ఆరవ్ (X) ప్రణవ్: స్టార్ కిడ్స్.. కానీ సాధారణ జీవితానికే అంకితం
కేవలం స్టార్ కిడ్స్ మాత్రమే కాదు.. పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న ప్రముఖ నటులు సైతం వ్యవసాయంపై మక్కువ పెంచుకోవడం విశేషం.
By: Sivaji Kontham | 20 April 2026 8:00 AM ISTబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కుమారుడు ఆరవ్ కుమార్ ప్రస్తుతం సినీ వర్గాల్లో , సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. సాధారణంగా స్టార్ కిడ్స్ అంటే ఖరీదైన కార్లు, విదేశీ ప్రయాణాలు, గ్లామర్ ప్రపంచంలో నిరంతరం మెరవడం వంటివి ఊహిస్తాం. కానీ ఆరవ్ వీటన్నింటికీ భిన్నంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం అతడు మారుమూల పల్లెటూళ్లకు వెళ్లి ఫ్యాషన్ డిజైనింగ్‌లో శిక్షణ పొందుతుండటం విశేషం. కేవలం 4,500 రూపాయల స్వల్ప జీతంతో ఒక సాధారణ ఉద్యోగిలా పని చేస్తూ వృత్తిపై తనకున్న అంకితభావాన్ని చాటుకుంటున్నారు. తన తండ్రి ఒక సూపర్ స్టార్ అనే విషయాన్ని పక్కన పెట్టి అందరితో ఎంతో వినయంగా మెలిగే ఆరవ్ స్వభావం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
మరోవైపు మాలీవుడ్ లెజెండరీ నటుడు మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ కూడా ఇదే తరహా జీవనశైలిని అనుసరిస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా ఎదిగే అవకాశాలు ఉన్నా కానీ.. అతడు గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండటానికే మొగ్గు చూపుతారు. విదేశాల్లో ఒక సామాన్యుడిలా విహార యాత్రలు చేయడం.. ఒంటరిగా ప్రయాణించడం అతడికి ఇష్టమైన వ్యాపకం. ప్రణవ్ తన ప్రయాణాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి గొర్రెలను, మేకలను మేపుతూ ప్రకృతితో మమేకమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తండ్రి ఇమేజ్‌ను వాడుకుని కెరీర్‌లో స్థిరపడాలని కాకుండా.. తనకు నచ్చిన రీతిలో మట్టి వాసనను ఆస్వాధిస్తూ బతకాలని కోరుకోవడం విశేషం.
కేవలం స్టార్ కిడ్స్ మాత్రమే కాదు.. పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న ప్రముఖ నటులు సైతం వ్యవసాయంపై మక్కువ పెంచుకోవడం విశేషం. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన పన్వేల్ ఫామ్‌హౌస్‌లో స్వయంగా నాగలి పట్టడం.. వరి నాట్లు వేయడం వంటి పనులు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మామిడి తోటను పరిరక్షించుకుంటూ వ్యవసాయం కూడా చేస్తుంటారు. అదేవిధంగా విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ షూటింగులు లేని సమయంలో తన స్వస్థలమైన బుధానాలో ఒక సాధారణ రైతులా పొలం పనుల్లో నిమగ్నమవుతారు. గ్లామర్ ప్రపంచంలోని వెలుగుల కంటే మట్టితో మమేకమవ్వడంలోనే వీరు అసలైన సంతృప్తిని వెతుక్కుంటున్నారు.
టాలీవుడ్‌లో కూడా ప్రకృతినే ప్రాణంగా భావించే నటులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ తన ఫామ్‌హౌస్‌లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, స్వయంగా మొక్కలు నాటడం, నీరు పోయడం వంటి పనులు ఇష్టంగా చేస్తారు. అలాగే ఆర్. నారాయణమూర్తి వంటి వారు మొదటి నుండి సాధారణ జీవితానికే ప్రాధాన్యత ఇస్తుండగా.. మాజీ స్టార్ హీరోయిన్ విజయశాంతి సైతం తన పొలంలో వ్యవసాయ పనులను స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. వీరంతా ఎన్ని విజయాలు అందుకున్నా చివరకు ప్రకృతికి చేరువవ్వడమే అసలైన ఆనందమని నిరూపిస్తున్నారు.
ఇద్దరు స్టార్ కిడ్స్ ఆరవ్- ప్రణవ్ .. ఇతర నటీనటుల జీవనశైలి నేటి తరం యువతకు ఒక గొప్ప స్ఫూర్తినిస్తోంది. డబ్బు, హోదా, అపారమైన కీర్తి ఎన్ని ఉన్నా.. వాటిని ప్రదర్శించకుండా కాయకష్టాన్ని, సామాన్య జీవితాన్ని గౌరవించడం గొప్ప విషయం. విలాసవంతమైన జీవితాన్ని వదిలి మట్టి వాసనను ప్రేమించే యువతరం ప్రయాణం.. స్ఫూర్తిదాయకమైనది. అసలైన తృప్తి ఆడంబరాల్లో లేదు.. మనం చేసే పనిలో ..ప్రకృతికి దగ్గరగా ఉండటంలోనే ఉందనే విషయాన్ని చాటి చెబుతోంది. స్టార్ హోదా కంటే స్వేచ్ఛగా ఉండటంలోనే అసలైన కిక్ ఉందని వీరు నిరూపిస్తున్నారు.
