Begin typing your search above and press return to search.

ఆమెకు 47 అతడికి 61.. తొంద‌ర్లోనే పెళ్లి ముచ్చ‌ట‌!

ఆమెకు 47 అతడికి 61 .. ఇద్ద‌రికీ బాగానే క‌లిసింది. ఆమెది బెంగ‌ళూరు.. అత‌డికి ముంబై.. అయినా సంస్కృతులు క‌లిసాయి.

By:  Sivaji Kontham   |   22 Jun 2026 9:41 AM IST
ఆమెకు 47 అతడికి 61.. తొంద‌ర్లోనే పెళ్లి ముచ్చ‌ట‌!
X

ఆమెకు 47 అతడికి 61 .. ఇద్ద‌రికీ బాగానే క‌లిసింది. ఆమెది బెంగ‌ళూరు.. అత‌డికి ముంబై.. అయినా సంస్కృతులు క‌లిసాయి. ఆమె త‌ల్లిదండ్రుల మూలాలు బ్రిటీష్- ఐరిష్ కి చెందిన‌వి కాగా, అత‌డి మూలాలు అర‌బ్ తో ముడిప‌డి ఉన్నాయి. సాంస్కృతిక వైరుధ్యాలు ఎన్ని ఉన్నా.. ఈ పెళ్లికి త‌థాస్తు దేవ‌త‌ల ఆశీస్సులు ఉన్నాయి.. ఇదంతా ఎవ‌రి గురించి అంటే...!?

బాలీవుడ్ `మిస్టర్ పర్ఫెక్ట్` ఆమిర్ ఖాన్ మ‌రోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారు. గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి తెరదించుతూ.. తన లాంగ్‌టైమ్ పార్ట్‌నర్ గౌరి స్ప్రాట్ ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ వయసు 61 ఏళ్లు కాగా, గౌరి వయసు 47 ఏళ్లు. వీరిద్దరి వయసుల మధ్య 14 ఏళ్ల వ్యత్యాసం ఉన్నా ఇద్దరి ఆలోచనలు, మనస్తత్వాలు బాగా కలిశాయి. ఆమిర్ ఖాన్‌కు ఇది మూడో వివాహం కాగా.. గౌరి స్ప్రాట్‌కు ఇది రెండో పెళ్లి కావడం విశేషం. ఇప్పటికే వీరి వివాహ ముహూర్తం కూడా ఖరారైంది.

ఈ జంటది విభిన్న నగరాలు- విభిన్న సంస్కృతుల కలయిక అని చెప్పవచ్చు. గౌరి స్ప్రాట్ బెంగళూరులో జన్మించిన ఒక సక్సెస్‌ఫుల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్.. బ్యూటీ ఇండస్ట్రీ ప్రొఫెషనల్. ఆమిర్ ఖాన్ ముంబై గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరో. నగరాలే కాదు.. వీరిద్దరి కుటుంబ మూలాలు కూడా ఎంతో వైవిధ్యమైనవి. గౌరి తల్లిదండ్రుల వైపు బ్రిటీష్, ఐరిష్ మూలాలు ఉన్నాయి. ఆమె తల్లి తమిళ యువ‌తి కాగా, తండ్రి ఐరిష్ వ్యక్తి. ఆమె తాతగారు బ్రిటన్‌లో జన్మించినా భారతదేశ స్వాతంత్య్ర‌ పోరాటంలో పాల్గొన్నారు. మరోవైపు ఆమిర్ ఖాన్ తండ్రి తాహిర్ హుస్సేన్ పష్తూన్ కుటుంబానికి చెందినవారు కాగా... తల్లి జీనత్ హుస్సేన్‌కు అరబ్ దేశమైన సౌదీ అరేబియా (జెద్దా) తో ముడిపడిన మూలాలు ఉన్నాయి. అలాగే జీన‌త్ హుస్సేన్ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా ఆజాద్‌కు బంధువు కూడా. ఇలాంటి విభిన్న సాంస్కృతిక నేపథ్యాలు ఉన్నా వీరిద్దరి మధ్య చక్కని అవగాహన కుదిరింది.

గౌరి స్ప్రాట్ విద్య, కెరీర్ విషయానికి వస్తే.. 2004లో ప్రతిష్టాత్మక `యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్ లండన్`నుండి ఫ్యాషన్, స్టైలింగ్ & ఫోటోగ్రఫీలో ఎఫ్‌డీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత బ్యూటీ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించి, బెంగళూరులోని ఒక ప్రముఖ సెలూన్ చైన్‌తో పాటు ముంబైలోని పాపులర్ `బిబ్లంట్` సెలూన్‌కు డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం `ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్`లో కీలక బాధ్యతల్లో అసోసియేట్ అయి ఉన్నారు. వ్యక్తిగత జీవితంలో గౌరికి తన మొదటి వివాహం ద్వారా ఏడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భ‌ర్త నుంచి విడాకులు తీసుకున్న అనంత‌రం గౌరి అమీర్ తో సంబంధంలో ఉన్నారు.

ఆమిర్, గౌరి ఇద్దరికీ గత పాతికేళ్లుగా ఒకరితో ఒకరికి పరిచయం ఉంది. ఒకే ఫ్రెండ్ సర్కిల్‌లో ఉండటం వల్ల వీరి మధ్య స్నేహం కాస్తా కాలక్రమేణా ప్రేమగా మారింది. అయితే వీరిద్దరూ తమ రిలేషన్‌ను చాలా కాలం పాటు గోప్యంగా ఉంచారు. గత ఏడాది అంటే మార్చి 2025లో ఆమిర్ ఖాన్ తన 60వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా గౌరిని మీడియాకు అధికారికంగా పరిచయం చేశారు. తామిద్దరం గత ఏడాది కాలంగా డేటింగ్‌లో ఉన్నామని, ప్రస్తుతం సహజీవనం చేస్తున్నామని ఆమిర్ ఆ సందర్భంగా వెల్లడించారు.

ఇక వీరిద్దరి వివాహానికి సర్వం సిద్ధమైంది. జూలై 5న ముంబైలోని ఆమిర్ ఖాన్ నివాసంలో అత్యంత వైభవంగా.. ప్రైవేట్ వేడుకగా ఈ వివాహం జరగనుంది. కేవలం అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యులు .. కొద్దిమంది స్నేహితుల సమక్షంలోనే ఈ పెళ్లి జ‌ర‌గ‌నుంది. గతంలో రీనా దత్తా, కిరణ్ రావులకు విడాకులిచ్చిన ఆమిర్ ఖాన్.. గౌరి స్ప్రాట్‌తో తన మూడో ఇన్నింగ్స్‌ను సంతోషంగా ప్రారంభించబోతుండటంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ కొత్త జంటకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.