విమర్శల కంటే కృతజ్ఞతే ముఖ్యం.. ఆ యాడ్‌పై అబ్బాస్ స్పందన!
ఒకప్పుడు వెండితెరపై ఓవర్ నైట్ స్టార్‌గా వెలిగి, లవర్ బాయ్‌గా లక్షలాది మంది గుండెల్లో చోటు సంపాదించుకున్న నటుడు అబ్బాస్.
By: Madhu Reddy | 16 Oct 2026 7:00 PM ISTఒకప్పుడు వెండితెరపై ఓవర్ నైట్ స్టార్‌గా వెలిగి, లవర్ బాయ్‌గా లక్షలాది మంది గుండెల్లో చోటు సంపాదించుకున్న నటుడు అబ్బాస్. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వరుసగా అవకాశాలు తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినప్పుడు ఆయన చేసిన ఒక యాడ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వచ్చినా, సమాజం రకరకాలుగా మాట్లాడినా వెనక్కి తగ్గకుండా నిలబడ్డారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన బ్రాండ్ పట్ల ఆయన చూపించిన కృతజ్ఞతా భావం అందరిని ఆలోచింపజేస్తుంది..ఆ విశేషాలు చూద్దాం..
గ్లామర్ ఇండస్ట్రీలో ఊహించని కష్టాలు:
సినిమా ప్రపంచం బయట నుంచి చూసేవారికి ఎంత రంగులమయంగా కనిపిస్తుందో, లోపల అంతే అస్థిరత ఉంటుంది. ‘ప్రేమదేశం’ సినిమాతో అబ్బాస్ పొందిన క్రేజ్, ఆయన హెయిర్‌స్టైల్ ఆ రోజుల్లో ఒక ట్రెండ్ సెట్టర్. కానీ, ఆఫర్లు తగ్గినప్పుడు అదే గ్లామర్ ఇండస్ట్రీ ఎంతో నిర్దయగా మారుతుంది. ఇక స్టార్ హోదా ఉన్నంత మాత్రాన నిరంతరం ఆదాయం వస్తుందనే గ్యారెంటీ లేకపోవడం వల్ల చాలామంది సెలబ్రిటీలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంటారు.
పబ్లిక్ షేమింగ్‌ను ఎదుర్కొన్న ధైర్యం:
సినిమా అవకాశాలు లేని సమయంలో అబ్బాస్ ‘హార్పిక్’ టాయిలెట్ క్లీనర్ యాడ్‌లో నటించారు. దాంతో బయట సమాజం నుంచి, సోషల్ మీడియా వేదికగా ఆయనపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఒక స్టార్ హీరో ఇలాంటి యాడ్స్ చేయడం ఏంటి అని చాలామంది హేళన చేశారు. ఇక మన సమాజంలో ఏ పని చేసినా అందులో నిందలు వెతకడం, ఇతరులను తక్కువ చేసి చూడడం చాలా సాధారణమైపోయింది. కానీ, అబ్బాస్ ఆ విమర్శలన్నింటినీ మౌనంగా భరించారు.
పనిలోని గొప్పతనాన్ని నిలబెట్టిన తీరు:
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అబ్బాస్ తన ఆర్థిక పరిస్థితుల గురించి ఎంతో నిజాయితీగా మాట్లాడారు.సినిమా అవకాశాలు లేక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ బ్రాండ్ కాంట్రాక్టే దాదాపు ఎనిమిదేళ్ల పాటు తనను, తన కుటుంబాన్ని ఆదుకుందని ఆయన తెలిపారు. “నాకు జీవనాధారం కల్పించింది ఆ బ్రాండే” అని నిజాయితీగా చెప్పారు. సమాజం ఏమనుకున్నా, కష్టపడి సంపాదించడంలో తప్పులేదని తన మాటలతో చాటిచెప్పారు.
సమాజానికి అబ్బాస్ నేర్పిన విలువైన పాఠం:
చేసే పని చిన్నదా, పెద్దదా అనేది కాదు, అది మనకు కష్టకాలంలో ఎంత ఆసరాగా నిలిచింది అనేదే ముఖ్యం. నలుగురూ ఏమనుకుంటారో అని అహంకారంతో కూర్చుంటే కుటుంబానికి తిండి దొరకదు. విమర్శలు చేసేవారు వచ్చి మన ఇంట్లో అన్నం పెట్టరు.ఇక కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న సంస్థ పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేయడం, చేసే పనిని గౌరవించడం ఎంత ముందో అబ్బాస్ తన ప్రవర్తన ద్వారా నిరూపించారు.
నిజమైన హీరో అంటే ఆత్మగౌరవమే:
అద్దాల మేడల్లో బతకడం కంటే, నేలమీద నిలబడి నిజాన్ని ఒప్పుకోవడంలోనే అసలైన ధైర్యం ఉంది. విమర్శకులకు తన కృతజ్ఞతతోనే అబ్బాస్ సమాధానం చెప్పారు. ఏ పని అయినా సరే నిజాయితీగా చేసినప్పుడు అందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదని ఆయన ప్రయాణం నిరూపిస్తోంది. ఇక కష్టాలను తట్టుకుని నిలబడి, మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అబ్బాస్ నిజంగా ప్రశంసనీయుడు.
