షాక్ ఇచ్చిన లెజెండ్ వారసుడు!
ఒక జట్టుకు యజమానిగా ఉన్నప్పుడు ఆ ఆటపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. జట్టు వ్యూహాల్లో పాలుపంచుకో వాలనేది తన అభిప్రాయంగా పంచుకున్నారు.
By: Srikanth Kontham | 14 April 2026 3:00 PM ISTబాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌కు క్రీడలంటే ఎంత ఆసక్తో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యేకించి క్రికెట్ అంటే? ఇండియా ఆడే ఏ మ్యాచ్ ను మిస్ అవ్వరు. తప్పకుండా స్టేడియంలో కూర్చుని ఆస్వాదిస్తారు. అయితే దేశంలో అత్యంత ఆకర్షణీయమైన, లాభదాయకమైన క్రీడా లీగ్ అయిన ఐపీఎల్ లో అభిషేక్ కు సొంత జట్టు ఎందుకు లేదు? అన్న ప్రశ్న చాలా కాలంగా అభిమానుల మదిలో మెదులుతూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై అభిషేక్ స్పందించారు. `ఐపీఎల్ జట్టును సొంతం చేసుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు.
అది భారీ ఆర్థిక పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం. నిజం చెప్పాలంటే ఐపీఎల్ జట్టును కొనడం చాలా ఖరీదైన పని. నా ఆర్థిక పరిమితుల దృష్ట్యా నాకు సాధ్యం కాలేదని సూటిగా చెప్పారు. కేవలం సెలబ్రిటీ హోదా ఉంది కదా అని ఆలోచించకుండా? ముందుకెళ్తే నష్టాలు వస్తే తట్టుకునే సామర్ధ్యం కూడా ఉండాలన్నారు. అలాగే క్రీడల పట్ల తనకున్న దృక్పథం కూడా ఒక కారణమని అభిషేక్ వివరించారు. `నేను కేవలం విఐపి బాక్స్‌లో కూర్చుని, గ్లామర్‌గా కనిపిస్తూ ప్రేక్షకులకు చేతులు ఊపే వ్యక్తిని కాదు. నాకు ఏ క్రీడలోనైనా లోతుగా నిమగ్నమవ్వడం ఇష్టం.
ఒక జట్టుకు యజమానిగా ఉన్నప్పుడు ఆ ఆటపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. జట్టు వ్యూహాల్లో పాలుపంచుకో వాలనేది తన అభిప్రాయంగా పంచుకున్నారు. అయితే అభిషేక్ బచ్చన్ కి ఐపీఎల్‌లో జట్టు లేకపోయినా? ఇతర క్రీడల్లో అభిషేక్ విజయవంతమైన యజమానిగా రాణిస్తున్నారు. ప్రో కబడ్డీ లీగ్‌లో `జైపూర్ పింక్ పాంథర్స్`, ఇండియన్ సూపర్ లీగ్‌లో `చెన్నైయిన్ ఎఫ్ సి (ఫుట్‌బాల్) జట్లను ఆయన నడిపిస్తున్నారు. ఈ రెండు జట్లూ ఆయా లీగ్‌లలో ఛాంపియన్లుగా నిలవడం విశేషం. కబడ్డీ, ఫుట్‌బాల్ వంటి క్రీడలను ప్రోత్సహించడంలో ఆయన చూపుతోన్న చొరవను క్రీడాభిమానులు ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉన్నారు.
అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యలు ఆయనలోని పరిణతిని తెలియజేస్తున్నాయి. సెలబ్రిటీలు అందరూ ఐపీఎల్ వైపు పరుగులు తీస్తుంటే? ఆయన మాత్రం తనకు ఇష్టమైన సమయం కేటాయించగలిగే క్రీడలను ఎంచుకున్నారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసం కాకుండా క్రీడాకారుల అభివృద్ధికి , ఆట పురోగతికి తోడ్పడటమే తన లక్ష్యమని ఈ సందర్భంగా అభిషేక్ చాటి చెప్పారు. ఐపీఎల్ టీమ్ కొనకపోవడంపై అభిషేక్ ఇచ్చిన వివరణ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోంది. గ్లామర్ ప్రపంచంలో ఉంటూనే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, క్రీడల పట్ల అంకితభావంతో వ్యవహ రించడం ఆయనను ఇతర సెలబ్రిటీల కంటే భిన్నంగా నిలబెట్టింది. భవిష్యత్తులో అభిషేక్ మరిన్ని క్రీడలను ప్రోత్సహిస్తూ భారతీయ క్రీడా రంగానికి తనవంతు సహకారం అందిస్తారని ఆశిద్దాం.
