ఒక అగ్ర హీరో ఇంత పెద్ద తప్పు ఎలా చేస్తాడు?
ఓటీటీలు సినిమా వీక్షణ విధానాన్ని సర్వనాశనం చేసాయని, థియేటర్లకు వచ్చే ప్రజలను తగ్గించాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు అమీర్ ఖాన్.
By: Sivaji Kontham | 1 Aug 2025 7:36 PM ISTఓటీటీలు సినిమా వీక్షణ విధానాన్ని సర్వనాశనం చేసాయని, థియేటర్లకు వచ్చే ప్రజలను తగ్గించాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు అమీర్ ఖాన్. బాలీవుడ్ సూపర్ స్టార్ కొన్ని నెలల క్రితం మీడియా సమావేశంలో ఓటీటీలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు. సినిమా బిజినెస్ ని దెబ్బ తీసిన మోడల్ ఇది అని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు వేరే ఆప్షన్ లేకపోవడంతో థియేటర్లకు తప్పనిసరిగా వచ్చి జనం సినిమాలు చూసేవారని, ఇప్పుడు ఓటీటీలు సహా చాలా ఆప్షన్లు వచ్చేసాయని అమీర్ ఖాన్ ఆవేదన చెందారు.
కొత్త డిస్కవరీ సాధ్యమైంది:
అయితే ఈ ఆవేదన అమీర్ ఖాన్‌లో సృజనాత్మకతను మరింతగా పెంచింది. అతడి భావజాలం ఒక కొత్త డిస్కవరీకి తెర తీసింది. ఇకపై అమీర్ ఖాన్ నటించే సినిమాలేవీ ఓటీటీల్లో విడుదల కావు. దిగ్గజ ఓటీటీలు అతడిని, అతడి సినిమాలను కొనలేవు. అమీర్ సొంత యూట్యూబ్ చానెల్‌లో మాత్రమే అతడి సినిమాలను ఎవరైనా వీక్షించగలరు. ఎప్పటికీ ఈ విధానం కొనసాగనుంది. అంతేకాదు.. నవతరంలో ఔత్సాహిక ఫిలింమేకర్స్ ని తన సొంత యూట్యూబ్ చానెల్ ద్వారా ప్రోత్సహిస్తామని కూడా అమీర్ ఖాన్ ప్రామిస్ చేసారు.
వారి కోసం ధరను సవరిస్తాం:
ప్రస్తుతం అమీర్ ఖాన్ `సీతారే జమీన్ పార్`ని పే-పెర్ వ్యూ విధానంలో తన అధికారిక యూట్యూబ్ చానెల్ లో విడుదల చేసారు. రూ.100 చెల్లించి 48 గంటల్లోపు ఈ సినిమాని వీక్షించే సౌలభ్యం అందుబాటులోకి తెచ్చారు. అయితే ఆపిల్ పరికరంలో వినియోగదారులకు మాత్రం రూ.179 వసూలు చేస్తుండడంపై ఫిర్యాదులు అందాయి. దానికి అమీర్ ఖాన్ నిర్మాణ సంస్థ క్షమాపణలు చెప్పింది. ధరను మార్చేందుకు తమ టీమ్ పని చేస్తోందని నిర్మాణ సంస్థ వెల్లడించింది.
వ్యూహం ఫలించి లాభాలొస్తే..!
అయితే అమీర్ ఖాన్ వ్యూహం ఫలించి లాభాలు వచ్చాయా లేదా? అనేది ఇంకా తేలదు. యూట్యూబ్ లో ప్రజాదరణ ఎలా ఉంది? అనేది కొద్దిరోజుల పాటు వేచి చూడాలి. ఒకవేళ ఇది సక్సెసైతే, ఇతర అగ్ర హీరోలు ఎవరికి వారు యూట్యూబ్ చానెళ్లు ప్రారంభించి తమ సినిమాలను పే-పెర్ వ్యూ విధానంలో రిలీజ్ చేసుకోవచ్చు కదా? నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి వాటికి సినిమాలను అమ్మాల్సిన అవసరం ఏమిటి? ఓటీటీలను నిజాయితీగా వ్యతిరేకిస్తే వారంతా ఇలా చేయొచ్చు కదా? అంటూ కొన్ని ప్రశ్నలు ఇప్పుడు ఎదురవుతున్నాయి. అయితే పే - పర్ వ్యూ విధానంలో రిస్కు లేకపోలేదు. హీరోలందరికీ ఒకే తరహా ఆదరణ లభిస్తుందా? అన్నది సందేహమే. అమీర్ ఖాన్ లా ఇతర పెద్ద హీరోలు కూడా ధైర్యంగా ఈ మోడల్‌లో విడుదల చేయగలరా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.
ఉచితంగా వీక్షించే అవకాశం:
థియేటర్లలో విడుదల చేసిన తర్వాత కొన్ని వారాల్లో సినిమాలను యూట్యూబ్ చానెల్ లోకి తెస్తారు. యూట్యూబ్ లో సరసమైన ధరకే దేశవ్యాప్తంగా ప్రజలకు సినిమాలను అందుబాటులో ఉంచాలనేది అమీర్ ఖాన్ ప్రణాళిక. అమీర్ ఖాన్ హోస్టింగ్ చేసిన సంచలన టీవీ సిరీస్ `సత్యమేవ్ జయతే`ను కూడా యూట్యూబ్ లో అప్‌లోడ్ చేస్తారని కూడా తెలుస్తోంది. దీనికి ప్రేక్షకులు చెల్లింపులు చేయాల్సిన అవసరం కూడా లేదు.
