13 ఏళ్లగా ఆ సందేశం మాత్రం తప్పనిసరి!
బాలీవుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీల్లో `ఆషికి 2` ఓ బెంచ్‌మార్క్‌గా నిలిచిన చిత్రం. ఈ సినిమా విడుదలై నేటికి 13 ఏళ్లు పూర్తయింది.
By: Srikanth Kontham | 27 April 2026 10:00 PM ISTబాలీవుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీల్లో `ఆషికి 2` ఓ బెంచ్‌మార్క్‌గా నిలిచిన చిత్రం. ఈ సినిమా విడుదలై నేటికి 13 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు మోహిత్ సూరి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా తన కెరీర్‌నే కాకుండా శ్రద్ధా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్‌ల జీవితాలను ఎలా మార్చేసిందో వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఇది ఒక సినిమా మాత్రమే కాదని తమ అందరి జీవితాల్లో ఓ గొప్ప ప్రయాణమని పేర్కొన్నారు. `ఈ సినిమా ఇంతటి విజయం సాధించడానికి ప్రధాన కారణం సమిష్టి కృషి. ఆ సమయంలో చిత్ర ఆ సినిమాకు పనిచేస్తున్న వారందరిలో నిరూపించుకోవాలి అనే కసి కనిపించేది.
శ్రద్ధా కపూర్ , ఆదిత్య రాయ్ కపూర్ అప్పటికే కొన్ని పెద్ద సినిమాల్లో నటించినా? వారికి సరైన బ్రేక్ లేదు. ఓటమి రుచి చూసిన తర్వాత విజయం కోసం వారు చేసిన పోరాటం ఆ పాత్రల్లో సహజంగా కనిపించింది. మేము విజయం వెనుక పరిగెత్తలేదు. మాలో ఉన్న ఎమోషన్స్ ను ప్రపంచానికి చెప్పాలనుకున్నాము. అంతకుమించి పెద్దగా ఆలోచించలేదు. కానీ ఆ పని ని ఎంతో నిజాయితీగా చేసాం. అందుకే సక్సెస్ అయ్యాం అన్నారు. సినిమా విడుదలై 13 ఏళ్లయినా? ప్రతి ఏటా ఏప్రిల్ 26న శ్రద్ధా తనకు ఖచ్చితంగా మెసేజ్ చేస్తుందని సూరి వెల్లడించారు.
`మేము ఒకరి పుట్టినరోజులు మర్చిపోతామేమో కానీ ఈ రోజును మాత్రం ఎప్పుడూ మర్చిపోము. ఆమె ఎక్కడున్నా? ఎంత బిజీగా ఉన్నా? ఆ రోజున మా ఇద్దరి ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటాము` అన్నారు మోహిత్. ఇది వారి మధ్య ఉన్న వృత్తిపరమైన గౌరవాన్ని స్నేహాన్ని తెలియజేస్తోంది. అలాగే సినిమా చిత్రీకరణ సమయంలో ఎదురైన సవాళ్లను కూడా మోహిత్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ప్రచార కార్యక్రమాల కోసం చండీగఢ్ వంటి నగరాలకు వెళ్ళినప్పుడు ఎలాంటి సెక్యూరిటీ లేదా మేకప్ ఆర్టిస్టులు లేకుండా సాధారణ వ్యక్తుల్లా తిరిగేవాళ్లం. ఒకసారి ఫ్లైట్ మిస్ అయితే హోటల్ ఖర్చులు కూడా సొంత డబ్బులు పెట్టుకున్నామన్నారు.
అలాంటి సాధారణ స్థితి నుండి `ఆషికి 2` ఒక సెన్సేషన్‌గా మారి విమాన సిబ్బంది అంతా మాతో ఫోటోలు దిగడానికి ఎగబడటం చూసి ఆశ్చర్యపోయానని సూరి గుర్తు చేసుకున్నారు. సంగీత దర్శకులు మిథున్, అంకిత్ తివారీ, జీత్ గంగూలీలు అందించిన అద్భుతమైన స్వరాలు సినిమా విజయానికి వెన్నెముకగా నిలిచాయి. `తుమ్ హీ హో`, `సున్ రహా హై నా తూ` వంటి పాటలు నేటికీ సంగీత ప్రియుల ప్లేలిస్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ సినిమా తో గాయకుడు అర్జిత్ సింగ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. మోహిత్ సూరి దర్శకత్వ ప్రతిభ, నటీనటుల కెమిస్ట్రీ , ప్రాణం పోసిన సంగీతం వెరసి `ఆషికి 2`ని ఓ క్లాసిక్‌గా నిలబెట్టాయి.
