Begin typing your search above and press return to search.

వేలకోట్ల ఆస్తి.. కానీ అద్దె ఇంట్లోనే..కారణం?

సినిమాల ద్వారా వచ్చిన డబ్బును వివిధ రంగాలలో పెట్టుబడులుగా పెడుతూ వేల కోట్లు వెనకేసుకుంటున్నారు స్టార్ హీరో హీరోయిన్లు.

By:  Madhu Reddy   |   5 Aug 2025 5:20 PM IST
వేలకోట్ల ఆస్తి.. కానీ అద్దె ఇంట్లోనే..కారణం?
X

సినిమాల ద్వారా వచ్చిన డబ్బును వివిధ రంగాలలో పెట్టుబడులుగా పెడుతూ వేల కోట్లు వెనకేసుకుంటున్నారు స్టార్ హీరో హీరోయిన్లు. అయితే అందులో కొంతమంది వెనుక వేలకోట్ల ఆస్తి ఉన్నా ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అన్ని ఆస్తులు ఉన్నప్పుడు అద్దె ఇంట్లో ఉండడం ఏంటి అని అందరిలో అనుమానాలు కలగవచ్చు. కానీ కొంతమంది తమకు అనుకూలంగా ఉండే ప్రదేశంలో సొంత భవనాలు లేకపోవడం, దీనికి తోడు పలు కారణాల వల్ల సొంతభవనాలను వదిలి ఇలా అద్దెకు దిగుతూ.. లక్షల్లో మధ్య చెల్లిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటివరకు వేలకోట్ల ఆస్తులకు అధిపతి అయిన మహేష్ బాబు కూడా అద్దె ఇంట్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా వచ్చి చేరిపోయారు.

తాజాగా ఆయన తన సొంత ఇంటిని వదిలి అద్దె ఇంటికి షిఫ్ట్ అయినట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బాంద్రా వెస్ట్ లోని పాలిహిల్ ఏరియాలో నర్గీస్ దత్ రోడ్ లో ఉన్న విల్నోమోనా అనే సొసైటీలో నాలుగు అపార్ట్మెంట్ లను అమీర్ ఖాన్ అద్దెకు తీసుకున్నారు. నెలకు రూ.24.5 లక్షల అద్దె ప్రాతిపదికన లీజుకు తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు ప్రతి ఏడాది 5% అద్దె పెంచేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. 2025 మే నుంచి 2030 మే వరకు దాదాపు 5 సంవత్సరాల పాటు ఈ లగ్జరీ అపార్ట్మెంట్ లను అమీర్ ఖాన్ లీజుకు తీసుకున్నట్లు సమాచారం.అద్దె ఒప్పందం విషయానికి వస్తే.. రూ.1.46 కోట్లకు సెక్యూరిటీ డిపాజిట్ చేశారు. రూ 4లక్షల స్టాంపు డ్యూటీ, రూ.2000 రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించారు. ఈ విషయం తెలిసి సదరు హీరో అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వేలకోట్ల ఆస్తి ఉన్నా.. ఇలా లక్షల్లో అద్దె చెల్లించి అద్దె ఇంట్లో ఉండడానికి గల కారణం ఏంటి అని అభిమానులు కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు.అసలు విషయంలోకి వెళ్తే.. అమీర్ ఖాన్ కి విర్గో కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో దాదాపు 12 అపార్ట్మెంట్లు ఉన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం సొసైటీలో డెవలప్మెంట్ జరుగుతున్న కారణంగా ఆయన అద్దె ఇంటికి షిఫ్ట్ అయినట్లు ఇప్పుడు ముంబై మీడియా తెలిపింది.

అమీర్ ఖాన్ ఆస్తుల విషయానికి వస్తే.. ఆయన నికర ఆస్తుల విలువ రూ.1,862 కోట్లు అని సమాచారం. బెవెర్లీ హిల్స్ మాన్సన్ విలువ రూ.75 కోట్ల పైమాటే. అటు సముద్రం వైపు బాంద్రా దగ్గర ఒక ఇల్లు ఉంది. దీని విలువ రూ.60 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక పంచగని ఫామ్హౌస్, మహారాష్ట్రలో మరో విలాసవంతమైన ఎస్టేట్ కలిగి ఉన్నారు. . వీటి విలువ రూ.75 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. సుమారుగా రూ.20 కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు కూడా ఈయన కార్ గ్యారేజీలో ఉన్నాయి. ఇప్పుడు ఒక్కో సినిమాకి రూ..90 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. పలు యాడ్స్ ద్వారా ఏడాదికి రూ.12 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం.