ఆ హిట్ జోడీ మళ్లీ ఎందుకు కలవలేదు?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మోహిత్ సూరి ఈ విషయంపై స్సందించారు. స్వయంగా ఆదిత్య రాయ్ కపూరే ఒక సందర్భంలో సూరిని ఈ ప్రశ్న అడిగారని వెల్లడించారు.
By: Srikanth Kontham | 28 April 2026 6:00 AM ISTబాలీవుడ్‌లో `ఆషికి 2` ఎలాంటి సంచలనం సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. మ్యూజికల్ లవ్ స్టోరీస్ లో అదో క్లాసిక్ హిట్ గా నిలిచింది. అదిత్య రాయ్ కపూర్, శ్రద్దా కపూర్ పెర్పార్మెన్స్ తో సినిమా నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది.దర్శకుడు మోహిత్ సూరి ఎమోషనల్ కనెక్టివిటీకి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. ఆ సినిమా విజయంతో మగ్గురికి మంచి పేరొచ్చింది. బాలీవుడ్ లో స్టార్ డమ్ రెట్టింపు అయింది. నటులుగా బిజీ అయ్యారు. మోహిత్ కి దర్శకుడిగా ఎనలేని గుర్తింపు దక్కింది. అయితే ఈ చిత్రం తర్వాత మోహిత్ సూరి మళ్లీ ఆదిత్యతో కలిసి పని చేయకపోవడంపై ఇండస్ట్రీ సహా అభిమానుల్లోనూ చాలా సందేహాలు ఉన్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మోహిత్ సూరి ఈ విషయంపై స్సందించారు. స్వయంగా ఆదిత్య రాయ్ కపూరే ఒక సందర్భంలో సూరిని ఈ ప్రశ్న అడిగారని వెల్లడించారు. అందుకే మోహిత్ సూరి ఏమన్నాడంటే? `గతంలో ఒక హిట్ ఇచ్చాం కదా అని మళ్లీ కలిసి సినిమా చేయడం ఇష్టం లేదన్నారు. ఆదిత్య వంటి ప్రతిభావంతుడైన నటుడికి సరిపోయే బలమైన కథ , పాత్ర దొరికినప్పుడే మళ్లీ కలిసి పని చేస్తామన్నారు. అంత వరకూ తమ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా ఉండదన్నారు. ఆదిత్యతో తొందరపడి ఏదో ఒక సినిమా చేసే ఆలోచన లేదన్నారు.
నటుడు - దర్శకుడి మధ్య ఉండే అనుబంధం కెమెరా ముందే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో బలంగా ఉండాలని మోహిత్ అభిప్రాయపడ్డారు. ఆదిత్యతో మంచి స్నేహం ఉందని కానీ వృత్తిపరంగా ఒకరికొకరు న్యాయం చేయాలంటే సరైన స్క్రిప్ట్ అవసరమన్నారు. `ఆషికి 2`లో ఆదిత్య పోషించిన రాహుల్ జయకర్ పాత్ర ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిందన్నారు. దాన్ని మించే స్థాయి పాత్ర దొరికితేనే మళ్లీ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయగలమని మోహిత్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ కాంబినేషన్లు పదే పదే రిపీట్ చేయడం ట్రెండ్‌గా మారింది. కానీ మోహిత్ సూరి మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు.
తన ప్రతి సినిమాలో నటీనటులను కథకు అనుగుణంగానే ఎంపిక చేస్తానని , మునుపటి విజయాన్ని చూసి కాదని స్పష్టం చేశారు. `ఏక్ విలన్`, `మలాంగ్` వంటి చిత్రాలలో ఇతర నటులతోనూ ప్రయోగాలు చేశారు. ఆదిత్య కూడా కెరీర్‌లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ఎదగడంపై మోహిత్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే అభిమానులు మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు పట్టాలెక్కుతుందా ? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోహిత్ సూరి సినిమాల్లో ఉండే మ్యూజిక్ - ఎమోషన్ ఆదిత్య బాడీ లాంగ్వేజ్‌కు చక్కగా సరిపోతాయని అభిప్రాయపడుతున్నారు. మోహిత్ మనసు పెడితే? ఆదిత్య ఇమేజ్ కు తగ్గ కథ సిద్దం చేయడం పెద్ద పని కాదని అభిమానులు సూచిస్తున్నారు.
