Begin typing your search above and press return to search.

రోజులు మారాయి.. దర్శక నిర్మాతలలో మార్పు వస్తుందా?

ముఖ్యంగా ఎన్టీఆర్ , ఏఎన్నార్ వంటి అగ్ర హీరోల కాలంలో ఒక సినిమా సూపర్ హిట్ అయింది అంటే.. ఆ సినిమా ఎన్ని రోజులు ఎన్ని కేంద్రాలలో ఆడింది అనే విషయాన్ని ప్రథమంగా చూసేవారు.

By:  Madhu Reddy   |   1 Dec 2025 9:00 PM IST
రోజులు మారాయి.. దర్శక నిర్మాతలలో మార్పు వస్తుందా?
X

ముఖ్యంగా ఎన్టీఆర్ , ఏఎన్నార్ వంటి అగ్ర హీరోల కాలంలో ఒక సినిమా సూపర్ హిట్ అయింది అంటే.. ఆ సినిమా ఎన్ని రోజులు ఎన్ని కేంద్రాలలో ఆడింది అనే విషయాన్ని ప్రథమంగా చూసేవారు. ముఖ్యంగా ఏ సినిమా అయితే సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంటుందో.. ఆ సినిమా సూపర్ సక్సెస్ అని, దానికి బ్రహ్మారథం పట్టేవారు..ఆ తర్వాత కాలంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రేక్షకుడు సినిమా చూసే ధోరణిలో మార్పు వచ్చింది. అలా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సినిమాలు ఆడే సమయంలో సన్నివేశాలు, పాటలు బాగుంటే ఆ సినిమా హిట్ అని పేరు వచ్చేది. అయితే ఇప్పుడు రోజులు మారిపోయాయి. సినిమా ఫలితాన్ని బాక్సాఫీస్ వద్ద వచ్చే నంబర్ల ద్వారా అంచనా వేయడం దురదృష్టకరం అని చెప్పవచ్చు.

అయితే ఇదే విషయాన్ని ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా ప్రస్తావించారు. కంటెంట్ తో కాకుండా బాక్సాఫీస్ వద్ద నంబర్లతో సినిమా ఫలితాన్ని డిసైడ్ చేయడం చాలా బాధాకరం అంటూ తన మనసులో విషయాన్ని బయటపెట్టారు. విషయంలోకి వెళ్తే..అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. "ఒకప్పుడు సినిమాలలోని సన్నివేశాలు, పాటల ఆధారంగా సినిమా బాగుందా లేదా అనే విషయాన్ని నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు దురదృష్టం ఏమిటంటే బాక్సాఫీస్ నంబర్లను బట్టి సినిమా ఫలితాన్ని డిసైడ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ విషయంలో దర్శక నిర్మాతలు పారదర్శకత పాటించాలి. ఎన్ని స్క్రీన్ లలో రిలీజ్ చేశారు. ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేయాలి

ప్రస్తుతం విదేశాలలో ఇలాంటి పద్ధతే కొనసాగుతోంది

గతంలో నేను వీటి గురించి ఎప్పుడూ కూడా ఆలోచించలేదు కానీ ప్రస్తుతం ప్రేక్షకులకు దీనిపై ఆసక్తి పెరిగింది కాబట్టి నేను కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి సినిమాకు బాక్సాఫీస్ వద్ద వచ్చే నెంబర్లను బట్టి ఫలితాన్ని అంచనా వేయడం మాత్రం చాలా బాధాకరం. అంచనాలు ఎలా ఉన్నప్పటికీ మంచి సినిమాలు మాత్రమే ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయి" అంటూ అమీర్ ఖాన్ స్పష్టం చేశారు. అంతేకాదు రోజులు మారాయి కాబట్టి దర్శక నిర్మాతలు కూడా ఫేక్ లెక్కలు సృష్టించకుండా పారదర్శకత పాటించాలి అని క్లారిటీ ఇచ్చారు. మరి అమీర్ ఖాన్ సలహా మేరకు ఇప్పటికైనా దర్శక నిర్మాతల ఆలోచనలలో మార్పు వస్తుందేమో చూడాలి.

అమీర్ ఖాన్ విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. ఈ మధ్య ఎక్కువగా ఇతర భాష చిత్రాలలో కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ.. పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాలలో క్యామియో రోల్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు అమీర్ ఖాన్.. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే