బిగ్ బి అమితాబ్ స్టార్‌డమ్ వెనుక అసలు నిజం!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బిగ్ బిగా వెలిగిపోతున్న అమితాబ్ బచ్చన్ అనగానే? కోట్లాది మంది అభిమానులకు మహానటుడు, సూపర్ స్టార్ గుర్తుకొస్తారు.
By: Srikanth Kontham | 11 Oct 2026 5:00 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో బిగ్ బిగా వెలిగిపోతున్న అమితాబ్ బచ్చన్ అనగానే? కోట్లాది మంది అభిమానులకు మహానటుడు, సూపర్ స్టార్ గుర్తుకొస్తారు. కానీ ఆయన వెనుక ఉన్న సాధారణ తండ్రిని, తాతను సమాజం తరచూ మరిచిపోతుంటుందని అమితాబ్ తనయుడు, నటుడు అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. ఓ ప్రత్యేక సంభాషణలో అమితాబ్ బచ్చన్ ఇమేజ్ వెనుక ఉన్న మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ అభిషేక్ పంచుకున్న అభిప్రాయాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
`మా ఇంట్లో మాకూ అమితాబ్ బచ్చన్ హీరోనే. మేం కూడా ఆయన్ని ఆ కోణం నుంచే చూస్తాం. కానీ ప్రజలు తరచుగా ఆయన కూడా సాధారణ కుటుంబీకుడు. ఒక తండ్రి, ఒక తాత అనే విషయాన్ని మరిచిపోతుంటారు. అమితాబ్ బచ్చన్ అంటే? సూపర్ స్టార్ మాత్రమే అని ఆయనకు సాధారణ మనిషిలా భావోద్వేగాలు వ్యక్తం చేసే హక్కు లేదు అన్నట్లుగా కొందరు భావిస్తుంటారు. కానీ ఆయన కూడా అందరిలాగే ఒక తండ్రి, మా అమ్మ ఒక తల్లి. సాధారణ తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎలాంటి అనుభూతులకు గురవుతారో? వారు కూడా అలాగే స్పందించేందుకు పూర్తి హక్కు ఉంది` అని తెలిపారు.
ఇంట్లో లభించిన వాతావరణం, పెరిగిన తీరు గురించి వివరించారు. ఎంతటి స్టార్‌డమ్ ఉన్నా? ప్రజాదరణ, కీర్తి అనేవి శాశ్వతం కావనే విషయాన్ని తాను చిన్నతనంలోనే అర్థం చేసుకున్నానని అభిషేక్ తెలిపారు. `పబ్లిసిటీ .. కీర్తి అనేది ఎప్పటికీ స్థిరంగా ఉండదు. అది వస్తుంటుంది. పోతుంటుంది. కొన్ని సినిమాలు కాగానే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నా తండ్రి షూటింగ్ ముగించుకుని ఇంటికి రాగానే ఆయన అమితాబ్ బచ్చన్ కాదు. కేవలం నా తండ్రి మాత్రమే. ఆ వాతావరణంలో పెరగడం వల్లే నాకు స్టార్‌డమ్ పట్ల వ్యామోహం కలగలేదు` అని వెల్లడించారు.
తల్లిదండ్రుల ఆశయాలు, అభిమానం గురించి మాట్లాడుతూ... తాను ఏ పని చేసినా? దానికి నూరు శాతం శ్రమను అందించానని తెలిస్తే తల్లిదండ్రులు ఎప్పుడూ గర్వపడతారని అభిషేక్ తెలిపారు. పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణం పూర్తి చేసుకున్న తనకు నటనలో ఎలాంటి ప్రయత్నం చేసినా దానికి కుటుంబం నుంచి లభించే మద్దతు ఎంతో విలువైనదని పేర్కొన్నారు.
అమితాబ్ బచ్చన్ ప్రభావాన్ని గుర్తుచేసుకుంటూ ఒక నటుడిగా ఆయనకున్న శక్తి అపారమైనదన్నారు. కొన్ని రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నా? లేదా? చిన్న సన్నివేశంలో కనిపించినా? తెరపై ఆయన చూపించే ఇంపాక్ట్ మాటల్లో చెప్పలేనిదని అభిషేక్ అభిప్రాయపడ్డారు. ఒకే ఒక్క షాట్‌లో అమితాబ్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ మొత్తం పాత్ర స్వభావాన్ని.. ఆయనకున్న ఇమేజ్‌ను ప్రతిబింబిస్తుందని ప్రశంసించారు.
ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన `కౌన్ బనేగా కరోడ్‌పతి` కొత్త సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు అభిషేక్ బచ్చన్ .. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, సుహానా ఖాన్‌లతో కలిసి `కింగ్` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
