Begin typing your search above and press return to search.

ఆ హిట్‌ మూవీ సీక్వెల్‌ కథ కంచికేనా..?

బాలీవుడ్‌ మొదలుకుని టాలీవుడ్‌, కోలీవుడ్ వరకు అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలోనూ సీక్వెల్స్‌, ప్రాంచైజీ సినిమాల ట్రెండ్‌ కొనసాగుతున్న విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   30 Oct 2025 7:00 PM IST
ఆ హిట్‌ మూవీ సీక్వెల్‌ కథ కంచికేనా..?
X

బాలీవుడ్‌ మొదలుకుని టాలీవుడ్‌, కోలీవుడ్ వరకు అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలోనూ సీక్వెల్స్‌, ప్రాంచైజీ సినిమాల ట్రెండ్‌ కొనసాగుతున్న విషయం తెల్సిందే. అందుకే గతంలో వచ్చిన హిట్‌ సినిమాలకు, క్లాసిక్‌ సినిమాలకు సీక్వెల్స్ చేసేందుకు ఫిల్మ్‌ మేకర్స్‌ రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొన్ని సీక్వెల్స్ పట్టాలెక్కగా, కొన్ని ప్రకటనల దశలో ఉన్నాయి, కొన్ని సినిమాలకు సంబంధించిన సీక్వెల్స్ చర్చల దశలో ఉన్నాయి. కోలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ ఆయిరత్తిల్ ఒరువన్ కు సీక్వెల్‌ రూపొందబోతున్నట్లు దర్శకుడు సెల్వ రాఘవన్‌ అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. దర్శకుడిగా సెల్వ రాఘవన్‌ విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు, కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ఆయిరత్తిల్ ఒరువన్ సినిమా తెలుగులో యుగానికి ఒక్కడు గా డబ్‌ అయ్యి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

కార్తీ హీరోగా యుగానికి ఒక్కడు...

తమిళ్‌, తెలుగు భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా సీక్వెల్‌ ప్రకటన వచ్చిన వెంటనే ప్రేక్షకుల్లో ఆసక్తి వ్యక్తం అయింది. అయితే సినిమా సీక్వెల్‌కు కార్తీ రెడీగా లేడు అనే పుకార్లు కోలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరిగింది. ప్రస్తుతం కార్తీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఈ సీక్వెల్‌ విషయంలో ఆయన ఆసక్తిగా లేడు అనేది తమిళ మీడియా సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం. ఆ విషయం పక్కన పెడితే దర్శకుడు సెల్వ రాఘవన్‌ సైతం ఈ సినిమాను సాఫీగా ముందుకు తీసుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. సీక్వెల్‌ కు సంబంధించిన ప్రకటన అయితే చేశాడు కానీ, దాన్ని ముందుకు ఎలా తీసుకు వెళ్లాలి అనే విషయంలో దర్శకుడికి కూడా క్లారిటీ లేదని, అందుకే ఆయన ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నాడు అంటూ కోలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో...

యుగానికి ఒక్కడు 2 సినిమా ప్రకటించినప్పటి నుంచి తనను ఎక్కడకు వెళ్లినా ఆ సినిమా గురించిన అప్‌డేట్‌ ఇవ్వమని అడుగుతున్నారని, చాలా మంది సినిమా ఎక్కడి వరకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు అంటూ సెల్వ రాఘవన్‌ ఇటీవల ఒక చిట్‌ చాట్‌ లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఆ సీక్వెల్‌ను ప్రకటించిన తర్వాత మరే సినిమా చేస్తున్నాను అన్నా కూడా జనాలు పట్టించుకునే పరిస్థితి లేదు. దాంతో నేను మరో సినిమాను చేయాలా వద్దా అనే విషయమై తేల్చుకోలేక పోతున్నాను అంటూ సెల్వ రాఘవన్‌ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు కోలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. యుగానికి ఒక్కడు సీక్వెల్‌ మాత్రమే కాకుండా ధనుష్‌ తో మరో సీక్వెల్‌ కి సెల్వ రాఘవన్‌ ప్లాన్‌ చేశాడు. కానీ ధనుష్ సైతం చాలా బిజీగా ఉన్న కారణంగా ఆ సినిమా కూడా పట్టాలెక్కేది కనిపించడం లేదని తమిళ మీడియా వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.

కార్తీ, ధనుష్‌ బిజీగా ఉండటంతో...

ప్రస్తుతానికి యుగానికి ఒక్కడు సినిమా సీక్వెల్‌ పని పక్కన పెట్టినట్లు సెల్వ రాఘవన్ సన్నిహితుల వద్ద అన్నట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముందు ముందు సినిమా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ తమిళ్‌ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. యుగానికి ఒక్కడు సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో సీక్వెల్‌ ప్రకటన వచ్చిన వెంటనే అంచనాలు పెరిగాయి. కానీ సినిమా ముందు పడే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. సీక్వెల్‌ పై చాలా ఆశలు పెట్టుకున్న దర్శకుడు సెల్వ రాఘవన్‌ సినిమాను ఏదోలా పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ హీరో నుంచి మద్దతు లేదు, అలాగే నిర్మాతలు సైతం ముందుకు వచ్చే పరిస్థితి లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. అందుకే ఆయిరత్తిల్ ఒరువన్ సినిమా సీక్వెల్‌ కథ కంచికి చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.