంటుందని, అందుకే తాను ఎప్పుడూ తన పరిధుల్లోనే ఉంటానని వివరించారు.

ఎవరో చేసిన తప్పులకు, ఎవరో చేసిన పనులకు మనం ఎందుకు బాధ్యులం అవ్వాలి, ఆ నింద మన నెత్తి మీదకు ఎందుకు రావాలి అనేదే తన ఉద్దేశం అని శివాజీ అన్నారు. "ఏ దరిద్రం వల్ల మనం బ్యాడ్ అవ్వాల్సి వస్తుందో.. వాళ్లు ఎక్కడ అవుతారో.. ఆ పాపం మనకెందుకు" అనేదే తన క్యారెక్టర్ అని స్పష్టం చేశారు.

చివరగా, తన క్యారెక్టర్ గురించి గొప్పగా చెప్పుకుని హైలైట్ అవ్వాలనే ఉద్దేశం తనకు లేదని శివాజీ క్లారిటీ ఇచ్చారు. కేవలం జరిగిన తప్పుకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే ప్రజలకు, మీడియాకు సంజాయిషీ ఇస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో తాను ఎప్పుడు ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడింది లేదని అన్నారు. కేవలం ఒక తండ్రి తరహాలో ఆలోచించి ఆడబిడ్డలను ఎవరు తప్పుగా చూడకూడదు అనే ఒకే ఒక్క ఆలోచన తనదని తెలిపారు.

నేను వాడిన భాష తప్పు అయ్యి ఉండవచ్చు, వాటికి మళ్లీ మళ్లీ క్షమాపణ చెబుతున్నాను. ఇంకా చెబుతూనే ఉంటాను. కానీ నా ఇంటెన్షన్ ఏదైతే ఉందో బట్టలు సరిగా వేసుకోవాలి అనే మాటపై మాత్రం కట్టుబడి ఉంటానని అన్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని నటీమణులను గౌరవంగా చూడాలనే ఆలోచన తనదని అన్నారు.