Begin typing your search above and press return to search.

బాలీవుడ్ కు మళ్ళీ ఈ కాంబో కావాలి..

బాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా పెద్ద సినిమాలంటే యాక్షన్, స్పై థ్రిల్లర్స్, గ్యాంగ్‌స్టర్ డ్రామాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

By:  M Prashanth   |   3 Sept 2026 9:35 AM IST
బాలీవుడ్ కు మళ్ళీ ఈ కాంబో కావాలి..
X

బాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా పెద్ద సినిమాలంటే యాక్షన్, స్పై థ్రిల్లర్స్, గ్యాంగ్‌స్టర్ డ్రామాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారీ ఓపెనింగ్స్ కూడా ఎక్కువగా అలాంటి సినిమాలకే వస్తున్నాయి. కానీ ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’ తరహాలో నవ్విస్తూ, మధ్యలో ఒక సీరియస్ పాయింట్ చెప్పి, కుటుంబం మొత్తం కలిసి చూడగల సినిమా మాత్రం చాలా అరుదైపోయింది. సరిగ్గా ఈ టైమ్‌లో రాజ్‌కుమార్ హిరానీ ‘త్రీ ఇడియట్స్’ సీక్వెల్ కథ రాస్తున్నట్టు చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఆమిర్ ఖాన్, హిరానీ కలిసి చేసిన రెండు సినిమాలూ ఇదే దారిలో వెళ్లాయి. ‘త్రీ ఇడియట్స్’లో చదువు, మార్కులు, కెరీర్ ఒత్తిడి గురించి మాట్లాడారు. ‘పీకే’లో మతం పేరుతో జరిగే కొన్ని విషయాలను కామెడీతో చెప్పారు. రెండింట్లోనూ పెద్ద యాక్షన్ లేదు. హీరో ఎలివేషన్స్ కోసం ప్రత్యేకంగా సీన్లు పెట్టలేదు. అయినా థియేటర్లలో భారీగా ఆడాయి.

ఈ మధ్య బాలీవుడ్‌లో కంటెంట్ సినిమాలు రావడం లేదని కాదు. వస్తున్నాయి, హిట్లు కూడా అవుతున్నాయి. కానీ పెద్ద స్టార్, భారీ బాక్సాఫీస్, ఫ్యామిలీ ఆడియన్స్, కామెడీ, సోషల్ పాయింట్ అన్నీ ఒకే సినిమాలో కలవడం తగ్గింది. ఒకప్పుడు హిరానీ సినిమాలకు ఉన్న ప్రత్యేకత అదే. సినిమా చూసి బయటకు వచ్చాక కామెడీ సీన్లు గుర్తుండేవి, చెప్పిన విషయం కూడా గుర్తుండేది.

ఆమిర్‌కు కూడా ఇలాంటి సినిమా ఇప్పుడు బాగా సెట్ అవుతుంది. ‘దంగల్’ తర్వాత ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’, ‘లాల్ సింగ్ చద్దా’తో ఎదురుదెబ్బలు తగిలాయి. ‘సితారే జమీన్ పర్’తో హిట్ దొరికింది. కానీ ఆమిర్ పేరు చెప్పగానే దేశవ్యాప్తంగా కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే స్థాయి సినిమా మాత్రం చాలా కాలంగా పడలేదు.

హిరానీకి ‘సంజు’ తర్వాత ‘డంకీ’ వచ్చింది. షారుఖ్ ఖాన్ ఉన్నా, ఆయన గత సినిమాల స్థాయిలో ఆ సినిమా నిలవలేదు. ఇప్పుడు మళ్లీ రాంచో, ఫర్హాన్, రాజు పాత్రలను తీసుకొస్తే పాత జ్ఞాపకాలు ఒక్కటే సరిపోవు. ఇరవై ఏళ్ల తర్వాత వాళ్ల జీవితాల్లో ఏం జరిగింది అనే కథ ఈ కాలానికి సెట్ కావాలి. సీక్వెల్ ఇంకా కథ దశలోనే ఉంది. ఆమిర్, మాధవన్, శర్మన్ జోషిని తిరిగి తీసుకురావాలనే ఆలోచన ఉందని హిరానీ చెప్పారు. అది నిజంగా సెట్స్‌పైకి వెళ్తే బాలీవుడ్‌కు మళ్ళీ బూస్ట్ దొరకొచ్చు.