Begin typing your search above and press return to search.

శృంగార చిత్రాలతోనే గ్లోబల్ వార్మింగ్ : న‌టుడి భార్య షాకింగ్ రెస్పాన్స్!

అయితే ఇదే వేదికపై అభినవ్ శుక్లా గతంలో నటించిన `అక్సర్ 2` చిత్రంలో ఉన్న శృంగార సన్నివేశాల గురించి రుబీనా చేసిన వ్యాఖ్యలు నెటిజన్లలో మరింత ఆసక్తిని పెంచాయి.

By:  Sivaji Kontham   |   23 July 2026 6:00 AM IST
శృంగార చిత్రాలతోనే గ్లోబల్ వార్మింగ్ : న‌టుడి భార్య షాకింగ్ రెస్పాన్స్!
X

పర్యావరణ వైపరీత్యాలు- గ్లోబల్ వార్మింగ్ లాంటి తీవ్రమైన అంశాలపై సెలబ్రిటీలు చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎంత పెద్ద దుమారం రేపుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ప్రముఖ నటి దియా మీర్జా `పితృస్వామ్యం` వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోందని అనడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటుడు అభినవ్ శుక్లా మరింత వింతైన `పోర్నోగ్రఫీ థియరీ`ని తెరపైకి తెచ్చి హాట్ టాపిక్‌గా మారారు. అడల్ట్ కంటెంట్ ప్రొడక్షన్ - ఆన్‌లైన్ డేటా సర్వర్ల నిర్వహణ వల్ల భారీగా విద్యుత్ ఖర్చయి పెద్ద ఎత్తున `కార్బన్ ఫుట్‌ప్రింట్` ఏర్పడుతుందని... తద్వారా పరోక్షంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోందని అభినవ్ విచిత్ర వివరణ ఇచ్చారు.

టీవీ తారలు రుబీనా దిలైక్, హీనా ఖాన్ తమ భాగస్వాములు అభినవ్ శుక్లా, రాకీ జైస్వాల్‌లతో కలిసి నిర్వహిస్తున్న `ది4POV` పోడ్‌కాస్ట్ షోలో ఈ డిబేట్ న‌డిచింది. శృంగార చిత్రాల వల్ల కలిగే మానసిక, శారీరక నష్టాల గురించి మాట్లాడిన అభినవ్.. పో*ర్న్ చూడటం వల్ల మనుషుల్లో వాస్తవ దూరమైన అంచనాలు పెరుగుతాయని, పురుషులలో పని చేసే ప్రేరణ, ఆత్మవిశ్వాసం తగ్గి వారు బలహీనులుగా మారతారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పోర్న్ చూడటం తీవ్రమైన ఒక వ్యసనం అని అన్నారు.

అయితే ఇదే వేదికపై అభినవ్ శుక్లా గతంలో నటించిన `అక్సర్ 2` చిత్రంలో ఉన్న శృంగార సన్నివేశాల గురించి రుబీనా చేసిన వ్యాఖ్యలు నెటిజన్లలో మరింత ఆసక్తిని పెంచాయి. ఒకవైపు పోర్న్ అడిక్షన్, నెగటివిటీ గురించి మాట్లాడే అభినవ్, తన సినిమాలో ఘాటైన లిప్-లాక్ .. రొమాంటిక్ సీన్స్‌లో నటించిన విషయాన్ని తాను నేరుగా థియేటర్‌లో సినిమా చూశాకే తెలుసుకున్నానని రుబీనా తెలిపారు. ఒక నటిగా స్క్రీన్ పై అలాంటి నటనతో తనకేమీ ఇబ్బంది లేదని... అయితే భార్యాభర్తల మధ్య ముందస్తు కమ్యూనికేషన్ లేకపోవడం... తనతో ఆ విషయాన్ని చర్చించకపోవడమే తనను తీవ్రంగా బాధించిందని రుబీనా ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వివాదంపై అభినవ్ శుక్లా స్పందిస్తూ తన వైపు వివరణ ఇచ్చారు. తాను ఆ సినిమా సైన్ చేసినప్పుడు ఆ సన్నివేశాల గురించి పూర్తి స్పష్టత లేదని...కేవలం లీడ్ రోల్ సాధించడంపైనే తన దృష్టి ఉందన్నారు. అంతేకాకుండా ఆ సమయంలో తన తల్లి క్యాన్సర్ చికిత్స పొందుతుండటం.... ప్రయాణాల వల్ల రుబీనాతో వివరంగా మాట్లాడే సమయం లేకపోవడం వల్లే చెప్పలేకపోయానని సమర్థించుకున్నారు. అయితే రుబీనా స్పందిస్తూ.. తాను ఎలాంటి స్క్రిప్ట్ వచ్చినా భర్తతో ప్రతీది చర్చిస్తానని, అభినవ్ అలా దాచడం తనను తీవ్రంగా క్షోభకు గురిచేసిందని పేర్కొన్నారు. ఈ విషయంలో రుబీనా బాధపడటం సమంజసమేనని.. తన స్థానంలో తానున్నా అలాగే భావించేవాడినని అభినవ్ ఒప్పుకున్నారు.

మరోవైపు... పితృస్వామ్య వ్యవస్థే పర్యావరణ వినాశనానికి కారణమని దియా మీర్జా అనడం... దానికి తోడు అభినవ్ శుక్లా పోర్నోగ్రఫీని గ్లోబల్ వార్మింగ్‌కు ముడిపెట్టడంపై నెటిజన్ల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బయట ఇలాంటి ఉచిత సలహాలు, వింత థియరీలు ఇచ్చే ఈ సెలబ్రిటీలే వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో ఘాటైన సీన్లలో నటిస్తుంటారు! అని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. తీవ్రమైన పర్యావరణ సమస్యలను ఇలాంటి అంశాలతో ముడిపెట్టి వార్తల్లో నిలవాలని చూడటంపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.