Begin typing your search above and press return to search.

బడ్జెట్ రాబట్టిన సితారే జమీన్ పర్.. అమీర్ ఖాన్ ప్లాన్ వర్కౌట్ అయిందా?

అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, జెనీలియా జంటగా వచ్చిన 'సితారే జమీన్ పర్' మూవీ జూన్ 20న విడుదలైన సంగతి మనకు తెలిసిందే.

By:  Madhu Reddy   |   11 Aug 2025 12:59 PM IST
బడ్జెట్ రాబట్టిన సితారే జమీన్ పర్.. అమీర్ ఖాన్ ప్లాన్ వర్కౌట్ అయిందా?
X

ఈ మధ్యకాలంలో సినిమాలకి కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ బొక్క బోర్లా పడుతున్నారు నిర్మాతలు. అయితే కొంతమంది నిర్మాతలు కాస్త తెలివిగా ఆలోచించి సినిమా విడుదలకు ముందే భారీ ప్రమోషన్స్ చేయడమే కాకుండా.. ఓటీటీలకు అమ్మేస్తూ ఎక్కువ మొత్తంలో ముందుగానే డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే అప్పుడప్పుడు ఓటీటీలలో కూడా సినిమా దెబ్బ కొడుతుంది. థియేటర్లో విడుదలైన సినిమా ఫ్లాప్ టాక్ వస్తే.. ఓటీటీలో ఎవరు ఆదరించరు. అయితే కొన్ని కొన్ని సినిమాలు థియేటర్లో ఫ్లాప్ అయినా.. ఓటీటీలో హిట్ అయినవి ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అమీర్ ఖాన్ తన సినిమా విషయంలో చేసిన ఈ పనికి చాలామంది మెచ్చుకుంటున్నారు.ఇలా కూడా పెట్టిన బడ్జెట్ ని కలెక్ట్ చేయొచ్చా అంటూ నోరెళ్లబెడుతున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, జెనీలియా జంటగా వచ్చిన 'సితారే జమీన్ పర్' మూవీ జూన్ 20న విడుదలైన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా థియేటర్ లో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఆర్.ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాని అమీర్ ఖాన్ తన సొంత బ్యానర్ లో అపర్ణ పురోహిత్ తో కలిసి నిర్మించారు. అయితే ఈ సినిమా రూ.122 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ఓ మోస్తరు కలెక్షన్స్ వచ్చినప్పటికీ.. అమీర్ ఖాన్ తీసుకున్న ఓ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

అదేంటంటే.. అందరూ సినిమా విడుదల కాకముందే ఓటీటీ సంస్థలకు సినిమాని అమ్మేసి సినిమా విడుదలయ్యాక నెల రోజులకో రెండు నెలలకో ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యేలా ముందుగానే మాట్లాడుకుంటారు. కానీ అమీర్ ఖాన్ మాత్రం తన సినిమాని ఓటీటీలకు కాకుండా యూట్యూబ్లో రెంటల్ పద్ధతిలో రిలీజ్ చేసి సక్సెస్ అయ్యారు. యూట్యూబ్లో రెంటల్ పద్ధతిలో విడుదలైన సితారే జమీన్ పర్ మూవీ ఇప్పుడు ఏకంగా రూ. 250 కోట్లు కలెక్ట్ చేయడంతో ఈ విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఓటీటీలకు ఇవ్వకుండా ఇలా యూట్యూబ్ ద్వారా కూడా మనీ సంపాదించవచ్చు అని అమీర్ ఖాన్ నిరూపించారు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అమీర్ ఖాన్ చేసిన పనిని మాత్రం చాలా మంది మెచ్చుకుంటున్నారు.

ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.276 కోట్లు కలెక్ట్ చేసింది.అయితే ప్రైమ్ వీడియో.. సితారే జమీన్ పర్ మూవీకి రూ.120 కోట్ల ఆఫర్ ఇచ్చిందట. కానీ అమీర్ ఖాన్ మాత్రం దాన్ని తిరస్కరించారని కోమల్ నహ్త అనే సినీ విశ్లేషకుడు ఈ విషయాన్ని బయట పెట్టారు. అయితే ఓ పాడ్ కాస్ట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. నేను ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఇంకా తిరిగి పొందలేదని, కచ్చితంగా ఈ డబ్బులని నేను తిరిగి పొందుతానని చెప్పారు. దీనికి తోడు మొదటినుంచి ఓటీటీ వ్యతిరేకిగా పేరు సొంతం చేసుకున్న అమీర్ ఖాన్ ఇప్పుడు తన సినిమాను ఓటీటీలో కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చి అందరిని ఇప్పుడు ఆశ్చర్యపరిచారు. దీనికి తోడు అందరికీ సినిమా అందుబాటులో ఉంటే కచ్చితంగా కలెక్షన్లు పెరుగుతాయని.. యూట్యూబ్ అందరికీ అందుబాటులో ఉండే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కావడంతో ఆ సినిమాను ఇక్కడ రిలీజ్ చేశారు. మొత్తానికైతే అమీర్ ఖాన్ ప్లాన్ ఇప్పుడు వర్క్ అవుట్ అయిందని చెప్పవచ్చు.