యువతలో డ్రగ్స్ మహమ్మారీపై నటి ఆందోళన
నేటి సమాజంలోకి డ్రగ్స్ ఎంతగా పాకిపోయిందో తెలుసుకుంటే గుండెల్లో దడ పుడుతుంది.
By: Sivaji Kontham | 2 Jan 2026 4:31 PM ISTనేటి సమాజంలోకి డ్రగ్స్ ఎంతగా పాకిపోయిందో తెలుసుకుంటే గుండెల్లో దడ పుడుతుంది. కాలేజీలు, స్కూల్స్ లో పిల్లలకు కూడా మాఫియాలు డ్రగ్స్ అలవాటు చేస్తున్నాయి. వ్యాపారం కోసం, ధనార్జన కోసం కొందరు దగుల్బాజీలు ఇలాంటి పనులు చేస్తున్నారు. దీని వెనక రాజకీయ అండ గురించి చర్చ సాగుతోంది. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్- వైజాగ్ లాంటి చోట్ల ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజ్ లు మొదలు, మారుమూల స్కూళ్లలోను డ్రగ్స్ - గంజాయి నెట్ వర్కుల గురించి మాట్లాడుకోవడం పరిపాటిగా మారింది.
ఇప్పుడు ఇదే విషయంపై నటి రోహిణి మాట్లాడుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. మన చుట్టూ ఉన్నవారిని మనమే సరి చేయాలని అన్నారు. ముఖ్యంగా పిల్లలకు ఎది మంచి ఏది చెడు? అనేది తల్లిదండ్రులు వివరించి చెప్పాలని కూడా సూచించారు. డ్రగ్స్ ఎంత ప్రమాదకరమో, ఎంత హానికరమో పేరెంట్ పిల్లలకు చెప్పాలన్నారు. స్నేహితుల కారణంగా ఇలాంటి అలవాట్లు దరి చేరనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా రోహిణి సూచించారు.
పిల్లలకు ఎలాంటి బట్టలు వేసుకుని వెళ్లాలో కూడా మనం నేర్పించాలి. ఇక్కడ చీరలు కట్టుకుంటే, లండన్ లో షార్ట్ లు, స్కర్టులు తొడుక్కుని బయటకు వెళతారు. అది అక్కడ అలవాటు. కానీ మనం ఇక్కడ ప్రతిదీ నేర్పించాలి అని రోహిణి అన్నారు. చెడు అలవాట్లతో ఎలాంటి నష్టం వాటిల్లుతుందో పిల్లలకు మనం వివరించాలని సూచించారు. వారు విన్నా వినకపోయినా చెప్పడం మన బాధ్యత అని అన్నారు.
ఇంట్లో ఆడది వండాలని అమ్మ చెబుతుంది. అబ్బాయి సంపాదించాలని కూడా చెబుతుంది. అయితే అమ్మాయి ఎలా ఉండాలో అబ్బాయి ఎలా ఉండాలో చెప్పేటప్పుడు సమానత్వం అవసరం. ``అలా కాదు ఇద్దరూ కలిసి పని చేయాలని అమ్మ చెప్పాల``ని కూడా అన్నారు. స్త్రీకి సమాన హోదాను ఇవ్వాలని కూడా సూచించారు. బయట అభ్యుదయ భావాల గురించి మాట్లాడేవాళ్లు ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించాలని రోహిణి అన్నారు. మొత్తానికి ఆడవారి దుస్తుల విధానం గురించి, స్త్రీ సమానత్వం గురించి రోహిణి అన్న మాటలు ఇప్పుడు చర్చగా మారాయి. సీనియర్ నటి రోహిణి ఇటీవలి కాలంలో తెలుగు సినిమాలలో సహాయ నటిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.
