హీరోగా దర్శకుడు.. నిర్మాతగా రజినీ కూతురు
ఒకప్పటితో పోలిస్తే బాగా క్వాలిటీ, సక్సెస్ రేట్ పడిపోయిన తమిళ సినీ రంగంలో ఈ మధ్య ఓ మంచి సినిమా ఘనవిజయాన్నందుకుని, ఇతర భాషల వాళ్లను సైతం మెప్పించింది.
By: Garuda Media | 29 Aug 2025 9:37 AM ISTఒకప్పటితో పోలిస్తే బాగా క్వాలిటీ, సక్సెస్ రేట్ పడిపోయిన తమిళ సినీ రంగంలో ఈ మధ్య ఓ మంచి సినిమా ఘనవిజయాన్నందుకుని, ఇతర భాషల వాళ్లను సైతం మెప్పించింది. ఆ చిత్రమే.. టూరిస్ట్ ఫ్యామిలీ. సూర్య లాంటి పెద్ద స్టార్ నటించిన ‘రెట్రో’ను వెనక్కి నెట్టి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని రూపొందించింది కేవలం 25 ఏళ్ల వయసున్న ఒక కొత్త కుర్రాడు కావడం విశేషం. తన పేరు.. అభిషాన్ జీవింత్. ఇంత చిన్న వయసులో అంత మెచ్యూర్డ్‌గా, బలమైన ఎమోషన్లతో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాను డీల్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అభిషాన్ ఆ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర కూడా పోషించాడు. నటుడిగానూ అతడికి మంచి మార్కులు పడ్డాయి. ఈ గుర్తింపుతో ఇప్పుడతను హీరోగా కూడా మారుతున్నాడు.
అభిషాన్ హీరోగా నటిస్తున్న చిత్రానికి అతను దర్శకుడు కాదు. మదన్ తనే మరో యంగ్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో అతడి సరసన మలయాళ సెన్సేషన్ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది. టీనేజీ నుంచే ప్రతిభ చాటుకుంటూ ఇప్పుడు కథానాయికగా మంచి స్థాయికి చేరుకుంది అనస్వర. మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి పెద్ద స్టార్లతో నటించిన ఆమె వరుస విజయాలతో ఊపుమీదుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించి మరో స్పెషాలిటీ ఏంటంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య ఒక నిర్మాతగా వ్యవహరించనుంది. ఆమె రజినీతో ‘కోచ్చడయాన్’ అనే యానిమేటెడ్ మూవీని రూపొందించింది. తర్వాత ధనుష్ కథానాయకుడిగా ‘వీఐపీ-2’ తీసింది. ఇప్పుడు అభిషాన్ చిత్రంతో ప్రొడక్షన్లోకి అడుగు పెడుతోంది. బహు భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.
