చనిపోయానని ప్రచారం చేస్తున్నారు.. నటుడి ఆవేదన!
నేను బతికుండగానే చనిపోయానని ప్రచారం చేస్తున్నారు. ఒక వ్యక్తి దానిని సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసాడు. అతడి తప్పుడు ప్రకటన చాలా గందరగోళం సృష్టించింది.
By: Sivaji Kontham | 22 Aug 2025 10:45 PM IST``నేను బతికుండగానే చనిపోయానని ప్రచారం చేస్తున్నారు. ఒక వ్యక్తి దానిని సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసాడు. అతడి తప్పుడు ప్రకటన చాలా గందరగోళం సృష్టించింది. చాలా మంది పరిశ్రమ సహచరులు ఫోన్లు చేస్తున్నారు. మెసేజ్ లు పంపుతున్నారు. అందరికీ సమాధానం ఇవ్వలేక నాలుక ఎండిపోతోంది. నేను చాలా అలసిపోయాను. ఆ తప్పుడు వ్యక్తి చేసిన పనికి చాలా ఇబ్బందులకు గురవుతున్నాను`` అని ఆవేదన చెందారు ప్రముఖ హిందీ నటుడు రజా మురాద్.
సోషల్ మీడియా పోస్ట్‌లో తాను చనిపోయానని ప్రకటించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు ఆయన. 73 ఏళ్ల మురాద్ తనపై సాగించిన తప్పుడు ప్రచారంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఈ ప్రకటన అనవసరమైన భయాందోళనలకు కారణమైందని అన్నారు.
కొందరు వ్యక్తులు నాకు అర్థం కాని కారణాల వల్ల నాపై ఇలాంటి దుష్ప్రచారానికి ఒడికడుతున్నారు. నా ఉనికి కారణంగా వారంతా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే వారంతా నాపై విచారిస్తున్నారు. అతడు ఎవరో నేను చనిపోయానని వార్తలను పోస్ట్ చేశారు.. సంతాపాన్ని తెలిపాడు. నా పుట్టినరోజు, నకిలీ డెత్ డేట్ వంటి వివరాలను కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేసాడు..ఇది చాలా తీవ్రమైనది.. అని అన్నారు.
నేను బతికే ఉన్నానని పదే పదే ప్రజలకు చెప్పడం వల్ల నా గొంతు, నాలుక, పెదవులు ఎండిపోయాయి. తప్పుడు ప్రచారం బాధించింది అని అన్నారు. నాపై ఇలాంటి ప్రచారం చేసిన వ్యక్తికి అనారోగ్యకరమైన మనస్తత్వం ఉంది. అతను విలువైనదేమీ సాధించని వ్యక్తిలా ఉన్నాడు! అంటూ మురాద్ కామెంట్ చేసారు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి ఎఫ్ ఐఆర్ దాఖలు చేసే పనిలో ఉన్నారు. బాద్యులైన వారిపై చట్ట పరమైన చర్చలు తీసుకుంటారని కూడా హామీ ఇచ్చారు.
తన అద్భుతమైన వాయిస్, నట ప్రతిభతో రజా మురాద్ పరిశ్రమలో పాపులరయ్యారు. ఇటీవల హిందీ టీవీ షో మేఘ బర్సెంజ్ - ప్రైమ్ వీడియో డాక్యుమెంట్-సిరీస్ సినిమా మార్తే దమ్ తక్ లలో కనిపించారు. జోధా అక్బర్, గోలియోం కి రాస్లీలా రామ్-లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్ వంటి భారీ చిత్రాలలో అతడు నటించాడు.
