టాయ్‌లెట్ క్లీనర్ యాడ్‌లో నటిస్తే తప్పా? వేధించినా పట్టించుకోని హీరో!
సినిమా అవకాశాలు తగ్గి... ఆర్థికంగా కష్టకాలం ఎదుర్కొంటున్న సమయంలోనే అబ్బాస్ ప్రముఖ టాయిలెట్ క్లీనర్ బ్రాండ్ `హార్పిక్` ప్రకటనలో నటించారు.
By: Sivaji Kontham | 30 Jun 2026 11:00 PM ISTతొంభైలలో `అబ్బాస్` అనగానే అందరికీ మొదటిగా గుర్తుకొచ్చే సినిమా `ప్రేమదేశం`. ఆ చిత్రంలో వినీత్ తో పోటీపడుతూ, కాలేజ్ స్టూడెంట్‌గా అమాయకత్వంతో కూడిన అతడి నటన అప్పట్లో యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ రోజుల్లో `ప్రేమదేశం` ఒక ల్యాండ్‌మార్క్ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాలలో చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ ఇమేజ్‌తో సుదీర్ఘ కాలం పాటు కథానాయకుడిగా మెప్పించిన అబ్బాస్, కాలక్రమంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతోనూ తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. అయితే కొన్నేళ్ల క్రితం ఆయన అనూహ్యంగా సినీరంగం నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమాలు వదిలేసి విదేశాలకు వెళ్లిపోయి, అక్కడ బతుకుదెరువు కోసం టాక్సీ డ్రైవర్ కం మెకానిక్‌గా స్థిరపడ్డాడంటూ అప్పట్లో పలు కథనాలు కూడా వచ్చాయి.
సినిమా అవకాశాలు తగ్గి... ఆర్థికంగా కష్టకాలం ఎదుర్కొంటున్న సమయంలోనే అబ్బాస్ ప్రముఖ టాయిలెట్ క్లీనర్ బ్రాండ్ `హార్పిక్` ప్రకటనలో నటించారు. 2015 నుండి దాదాపు ఎనిమిదేళ్ల పాటు సాగిన ఈ సుదీర్ఘ కాంట్రాక్ట్ ద్వారా అతడు ఈ యాడ్స్‌లో ఎక్కువగా కనిపించారు. నటుడిగా సరైన అవకాశాల్లేనప్పుడు ఈ ప్రకటన ద్వారా వచ్చిన స్థిరమైన ఆదాయమే ఆయన కుటుంబాన్ని గట్టెక్కించింది. ఆ సమయంలో ఆ బ్రాండ్ కాంట్రాక్ట్ కనుక లేకపోయి ఉంటే తన కుటుంబ పరిస్థితి ఏమయ్యేదోనని, అందుకే ఆ ప్రకటనలో నటించడం ఏమాత్రం తప్పు కాదని అబ్బాస్ పూర్తి నిజాయితీతో గ్రహించారు.
అయితే సమాజంలో .. సోషల్ మీడియాలో దీనిపై భిన్నమైన స్పందన వచ్చింది. ఒకప్పుడు వెండితెరపై స్టార్ హీరోగా వెలిగిన నటుడు.. ఇలా టాయిలెట్ క్లీనర్ ప్రకటనలో నటించడాన్ని కొందరు నెటిజనులు ఘోర తప్పిదంగా ఎత్తిచూపారు. ఇంటర్నెట్‌లో ఆయనపై లెక్కలేనన్ని మీమ్స్, ట్రోల్స్ సృష్టించి తీవ్రంగా హేళన చేశారు. ఈ నెగిటివిటీ, ట్రోలింగ్ ఒక దశలో అబ్బాస్‌ను మానసికంగా కలతకు గురిచేశాయి. రెడిట్ వంటి వేదికలపై కొందరు దీనిని హేళన చేసినా హార్పిక్ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో అబ్బాస్ చేసిన ఈ క్యాంపెయిన్ ఎంతో విజయవంతమైందనేది అక్షర సత్యం. అలాగే అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో కూడా ఈ తరహా ప్రకటనల్లో నటించాడు. అలాగే `ప్యాడ్ మేన్` లాంటి సామాజిక అంశాలు ఉన్న చిత్రాల్లోను నటించడం తెలిసినదే.
తాజాగా ఈ ట్రోలింగ్‌పై అబ్బాస్ ఎంతో పరిణతితో హుందాగా స్పందించారు. తాను హార్పిక్ ప్రకటనలో నటించినందుకు ఇప్పటికీ చాలా మంది ట్రోల్ చేస్తూనే ఉంటారని... కానీ ఆ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఇచ్చిన ఆర్థిక భరోసానే తన ఇల్లు గడవడానికి, తన కుటుంబాన్ని ఆదుకోవడానికి సహాయపడిందని స్పష్టం చేశారు. కష్టపడి గౌరవంగా డబ్బు సంపాదించడంలో ఎలాంటి తప్పు లేదని అతడు పేర్కొన్నారు. అలాగే ఈ ప్రకటనలు కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా... సమాజంలో కనీస బాత్‌రూమ్ పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఎంతగానో తోడ్పడ్డాయని ఆయన గుర్తుచేశారు.
ప్రస్తుతం సినిమాలకు దూరంగా న్యూజిలాండ్‌లో మోటివేషనల్ స్పీకర్‌గా (ప్రేరణాత్మక ప్రసంగీకుడు) కొత్త జీవితాన్ని నడుపుతున్న అబ్బాస్ ఈ అనుభవం ద్వారా అందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మనిషి తన అహాన్ని (ఈగో) పక్కన పెట్టి కష్టపడితేనే జీవించగలడని.. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ వచ్చి సహాయం చేయరని ఆయన హితవు పలికారు. సమాజంలో చేసే ఏ పనీ చిన్నది కాదని... కష్టించి బతికే ప్రతి వృత్తికీ సమానమైన గౌరవం ఇవ్వాలని అబ్బాస్ చెప్పిన మాటలు ఇప్పుడు నెటిజనుల ఆలోచనలను మారుస్తున్నాయి. ఇప్పటి ఏఐ యుగంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు అయినా గ్యారెంటీ లేదు కానీ, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, బార్ బెండర్ పని వాళ్లకు ఎప్పటికీ ఉపాధి కరువేమీ లేదని ప్రూవైంది. చేసే పనిని దైవసమానంగా చూడాలి. ప్రతి చిన్న పనినీ గౌరవించి సెల్ఫ్ డిగ్నిటీని కాపాడుకోవాలి.
