'హ్యాపీ రాజ్' అంటూ అబ్బాస్ రీఎంట్రీ.. ట్రైలర్ ఎలా ఉందంటే?
90స్ లో తన స్టైల్ అండ్ స్మైల్ తో ప్రేక్షకులను అలరించిన లవర్ బాయ్ అబ్బాస్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నారు.
By: M Prashanth | 20 March 2026 8:12 PM IST90స్ లో తన స్టైల్ అండ్ స్మైల్ తో ప్రేక్షకులను అలరించిన లవర్ బాయ్ అబ్బాస్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నారు. సుమారు 11 ఏళ్ల బ్రేక్ తర్వాత ఆయన హ్యాపీ రాజ్ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటం సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు బ్యూటీ శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా కనిపించనున్నారు.
బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై సినిమాను జైవర్ద నిర్మిస్తుండగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఆ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా విడుదల చేయనుంది. తాజాగా హైదరాబాద్ లో సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన తెలుగు ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్రైలర్ ను చూస్తుంటే.. కంప్లీట్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కించినట్టు స్పష్టమవుతోంది. ఒక మిడిల్ క్లాస్ యువకుడు, పెద్దింటి అమ్మాయిని ప్రేమించడం వల్ల ఎదురయ్యే పరిస్థితులు, కుటుంబాల మధ్య జరిగిన సరదా సంఘటనలు కథలో మెయిన్ ఎలిమెంట్స్ గా తెలుస్తోంది. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీనితో రూపొందించిన చిత్రంగా హ్యాపీరాజ్ కనిపిస్తోంది.
సినిమాలో అబ్బాస్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హీరోయిన్ తండ్రిగా, అమెరికాలో నివసించే ఎన్నారై రాజీవ్ పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. ట్రైలర్ లో ఆయన లుక్ చూసిన అభిమానులు, ఒకప్పుడు చెలి సినిమాలో కనిపించిన స్టైలిష్ అబ్బాస్‌ను గుర్తు చేసుకుంటున్నారు. దీంతో ఆయన రీ ఎంట్రీపై అంచనాలు మరింత పెరిగాయి. దర్శకుడు రాజా సినిమాను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించారు.
పెళ్లి వరకు వెళ్లాలనుకునే ఒక జంటకు, వారి కుటుంబాల మధ్య ఎదురయ్యే సంఘటనలను వినోదాత్మకంగా చూపించినట్లు తెలుస్తోంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ చిత్రంలో ఉన్నాయని ట్రైలర్ సూచిస్తోంది. సంగీతాన్ని జస్టిన్ ప్రభాకరన్ అందించగా, జీవీ ప్రకాష్ కుమార్ తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ట్రైలర్ లో వినిపించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అవ్వనున్నట్లు అర్థమవుతోంది.
ఏదేమైనా హ్యాపీరాజ్ మూవీ లవ్, కామెడీ, ఫ్యామిలీ వాల్యూస్ తో రూపొందిన ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా అబ్బాస్ రీ ఎంట్రీ, జీవీ ప్రకాష్ నటన, ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్నీ కలిసి ఆ సినిమాపై మంచి బజ్ ను తీసుకొచ్చాయి. మరి మార్చి 27వ తేదీన విడుదల కానున్న ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.
