అజయ్ ఫ్యామిలీ పిక్స్ చూశారా?
సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు కూడా బయటకు వస్తున్న విషయం తెలిసిందే .
By: Madhu Reddy | 21 Oct 2025 12:01 PM ISTసోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు కూడా బయటకు వస్తున్న విషయం తెలిసిందే . ముఖ్యంగా ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు సెలబ్రిటీలు తమ కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను ఇలా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిన్న దేశవ్యాప్తంగా దీపావళి పండుగ ఘనంగా జరిగింది. సెలబ్రిటీలు కూడా ఒకరికి మించి మరొకరు చాలా గ్రాండ్గా తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తెరకే పరిమితమైన చాలామంది సెలబ్రిటీలు ఇప్పుడు కుటుంబాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేస్తున్నారు.
అలాంటి వారిలో ప్రముఖ నటుడు అజయ్ కూడా ఒకరు అని చెప్పాలి. చాలా రిజర్వ్డ్ గా ఉండే అజయ్ తాజాగా దీపావళి సెలబ్రేషన్స్ లో భాగంగా తన కుటుంబాన్ని అందరికీ పరిచయం చేశారు. తన భార్య శ్వేత రావురితో పాటూ ఇద్దరు కొడుకులతో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అజయ్ ఫ్యామిలీ చాలా క్యూట్ గా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
మరి కొంతమంది అజయ్ కి ఇంత పెద్ద కొడుకులు ఉన్నారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు అజయ్ భార్య కూడా హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదని.. తన అందంతో ఆమె అందర్నీ కట్టిపడేస్తోందని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే అజయ్ పెద్ద కొడుకును చూస్తే మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు.. మంచి హీరో కటౌట్ అంటూ కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ క్యూట్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అజయ్ కెరియర్ విషయానికి వస్తే.. విజయవాడలో జన్మించిన ఈయన తండ్రి ఉద్యోగరీత్యా నెల్లూరు, తిరుపతి లకు బదిలీ కావడంతో తన విద్యాభ్యాసాన్ని ఆ ప్రాంతాలలోనే పూర్తి చేశారు.. 1995లో ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని ఒక కాలేజీలో చేరాడు. అక్కడే నటన మీద ఆసక్తితో మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరి నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు. అజయ్ ఇండస్ట్రీలోకి రావాలన్న కోరికను తన తండ్రికి చెప్పడంతో ఆయన కూడా కాదనలేక కొడుకును ఈ దిశగా ప్రోత్సహించినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే అజయ్ తండ్రికి దర్శకుడు వేమూరి జ్యోతి కుమార్ పరిచయం ఉండడంతో కౌరవుడు అనే సినిమాలో అవకాశం కల్పించారు. తొలి సినిమాలో అయితే తండ్రి పలుకుబడితో అవకాశం వచ్చింది కానీ ఆ తర్వాత అవకాశాల కోసం దాదాపు 9 నెలలు ఎదురు చూశారట. చివరికి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి సహకారంతో ఖుషీ సినిమా నటీనటుల సెలెక్షన్స్ లో ఎంపికయ్యారు. అందులో ఆకతాయి పాత్ర ఈయనకు మంచి గుర్తింపును అందించింది. ఆ తర్వాత ఒక్కడు సినిమా ఈయనకు ఊహించని పాపులారిటీ సాధించి పెట్టింది. ఎమ్మెస్ రాజు, రాజమౌళి వంటి దిగ్గజ దర్శకులు ఈయనకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మహేష్ బాబు నటించి బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఒక్కడు, అతడు, పోకిరి చిత్రాలలో అజయ్ నటించడం విశేషం.
