Begin typing your search above and press return to search.

త‌న‌కంటే ఐశ్వ‌ర్యారాయ్ గ్రేట్ అనేసిన అభిషేక్!

బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ వివాహ బంధం పై ఏదో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

By:  Srikanth Kontham   |   4 April 2026 10:00 PM IST
త‌న‌కంటే ఐశ్వ‌ర్యారాయ్ గ్రేట్ అనేసిన అభిషేక్!
X

బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ వివాహ బంధం పై ఏదో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఈనేప‌థ్యంలో తాజాగా ఓ మీట్ లో అభిషేక్ బచ్చన్ వైవాహిక జీవితంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమ ఇద్దరి మధ్య బంధం అనేది కేవలం భార్యాభర్తల సంబంధం మాత్రమే కాదని అదోక పరిపూర్ణమైన భాగస్వామ్యం అని అభిప్రాయ‌ప‌డ్డారు. `తన తల్లి జయా బచ్చన్ పెళ్లి సమయానికి తండ్రి అమితాబ్ కంటే పెద్ద స్టార్ అని గుర్తు చేసుకున్నారు. అందుకే ఇంట్లో పురుషుడే ఆధిపత్యం చలాయించాలనే ధోరణిలో తాను పెరగలేదని చెప్పారు.

ఐశ్వర్యతో తన ప్రయాణం గురించి మాట్లాడుతూ, ` కెరీర్ ప్రారంభం నుండే ఆమె తనకు మంచి స్నేహితురాలని, ఆ స్నేహమే తమ మధ్య గౌరవాన్ని, అవగాహనను పెంచిందన్నారు. ఇద్ద‌రి మధ్య కెరీర్ పరంగా ఎప్పుడూ పోటీ లేదని అభిషేక్ వెల్లడించారు. తనకంటే ఐశ్వర్య ఎక్కువ సక్సెస్ సాధించినా తాను ఎప్పుడూ అసూయ పడలేదన్నారు. అది తమ మధ్య ఉన్న ఆరోగ్యకరమైన అవగాహనకు నిదర్శనమన్నారు. ఒకరి గెలుపును మరొకరు సెలబ్రేట్ చేసుకోవడమే తమ బంధంలోని గొప్పతనమని వివరించారు. ఈ విషయంలో తమ మధ్య ఎప్పుడూ చర్చలు కూడా జరగవని అదంతా చాలా సహజంగా సాగిపోతుందన్నారు. అయినా నా కంటే ఐశ్వ‌ర్యా రాయ్ గొప్ప‌ద‌నే చెబుతాన‌న్నారు.

వైవాహిక జీవితంలో పనులు పంచుకోవడం గురించి కూడా అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `నేను ఆహారం తీసుకువస్తాను. నువ్వు ఇల్లు చూసుకో` అనే నిబంధనలు తమ మధ్య లేవన్నారు. ఏదైనా పనిని ఇద్దరం కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగడమే తమ విజయ రహస్యంగా తెలిపారు. తన తండ్రి అమితాబ్ బచ్చన్ తనను లాంచ్ చేయలేదని, తన సొంత కష్టంతోనే ఈ స్థాయికి చేరానని, అదే ఆత్మవిశ్వాసం తన వ్యక్తిగత జీవితంలో కూడా ఉంటుందని పేర్కొన్నారు.

దీంతో గత కొన్నాళ్లుగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ వ‌స్తోన్న‌ పుకార్లకు అభిషేక్ మాటలు పరోక్షంగా చెక్ పెట్టినట్లు అయ్యింది. తమ వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచడానికే ప్రాధాన్యత ఇస్తామని అవసరమైనప్పుడు మాత్రమే స్పందిస్తామని స్పష్టం చేశారు. ఐశ్వర్యరాయ్ - అభిషేక్ 2007లో వివాహం చేసుకోగా వీరికి ఆరాధ్య అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ తన తదుపరి చిత్రం `కింగ్` షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన షారుక్ ఖాన్‌తో కలిసి నటిస్తున్నారు. అలాగే కొత్త ప్రాజెక్ట్ లు కొన్ని లాక్ చేసారు. అయితే వాటి వివ‌రాలు మాత్రం గోప్యంగా ఉంచారు.