షూటింగ్ మధ్యలో సెకెండాఫ్ మార్చేసిన ద్వయం!
బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో అమీర్ ఖాన్ సరికొత్త రికార్డులను సృష్టించడమే కాదు.
By: Srikanth Kontham | 19 May 2026 12:44 PM ISTబాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో అమీర్ ఖాన్ సరికొత్త రికార్డులను సృష్టించడమే కాదు. సామాజిక అంశాలపై ఆలోచింపజేసే చిత్రాలను అందించడంలో మిస్టర్ పర్ఫెక్ట్ ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రాలలో `పీకే` ఒకటి. అమీర్- రాజ్‌కుమార్ హిరాణీ కాంబినేషన్‌లో రిలీజ్ అయిన `పీకే’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అమీర్ ఖాన్ తాజాగా ఓ ఆసక్తికర నిజాన్ని బయటపెట్టారు. ఈ సినిమా ద్వితీయార్థం లో స్క్రిప్ట్ పరంగా తాము ఊహించని మార్పులు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.
`పీకే` సినిమా షూటింగ్ సమయంలో తాము ఎదుర్కొన్న సృజనాత్మక సవాళ్లను పంచుకున్నారు. మొదట అనుకున్న కథ ప్రకారం సినిమా రెండవ భాగం వేరేలా ఉండేదని అయితే అవుట్‌పుట్ పట్ల తాము పూర్తిగా సంతృప్తిగా లేమని అమీర్ తెలిపారు .ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం అనుకున్న సన్నివేశాలు అనుకున్నట్లుగా తెరకెక్కించినా? ఎడిటింగ్ టేబుల్ పై చూసుకున్నప్పుడు కథలో ఎక్కడో ఏదో లోపించిందనే భావన చిత్ర యూనిట్‌కు కలిగిందని అమీర్ వివరించారు. సినిమా అనుకున్న రేంజ్‌లో రాకపోవడానికి ప్రధాన కారణం `పీకే` ఒరిజినల్ ద్వితీయార్థం లో ఉన్న కొన్ని లూప్‌హోల్స్ అమీర్ ఖాన్ స్పష్టం చేశారు.
ఆ వెర్షన్‌లో కథానాయ కుడి ప్రయాణం , అందులోని హాస్యం, ఎమోషన్స్ సరిగ్గా బ్యాలెన్స్ కాలేదని గుర్తించారు. ప్రేక్షకులు ఈ రకమైన నెరేషన్‌కు కనెక్ట్ అవ్వడం కష్టమని భావించిన అమీర్ ఖాన్ -రాజ్‌కుమార్ హిరాణీ వెంటనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే షూట్ చేసిన కొన్ని కీలకమైన సీన్లను పక్కన పెట్టి కథను మార్చాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే స్క్రిప్ట్ రైటర్లతో కలిసి కూర్చుని `పీకే` సెకండ్ హాఫ్‌ను పూర్తిగా పునర్నిర్మించారు. వినోదానికి మరింత ప్రాధాన్యతనిస్తూనే సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను ప్రశ్నించే కోణాన్ని మరింత బలంగా, సున్నితంగా మార్చారు.
ఈ మార్పుల కోసం అదనపు సమయం, బడ్జెట్ ఖర్చయినప్పటికీ సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ముందడుగు వేశారు. ఆ మార్పులే ఈ సినిమాను ఓ క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించాయని అమీర్ గుర్తు చేసుకున్నారు. సినిమా రంగంలో నటుడిగా, నిర్మాతగా అమీర్ ఖాన్‌కు ఉన్న `మిస్టర్ పర్ఫెక్ట్` అనే బిరుదు ఊరికే రాలేదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. సినిమా పూర్తయిన తర్వాత కూడా ఎక్కడ తప్పు జరిగిందో? వెతికి పట్టుకుని దానిని సరిదిద్దే వరకు విశ్రమించని నైజం నిజంగా అభినందనీయం.
రాజ్‌కుమార్ హిరాణీ వంటి స్టార్ డైరెక్టర్ కూడా అమీర్ ఖాన్ ఇచ్చిన ఇన్పుట్స్‌ను గౌరవించి సినిమాను రీ-షూట్ చేయడానికి అంగీకరించడం వారి మధ్య ఉన్న పరస్పర నమ్మకాన్ని,సినిమాపై వారికున్న అంకితభావాన్ని చాటిచెప్తోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన `పీకే` చిత్రం వెనుక ఇంతటి స్క్రిప్ట్ కసరత్తు ఉందనే విషయం సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక సినిమా విజయం సాధించాలంటే నటీనటుల క్రేజ్ మాత్రమే సరిపోదని, తెర వెనుక జరిగే సృజనాత్మక మార్పులు, సరైన నిర్ణయాలు ఎంత అవసరమో అమీర్ ఖాన్ పంచుకున్న అనుభవం నిరూపిస్తోంది.
