Begin typing your search above and press return to search.

ఇండియాలో పాకిస్తాన్ నటుడు సినిమా విడుదల.. మండిపడుతున్న ప్రజలు!

పహల్గామ్ ఎటాక్ ఎంతోమందిని కన్నీళ్లు పెట్టించింది. పహల్గామ్ అందాలను చూడడానికి వెళ్లిన ఎంతోమంది టూరిస్టులను పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్చి చంపేశారు.

By:  Madhu Reddy   |   11 Aug 2025 3:22 PM IST
ఇండియాలో పాకిస్తాన్ నటుడు సినిమా విడుదల.. మండిపడుతున్న ప్రజలు!
X

పహల్గామ్ ఎటాక్ ఎంతోమందిని కన్నీళ్లు పెట్టించింది. పహల్గామ్ అందాలను చూడడానికి వెళ్లిన ఎంతోమంది టూరిస్టులను పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. కొంతమంది అయితే హిందువా.. ముస్లిమా.. అని అడిగి మరీ చంపేశారు.ఇంకొంత మంది భార్యల ముందే భర్తలను కిరాతకంగా చంపేశారు. ఇక కొత్తగా పెళ్లయిన జంట హనీమూన్ కోసం వెళ్లి.. భర్త శవంతో తిరిగి వచ్చింది. ఇలా ఎన్నో ఘోరాలు చూసాం. అయితే ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్రమూకపై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. దీంతో పాకిస్తాన్ - భారత్ మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలోనే మే 9న విడుదలవ్వాల్సిన పాకిస్తాన్ నటుడు నటించిన 'అబీర్ గులాల్' మూవీ వాయిదా పడింది. ఏప్రిల్ 22న పహల్గామ్ అటాక్ జరగడంతో మే9న విడుదల కావాల్సిన అబీర్ గులాల్ మూవీకి ఆటంకం వచ్చింది.

ఈ సినిమాని ఇండియాలో విడుదల చేయడానికి వీల్లేదు అంటూ పెద్ద ఎత్తున జాతీయవాదులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఈ సినిమా వాయిదా పడింది. అయితే తాజాగా అబీర్ గులాల్ మూవీ ఇండియాలో విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అబీర్ గులాల్ మూవీ ఆగస్టు 29న విడుదల కాబోతుండడంతో దీనిపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ హీరో నటించిన ఈ సినిమాని ఇండియాలో విడుదల చేయడం ఏంటి? అంటూ చాలామంది ఈ విషయంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చాలామంది జాతీయవాదులు ఈ సినిమా విడుదలను అడ్డుకుంటాం అంటూ హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను విడుదల చేసే థియేటర్ యాజమాన్యంపై కూడా జాతీయవాద సంఘాలు విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది.మరి ఈ సినిమాని ఇండియాలో విడుదల చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.

పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్, ఇండియన్ నటి వాణీ కపూర్ నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ అబీర్ గులాల్.. ఈ చిత్రాన్ని నిలిపివేయాలని దేశవ్యాప్తంగా చాలామంది హెచ్చరిస్తున్నారు. అయితే ఇండియాలోనే కాదు పాకిస్తాన్ లో కూడా ఈ సినిమాని బ్యాన్ చేయాలంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో హీరో పాకిస్తానీ అయినప్పటికీ హీరోయిన్ ఇండియన్ కావడంతో అక్కడి వాళ్ళు కూడా ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నారు.

ఇలాంటి వివాదాన్నే సర్దార్ జీ -3 అనే మూవీ కూడా ఎదుర్కొంది. ఎందుకంటే దిల్జిత్ దోసాంజ్ నటించిన ఈ సినిమాలో పాకిస్తానీ నటి హనియా అమీర్ నటించడంతో ఈ సినిమాపై కూడా వ్యతిరేకత వచ్చింది. దాంతో ఈ సినిమాని ఇండియాలో విడుదల చేయలేదు. ఇప్పుడు అబీర్ గులాల్ మూవీని ఇండియాలో విడుదల చేయడానికి అనుమతి లభించినప్పటికీ ఈ సినిమా విడుదల సమయంలో ఇంకెన్ని నివాదాలు సృష్టిస్తారో అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఎన్నో విమర్శలు, విభేదాల మధ్య విడుదల కాబోతున్న అబీర్ గులాల్ సినిమా అసలు థియేటర్లోకి వస్తుందా? వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది.