మణిరత్నం తర్వాత నా కలల దర్శకుడు అతడే: ఆనంద్
తాజాగా సీనియర్ నటుడు ఆనంద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 22 Jun 2026 7:19 PM ISTసినీ పరిశ్రమలో యాక్టర్లు, డైరెక్టర్లను ప్రశంసించడం కొత్త విషయమేమీ కాదు. కానీ ఒక డైరెక్టర్ వర్క్ కు అంతగా ముగ్ధుడై, అతనితో పని చేయాలనే కోరికను బహిరంగంగా వ్యక్తం చేయడం మాత్రం అరుదుగా జరుగుతుంది. ముఖ్యంగా దశాబ్దాల అనుభవం ఉన్న ఓ సీనియర్ నటుడు అలాంటి మాటలు చెబితే వాటికి మరింత ప్రాధాన్యం ఏర్పడుతుంది. తాజాగా సీనియర్ నటుడు ఆనంద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.
తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన ఆనంద్‌కు డైరెక్టర్ మణిరత్నం అంటే ప్రత్యేకమైన గౌరవం. కెరీర్ ప్రారంభ దశలోనే మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తుంటారు. ఒకప్పుడు మణిరత్నంతో పని చేయాలనే కలలు కనేవాడినని ఆనంద్ చెబుతుంటారు. అయితే చాలా ఏళ్ల తర్వాత మరో డైరెక్టర్ విషయంలో కూడా తనకు అదే స్థాయి ఆకర్షణ కలిగిందని ఆయన వెల్లడించడం విశేషం. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. వెంకటేష్ మహా. తన సినిమాల ద్వారా ప్రత్యేకమైన కథనశైలిని పరిచయం చేసిన వెంకటేష్ మహా పనితనం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని ఆనంద్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఒక సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ గా అతనిపై తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని ఆయన పేర్కొన్నారు.
సాధారణంగా ఆడియన్స్ లేదా కొత్తవాళ్లు డైరెక్టర్ల అభిమానులుగా మారడం సహజం. కానీ ఎన్నో సినిమాలు చూసిన, అనేక మంది దర్శకులతో కలిసి పని చేసిన ఓ సీనియర్ నటుడు ఒక యంగ్ డైరెక్టర్ వర్క్ కి అంతగా కనెక్ట్ కావడం అరుదైన విషయమే. ఆ అభిమానం ఎంత స్థాయికి వెళ్లిందంటే, అతనితో తప్పకుండా పని చేయాలనే ఆలోచన ఆనంద్‌లో బలంగా ఏర్పడిందట. ఈ క్రమంలో వెంకటేష్ మహాను సంప్రదించేందుకు కూడా ప్రయత్నించినట్లు ఆయన తెలిపారు. ఓ సందర్భంలో అతని ఫోన్ నంబర్ సంపాదించి మాట్లాడేందుకు ప్రయత్నించినా అది సాధ్యపడలేదని చెప్పారు. అయినప్పటికీ తన అభిమానంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని, డైరెక్టర్ గా అతని ఆలోచనా విధానం తనను విపరీతంగా ఆకట్టుకుందని పేర్కొన్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆ అభిమానాన్ని గుర్తుగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో వెంకటేష్ మహా ఫొటోను ప్రింట్ తీసుకుని ఇంట్లోనే ఉంచుకున్నానని ఆనంద్ వెల్లడించారు. ఒక డైరెక్టర్ పట్ల నటుడికి ఉన్న గౌరవం ఎంత లోతుగా ఉంటుందో ఈ సంఘటన చెప్పకనే చెబుతోంది. అయితే కాలం గడిచేకొద్దీ ఆనంద్ కోరిక కూడా నెరవేరింది. తర్వాత స్వయంగా వెంకటేష్ మహా నుంచి సంప్రదింపు రావడంతో ఇద్దరి మధ్య వృత్తిపరమైన అనుబంధం ఏర్పడింది. అంతేకాదు, ఆయన రూపొందిస్తున్న రావు బహదూర్ లో కీలక పాత్ర చేసే అవకాశం కూడా దక్కింది. ఒకప్పుడు అభిమానిగా చూసిన డైరెక్టర్ తో ఇప్పుడు కలిసి పని చేసే స్థాయికి చేరుకోవడం ఆనంద్‌కు ప్రత్యేక అనుభూతినే మిగిల్చి ఉండొచ్చు. మణిరత్నం తర్వాత మరో డైరెక్టర్ గురించి ఇంత గొప్పగా మాట్లాడటం ద్వారా ఆనంద్, వెంకటేష్ మహాపై తనకున్న గౌరవాన్ని మరోసారి స్పష్టంగా చాటిచెప్పారు. సినీ పరిశ్రమలో టాలెంట్ కు వయసు, అనుభవం అనే పరిమితులు ఉండవని ఈ ఉదంతం మరోసారి గుర్తుచేస్తోంది.
