Begin typing your search above and press return to search.

అమీర్ ఖాన్ ఎంట్రీపై నీళ్లు జ‌ల్లేసిన నిర్మాత‌!

ఈ ప్రచారంపై చిత్ర నిర్మాణ సంస్థ టిప్స్ ఫిల్మ్స్ అధినేత , నిర్మాత రమేష్ తౌరానీ తక్షణమే స్పందించారు.

By:  Srikanth Kontham   |   1 Sept 2026 2:00 PM IST
అమీర్ ఖాన్ ఎంట్రీపై నీళ్లు జ‌ల్లేసిన నిర్మాత‌!
X

బాలీవుడ్‌ మోస్ట్ పాపులర్ యాక్షన్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో `రేస్` ఒకటి. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి రిలీజ్ అయిన‌ మూడు భాగాలు బాక్సాఫీస్ వద్ద మంచి సందడి చేయగా త్వరలోనే రాబోతున్న `రేస్ 4` పై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించబోతున్నారని.. అలాగే `ధూమ్ 3` దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ ప్రచారంపై చిత్ర నిర్మాణ సంస్థ టిప్స్ ఫిల్మ్స్ అధినేత , నిర్మాత రమేష్ తౌరానీ తక్షణమే స్పందించారు. అమీర్ ఖాన్ ఎంట్రీపై వస్తున్న కథనాలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని.. అందులో ఎలాంటి నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. సోష‌ల్ మీడియాలో రేస్ 4 నటీనటుల ఎంపికపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. చిత్రానికి సంబంధించి కాస్టింగ్ ప్రక్రియ ఇంకా పూర్తవ్వలేదన్నారు. నటీనటుల ఎంపిక పూర్తయిన వెంటనే నిర్మాణ సంస్థ నుంచే అధికారిక ప్రకటన ఇస్తామ‌న్నారు.

`రేస్ 4` నటీనటుల విషయంలో ఇలాంటి పుకార్లు రావడం మొదటిసారేమీ కాదు. గతంలో `రేస్` మొదటి భాగంలో నటించిన అక్షయ్ ఖన్నా పాత్రను మళ్లీ నాలుగో భాగంలో పునరుద్ధరించబోతున్నారనే వార్తలు వచ్చాయి. అప్పట్లో కూడా రమేష్ తౌరానీ ఆ వార్తలను ఖండించారు. మొదటి భాగంలోనే ఆ క్యారెక్టర్ ముగిసిపోయిందని, అతనిని మళ్లీ తీసుకొచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా సిద్ధార్థ్ మల్హోత్రా, టైగర్ ష్రాఫ్ వంటి యంగ్ హీరోలు కథ విన్నారంటూ వచ్చిన వార్తలపై కూడా మేకర్స్ ఎలాంటి అధికారిక ధృవీకరణ ఇవ్వలేదు.

2008లో అబ్బాస్-మస్తాన్ దర్శకత్వంలో సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన `రేస్` చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అటుపై 2013లో రిలీజ్ అయిన `రేస్ 2` కూడా భారీ వసూళ్లను రాబట్టింది. అయితే 2018లో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా వచ్చిన `రేస్ 3` మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దాంతో నాలుగో భాగాన్ని ఎంతో జాగ్రత్తగా, అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఫ్రాంచైజీకి పూర్వ వైభవం తీసుకురావడానికి సరైన నటీనటులు , దర్శకుడిని ఎంపిక చేసే పనిలో టిప్స్ సంస్థ నిమగ్నమైంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు , నెటిజన్లు పుకార్లను నమ్మకుండా నిరీక్షించాల్సిందే. మరి ఈ ప్రతిష్టాత్మక యాక్షన్ థ్రిల్లర్‌లో అంతిమంగా ఏ అగ్ర నటులు భాగమవుతారో చూడాలి.