Begin typing your search above and press return to search.

పెద్ద సినిమాల బడ్జెట్ రికవరీ.. 'నాగబంధం' డైరెక్టర్ అలా అన్నారేంటి?

పెద్ద సినిమాలు నిజంగా తమ బడ్జెట్ ను కంప్లీట్ గా రికవరీ చేసుకుంటున్నాయా? బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్లు సాధించిన చిత్రాలు కూడా నిజంగా లాభాల్లో ఉన్నాయా? ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఇవే ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి.

By:  M Prashanth   |   20 Jun 2026 11:43 AM IST
పెద్ద సినిమాల బడ్జెట్ రికవరీ.. నాగబంధం డైరెక్టర్ అలా అన్నారేంటి?
X

పెద్ద సినిమాలు నిజంగా తమ బడ్జెట్ ను కంప్లీట్ గా రికవరీ చేసుకుంటున్నాయా? బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్లు సాధించిన చిత్రాలు కూడా నిజంగా లాభాల్లో ఉన్నాయా? ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఇవే ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి కారణం నాగబంధం మూవీ దర్శకుడు అభిషేక్ నామా చేసిన కామెంట్సే. "నాకు ఒక పెద్ద సినిమా పేరు చెప్పండి.. పూర్తిగా రికవరీ అయిన సినిమా" అంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జూలై 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా అభిషేక్ నామా మాట్లాడారు. సినిమాల సక్సెస్, ఫెయిల్యూర్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఏ సినిమాకు గ్యారెంటీ ఉంటుంది? నేనే 'శ్రీమంతుడు' చేశాను.. నేనే 'బ్రహ్మోత్సవం' కూడా చేశాను. సినిమాల విషయంలో లాజిక్ ఉండదు. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ అనే మాట ఉండేది. ఇప్పుడు ఎంత పెద్ద సినిమా చేసినా గ్యారెంటీ లేదు" అని అన్నారు.

అంతేకాదు, ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల పరిస్థితిపై కూడా ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. "ఒక పెద్ద సినిమా పేరు చెప్పండి.. పూర్తిగా రికవరీ అయిన సినిమా" అంటూ ప్రశ్నించడం ద్వారా ఇండస్ట్రీలో పెరుగుతున్న ప్రొడక్షన్ ఖర్చుపై ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. అభిషేక్ నామా చేసిన ఆ కామెంట్స్ ఆయన లేటెస్ట్ మూవీ నాగబంధం బడ్జెట్ నేపథ్యంలో ఇంపార్టెన్స్ సంతరించుకున్నాయి.

ఆ సినిమా కోసం రూ.100 కోట్ల నుంచి రూ.130 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రారంభంలో అనుకున్న బడ్జెట్ కంటే నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగిందని తెలుస్తోంది. రామానాయుడు స్టూడియోస్‌ లో నిర్మించిన భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్లు ఆ బడ్జెట్ కు మెయిన్ రీజన్స్ గా తెలుస్తోంది. ముఖ్యంగా కేచా ఖంఫక్డీ రూపొందించిన క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ కే దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

అలాగే అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని రిఫ్లెక్ట్ చేసే ప్రత్యేక సెట్, ఒక పాట చిత్రీకరణ కోసం మరో రూ.10 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. సినిమాలో హీరోగా నటిస్తున్న విరాట్ కర్ణకు ఇంకా పెద్ద స్టార్ ఇమేజ్ లేదు. అయినప్పటికీ టీజర్, ట్రైలర్‌ కు వచ్చిన రెస్పాన్స్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో భారీ బడ్జెట్ ను ఆ సినిమా ఎలా రికవరీ చేస్తుందన్న చర్చ కూడా సాగుతోంది.

ఇదే సమయంలో అభిషేక్ నామా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన మాటల్లో వాస్తవం ఉందని, ప్రస్తుతం బడ్జెట్లు విపరీతంగా పెరగడంతో లాభాలు కనిపించడం కష్టమైందని అంటున్నారు. మరికొందరు మాత్రం ఇటీవల కొన్ని పాన్ ఇండియా చిత్రాలు భారీ లాభాలు అందుకున్నాయని గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా నాగబంధం ట్రైలర్‌ తో పాటు అభిషేక్ నామా కామెంట్స్ కూడా సినిమాకు ఎక్స్ ట్రా ప్రమోషన్ ను తీసుకొచ్చాయి. భారీ అంచనాల మధ్య వస్తున్న ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో అంతా వేచి చూడాలి.