'భార్య- కుమారుడి' ని దాచేసిన సూపర్‌స్టార్?
స్వయానా అమీర్ ఖాన్ సోదరుడే ఆ పేర్లను బయటపెడుతూ ఆరోపించడంతో ఇప్పుడు ప్రజలకు మరింత లోతైన అవగాహన వచ్చింది.
By: Sivaji Kontham | 20 Aug 2025 8:45 AM ISTమిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ షష్ఠిపూర్తి వయసులో తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. అతడు వ్యక్తిగతంగా, వృత్తిగతంగా కూడా కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు. అతడు రెండో భార్య కిరణ్ రావుకు విడాకులిచ్చి బెంగళూరు యువతితో ప్రేమాయణంలో ఉన్నాడు. ఇది అతడికి కొంత ఉపశమనాన్ని ఇచ్చినా కానీ, కెరీర్ పరంగా ఆశించిన విజయాల్లేక తీవ్ర నిరాశలో ఉన్నాడు. ఇంతకుముందు చాలా ఆశలు పెట్టుకున్న `లాల్ సింగ్ చడ్డా` డిజాస్టరవ్వడంతో చాలా కలతకు గురయ్యాడు. తర్వాత సీతారే జమీన్ పర్ క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నా కానీ, బాక్సాఫీస్ వద్ద సోసోగానే ఆడింది. ఇది కూడా అతడిని కొంత బాధ పెట్టింది.
అదంతా అటుంచితే వ్యక్తిగత జీవితంలో అతడికి ఇంకా ఏం సమస్యలున్నాయి? అని ప్రశ్నిస్తే... అమీర్ కి మొదటి భార్య రీనా రావు నుంచి జునైద్ ఖాన్- ఇరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కిరణ్ రావు నుంచి ఆజాద్ రావు అనే కుమారుడు కూడా ఉన్నారు. అయితే ఇంతకాలం ఇద్దరు భార్యలకు ముగ్గురు పిల్లలు అని అంతా అనుకున్నారు. కానీ అది నిజం కాదని ఇటీవల అమీర్ ఖాన్ సోదరుడు ఫైజల్ ఖాన్ అసలు గుట్టు విప్పాడు.
అమీర్ ఖాన్ సహా ఇతర కుటుంబ సభ్యులతో తనకు సమస్యలున్నాయని ఫైజల్ ఖాన్ మీడియా ఎదుట వ్యాఖ్యానించాడు. తన కుటుంబంతో సంబంధాలను ఎందుకు తెంచుకున్నాడో విలేకరుల సమావేశంలో చెప్పాడు. తన కుటుంబం తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని, కానీ తన భవిష్యత్తును వారు నిర్ణయించుకోవాలని తాను కోరుకోవడం లేదని చెప్పాడు. ఒక లేఖ రాస్తూ, కుటుంబంలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమస్యల్ని హైలైట్ చేసాడు. తన కుటుంబ సభ్యుల లోపాలు, విఫలమైన సంబంధాల గురించి చర్చిస్తూ ఫైసల్ అమీర్‌ను తీవ్రంగా విమర్శించాడు. రీనాను వివాహం చేసుకున్నప్పుడు అతడు బ్రిటీష్ జర్నలిస్ట్ జెస్సికా హైన్స్‌తో ఎఫైర్ నడిపించాడని, వారికి వివాహం కాకుండా జాన్ అనే బిడ్డ జన్మించాడని పేర్కొన్నాడు. ఆ కాలంలో అమీర్ తన రెండవ భార్య కిరణ్ రావుతో నివసిస్తున్నాడని తరువాత 2022లో విడాకులు తీసుకున్నాడని ఫైసల్ ఆరోపించాడు.
స్వయానా అమీర్ ఖాన్ సోదరుడే ఆ పేర్లను బయటపెడుతూ ఆరోపించడంతో ఇప్పుడు ప్రజలకు మరింత లోతైన అవగాహన వచ్చింది. నిజానికి ఇది ఈనాటి వివాదం కాదు. చాలా కాలంగా నలుగుతున్నది. 2005లోనే అమీర్- జెస్సికా ఎఫైర్ గురించి స్టార్ డస్ట్ మ్యాగజైన్ అప్పట్లోనే సంచలన కథనం వెలువరించింది. గులాం షూటింగ్ సమయంలో జెస్సికాను అమీర్ కలిసాడని ఆమెకు జాన్ అనే బిడ్డ ఉందని కథనం పేర్కొంది. అయితే బిడ్డ జననాన్ని అంగీకరించని అమీర్ ఖాన్ గర్భ స్రావం చేయమని కోరినట్టు కూడా కథనాలొచ్చాయి. కానీ దానికి అంగీకరించని జెస్సికా బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకుంది. అలా పుట్టినవాడు జాన్ ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడు. జెస్సికా 2007లో లండన్‌కు చెందిన వ్యాపారవేత్త విలియం టాల్బోట్‌ను వివాహం చేసుకున్నట్లు టైమ్స్ తన కథనంలో ధృవీకరించింది. తాను భారతదేశంలో అమితాబ్ బచ్చన్ పుస్తకంపై పనిచేస్తున్నప్పుడు విలియం తన కుమారుడిని అత్యంత సౌకర్యంగా చూసుకున్నాడని కూడా జెస్సికా కితాబిచ్చింది.
రెండు సంవత్సరాల క్రితం జెస్సికా కొడుకు ఫోటోలు రెడ్డిట్‌లో కనిపించాయి. అభిమానులు ఆమిర్‌తో అతని పోలికను గుర్తించారు. ప్రస్తుతం అమీర్ మరో కొడుకు అంటూ సోషల్ మీడియాల్లో ఈ ఫోటో వైరల్ గా మారుతోంది. అయితే దీనిలో నిజం ఏమిటన్నది అమీర్ ఖాన్ స్వయంగా నిర్ధారిస్తే బావుంటుంది. నాలుగో భార్య (లేదా గాళ్ ఫ్రెండ్) వారసుడు ఇప్పుడు అమీర్ ఖాన్ ఆస్తి పాస్తుల్లో వాటా కావాలని అడిగితే పరిస్థితి ఎలా మారుతుంది?
