Begin typing your search above and press return to search.

నా పిల్ల‌ల చ‌దువుల‌కు నిర్మాత ఫీజులు చెల్లించాలా? అమీర్ ఖాన్ ప్ర‌శ్న‌!

సినిమాల కాస్ట్ ఫెయిల్యూర్ నిర్మాత‌ల్ని నిలువునా ముంచుతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   14 Sept 2025 11:00 PM IST
నా పిల్ల‌ల చ‌దువుల‌కు నిర్మాత ఫీజులు చెల్లించాలా? అమీర్ ఖాన్ ప్ర‌శ్న‌!
X

సినిమాల కాస్ట్ ఫెయిల్యూర్ నిర్మాత‌ల్ని నిలువునా ముంచుతున్న సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్ల రెమ్యున‌రేష‌న్లు బ‌డ్జెట్లో స‌గం పైగా మింగేస్తుంటే, నిర్మాత ఏమీ అన‌లేని ధైన్యం నెల‌కొంది. ఒక‌ప్పుడు నిర్మాతే రాజుగా ఉంటే, ఇప్పుడు హీరో చ‌క్ర‌వ‌ర్తి అయ్యాడు. హీరోగారు ఏదైనా చెబితే దానిని పాటించాల్సిన దుస్థితి నిర్మాత‌కు ఉంది.

దీనిని దివంగ‌త‌ ద‌ర్శ‌క‌నిర్మాత‌ దాస‌రి నారాయ‌ణ‌రావు ఎన్నోసార్లు బ‌హిరంగంగా విమ‌ర్శించారు. స్టార్ హీరోలు నిర్మాత ముందు త‌ల‌వొంచి ప‌ని చేసే రోజులు లేవ‌ని, నిర్మాత‌లే త‌ల‌వొంచి హీరో ముందు నిల‌వాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని ఆయ‌న ఆవేద‌న చెందారు.

ఇటీవ‌లే 30ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్న‌ ఒక ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు మాట్లాడుతూ.. అమితాబ్ బ‌చ్చ‌న్, అజ‌య్ దేవ‌గ‌న్, హృతిక్ రోష‌న్ వంటి ప్ర‌ముఖులు మాత్ర‌మే త‌మ వ్య‌క్తిగ‌త సిబ్బందికి పారితోషికాలు స్వ‌యంగా చెల్లిస్తార‌ని, చాలా మంది స్టార్లు (నేటిత‌రంలోను ఉన్నారు) నిర్మాత నుంచి వ‌సూలు చేస్తార‌ని తెలిపారు. ఒక్కో హీరో అర‌డ‌జ‌ను కార‌వ్యాన్ ల‌ను సెట్స్ పైకి తెచ్చి నిర్మాత‌ను డ‌బ్బు చెల్లించాల‌ని కోర‌తార‌ని కూడా వెల్ల‌డించడం షాకిచ్చింది.

ఇప్పుడు మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఈ వ్య‌వ‌హారంపై త‌న వెర్ష‌న్ చెప్పుకొచ్చారు. నిర్మాత‌లు హీరోల వ్య‌క్తిగ‌త డ్రైవ‌ర్ కు, హీరోల‌ పిల్ల‌ల చ‌దువుల‌కు ఖ‌ర్చులు భ‌రించాల్సిన అవ‌స‌రం లేదని అమీర్ ఖాన్ అన్నారు. నేటిత‌రంలో మారిన ట్రెండ్ గురించి మాట్లాడుతూ ఇది స‌హించ‌త‌గిన‌ది కాద‌ని అమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఒక నిర్మాత‌గా, అగ్ర క‌థానాయ‌కుడుగా ఆయ‌న నిర్మాత‌కు పెరుగుతున్న భారం గురించి ఆవేద‌న వ్య‌క్తం చేసారు. తాను ఎప్పుడూ త‌న వ్య‌క్తిగ‌త సిబ్బంది కోసం నిర్మాత నుంచి వ‌సూలు చేయ‌లేద‌ని, దేనినీ డిమాండ్ చేయ‌లేద‌ని అన్నారు. నిర్మాత సినిమాకు అవసరమైనంత మాత్రమే ఖర్చు చేయాలి. మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ డ్రెసర్, కాస్ట్యూమ‌ర్‌కు జీతాలివ్వ‌వ్వడం సినిమాలో భాగం. హీరో కొడుక్కి లేదా వ్య‌క్తిగ‌త డ్రైవర్ కు నిర్మాత‌ ఎందుకు చెల్లించాలి? అని ప్ర‌శ్నించారు. నా కోసం వ్య‌క్తిగ‌తంగా ప‌ని చేసేవారికి నిర్మాత ఎందుకివ్వాలి? అని అడిగారు. నేను ఇలాంటి ప‌ద్ధ‌తి నుంచి వైదొలిగాన‌ని అమీర్ ఖాన్ స్ప‌ష్ఠం చేసారు.

నా సిబ్బందికి నిర్మాత‌లు చెల్లించాల‌ని నేను అనుకోనని అన్నారు. వారు నా పిల్లల స్కూల్ ఫీజులు కూడా చెల్లిస్తారా? ఇది జ‌రుగుతుందా? అని ప్ర‌శ్నించారు. కొంద‌రు స్టార్లు వంట వ్యాన్, జిమ్ వ్యాన్ సెట్స్ కి తెచ్చి నిర్మాత‌ను చెల్లించ‌మంటున్నారు. వారి వ్య‌క్తిగ‌త డ్రైవ‌ర్, వంట వాళ్ల‌కు నిర్మాత ఎందుకు చెల్లించాలి? అని అమీర్ ఖాన్ ప్ర‌శ్నించారు. నేను రెజ్లింగ్‌పై సినిమా చేసినప్పుడు శిక్షణను నిర్మాత అందించడం స‌మంజ‌స‌మ‌ని అన్నారు. నేను నా కుటుంబాన్ని నాతో పాటు తీసుకుని వెళితే, వారి ఖ‌ర్చుల‌ను నిర్మాత‌లు భ‌రించ‌రు.. నేను మాత్ర‌మే భ‌రిస్తాన‌ని తెలిపారు.