స్టార్ హీరో పుత్రరత్నం నేపోటిజం విమర్శలకు భయపడ్డాడా?
సినిమా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ అనగానే అందరి కళ్ళు వెండితెరపైనే ఉంటాయి. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తోంది.
By: Sivaji Kontham | 19 April 2026 8:00 AM ISTసినిమా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ అనగానే అందరి కళ్ళు వెండితెరపైనే ఉంటాయి. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కుమారుడు ఆరవ్ కుమార్ మాత్రం ఇందుకు భిన్నమైన బాటను ఎంచుకున్నారు. తన తండ్రి సంపాదించిన వేల కోట్ల సామ్రాజ్యం తనకు ఉన్నా కానీ.. గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండాలని అతడు నిర్ణయించుకోవడం చర్చనీయాంశమైంది. తనకు ప్రస్తుతానికి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని ఆరవ్ స్పష్టం చేయడం అతడి వ్యక్తిత్వంలోని పరిణతిని చాటిచెబుతోంది.
ఆరవ్‌కు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ప్రాణం. అయితే ఈ కళను నేర్చుకోవడానికి ఏ విదేశీ విద్యాసంస్థనో లేదా నగరాల్లోని భారీ స్టూడియోలనో ఆశ్రయించలేదు. ఫ్యాషన్ మూలాలను తెలుసుకోవడానికి సాంప్రదాయ కళలను క్షుణ్ణంగా పరిశీలించడానికి మారుమూల గ్రామాలను వేదికగా చేసుకున్నారు. అక్కడి కళాకారుల మధ్య ఉంటూ.. నేలతల్లికి దగ్గరగా ఉండి వృత్తిని నేర్చుకోవడానికి ఆరవ్ ఆసక్తిని కనబరిచాడు. ఒక స్టార్ కిడ్ గ్రామాల్లో సామాన్య జీవనం గడపడం అనేది నేటి తరం యువతకు ఒక గొప్ప ఆదర్శం అని చెప్పవచ్చు.
వారసత్వంగా వచ్చే విలాసాలను పక్కన పెట్టి ఆరవ్ ప్రస్తుతం ఒక సాధారణ ఉద్యోగిలా పని చేస్తున్నారు. నెలకు కేవలం రూ. 4500 జీతానికి ఒక చోట చేరి వృత్తిపరమైన మెళకువలు నేర్చుకుంటున్నట్లు స్వయంగా అక్షయ్ కుమార్ వెల్లడించారు. డబ్బు కంటే నైపుణ్యం సంపాదించడమే ముఖ్యమని భావించే అతడి ఆలోచనా దృక్పథం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక సామాన్యుడిలా తక్కువ జీతంతో కెరీర్ ప్రారంభించడం వెనుక ఆరవ్‌లో ఉన్న కష్టపడే తత్వం, నేర్చుకోవాలనే తపన కీలకంగా కనిపిస్తున్నాయి. అక్షయ్ అతడిని అలా తీర్చిదిద్దుతున్నారు.
ఆరవ్ పెరిగిన వాతావరణం అతడి ఆలోచనలపై తల్లి ట్వింకిల్ ఖన్నా ప్రభావం కూడా ఎంతో ఉంది. బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన వస్తువులు లేదా లైమ్‌లైట్‌లో ఉండటం కంటే.. తనకంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పరచుకోవడానికే పేరెంట్ కూడా ప్రాధాన్యతనిస్తున్నారు. ఇతర స్టార్ కిడ్స్ పార్టీలు.. ఈవెంట్లతో బిజీగా ఉంటే.. ఆరవ్ మాత్రం తన పనిలో నిమగ్నమై గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. తన పిల్లలపై కెరీర్ పరంగా ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని.. వారికి నచ్చిన రంగంలో ఎదిగే స్వేచ్ఛను ఇచ్చామని అక్షయ్ కుమార్ గర్వంగా చెబుతుంటారు.
ఒక సూపర్ స్టార్ కుమారుడు ఎంచుకున్న ఈ భిన్నమైన ప్రయాణం ఒక సాహసోపేతమైన నిర్ణయం. వారసత్వంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడం కంటే.. స్వయంకృషితో ఎదగాలనే పట్టుదల ఆరవ్‌లో కనిపిస్తోంది. చిన్న ఉద్యోగంతో ప్రారంభించి.. కష్టపడి పైకి రావాలనుకునే అతడి మనస్తత్వం తన తండ్రిలోని `స్ట్రగులింగ్ డేస్`ను గుర్తుకు తెస్తోంది. ఈ విలక్షణమైన ప్రయాణం ఆరవ్‌ను భవిష్యత్తులో ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దడమే కాకుండా.. పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా సొంతంగా ఎదగవచ్చని నిరూపిస్తోంది.
స్టార్ కిడ్స్ అందరూ తమ తల్లిదండ్రుల బాటలో నడవకుండా ఆరవ్ లాగా గ్రౌండ్ లెవల్ నుండి కష్టపడటం అనేది కేవలం వ్యక్తిగత ఇష్టమా లేక నేపోటిజం విమర్శల నుండి తప్పుకోవడానికి ఎంచుకున్న తెలివైన మార్గమా? అంటూ నెటిజనులు ఎవరికి వారు విశ్లేషిస్తున్నారు.
