సూపర్‌స్టార్‌పై అమ్మమ్మ చెప్పిన కథల ప్రభావం
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ దేనిని ఎంచుకున్నా అందులో పర్ఫెక్షనిజం హృదయాలను గెలుచుకుంటుంది.
By: Sivaji Kontham | 30 Nov 2025 10:24 AM ISTమిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ దేనిని ఎంచుకున్నా అందులో పర్ఫెక్షనిజం హృదయాలను గెలుచుకుంటుంది. ఆయన ఒక సినిమా కథను ఎంపిక చేస్తే అది కోట్లాదిగా ప్రజల హృదయాలను తాకుతుంది. ఆయన నటనపై దృష్టి సారిస్తే విజృంభనే. దానికి కెరీర్ లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. లగాన్, దంగల్, పీకే, 3 ఇడియట్స్, సీక్రెట్ సూపర్ స్టార్ ఇవన్నీ దానికి ఉదాహరణలు. అమీర్ ఖాన్ ఒక ప్రాజెక్టును ఎంచుకుంటే, అందులో సామాజిక సందేశం ప్రజలను మరింత ఎక్కువగా ఆకర్షిస్తుంది. అందుకే అతడు సమకాలీన హీరోలతో పోల్చినప్పుడు విభిన్నంగా కనిపిస్తాడు.
ఇప్పుడు అతడి మాస్టర్ క్లాస్ వినే అవకాశం గోవా ఇఫీ వేడుకల్లో ఔత్సాహిక ఫిలింమేకర్స్ కి దక్కింది. ఒక పని కోసం వందశాతం ఎలా ఇన్వాల్వ్ అవ్వాలో అమీర్ ఖాన్ చెప్పిన తీరు ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం నిర్మాతగా లాహోర్ 1947, హ్యాపీ పటేల్ చిత్రాలను పూర్తి చేసిన తర్వాత తాను పూర్తిగా నటనకు షిఫ్టవుతానని చెప్పారు. ఈ రెండూ పూర్తవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని అన్నారు. ప్రస్తుతం స్క్రిప్టులు వింటున్నాను. రెండు మూడు లాక్ అయ్యాయని, అయితే ఇంకా వినే ప్రాసెస్ లో ఉన్నానని చెప్పారు అమీర్.
ఒకసారి నటనలోకి వచ్చాక పూర్తిగా ఆ వృత్తికి మాత్రమే అంకితమవుతానని చెప్పాడు. ఆ తర్వాత దర్శకుడిగాను నిరూపిస్తానని అన్నారు. దర్శకత్వం తన అతిపెద్ద ప్రేమ. ఒకసారి దర్శకుడిని అయితే నటన వదిలేస్తానని కూడా అమీర్ ఖాన్ అన్నారు. ఎందుకంటే అది నన్ను కబళిస్తుందని కూడా వ్యాఖ్యానించారు. నిజానికి అమీర్ ఖాన్ ప్రతి మాటా డెడికేషన్, కమిట్ మెంట్ కి సంబంధించినవి. ఇవన్నీ యువ ఔత్సాహిక ఫిలింమేకర్స్ కి స్ఫూర్తిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) చివరి ఫైర్‌సైడ్ చాట్ సెషన్ ను అమీర్ ఖాన్ ఉల్లాసంగా ముగించాడు. సినీ విమర్శకుడు బరద్వాజ్ రంగన్ సారథ్యంలోని `ది నేరేటివ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ ఇన్‌క్లూజివిటీ` సెషన్ లో అమీర్ మాట్లాడారు. ఈ సమావేశంలో తాను ప్రస్తుత చిత్రాలను పూర్తి చేసిన తర్వాత నటనకు పూర్తి సమయం తిరిగి వస్తున్నట్లు ధృవీకరించాడు
తన కథల ఎంపిక గురించి ప్రస్థావిస్తూ.. తాను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ చెప్పిన కథలు విని ప్రేరణ పొందానని తెలిపాడు. అందువల్ల కథల ఎంపికకు అత్యంత ప్రాధాన్యతనిస్తానని అన్నారు. నేను ఎప్పుడూ మంచి కథలకు ఆకర్షితుడయ్యాను. అవి నా బాల్యంలో ఒక పెద్ద భాగం. అది నటుడిగా నా ఎంపికలను ప్రభావితం చేసాయని అమీర్ ఖాన్ అన్నారు.
నేను ఏది చేసినా రిపీట్ చేయను. అలా చేయలేను. ప్రతిదీ తాజాగా, ప్రత్యేకమైనదిగా, సృజనాత్మకంగా ఉత్తేజకరంగా అనిపించాలి. అలాంటి కథల కోసం వేచి చూస్తాను! అని వివరించాడు. ట్రెండ్-ఆధారిత ఫిలింమేకింగ్ కి తాను వ్యతిరేకమని అమీర్ అన్నారు. కథలో భావోద్వేగాలు అవసరం. అది పూర్తిగా కట్టుబాట్లకు విరుద్ధంగా ఉన్నప్పటికీ నాకు నచ్చుతుందని అన్నారు. తాను లగాన్ సినిమా చేసినప్పుడు అందులో స్టార్ కనిపించకూడదు.. కేవలం నటుడు మాత్రమే కనిపించాలని ప్రముఖ రచయిత జావేద్ సాబ్ హెచ్చరించారని అమీర్ తెలిపారు. ఆ ఎంపిక ఒక సాహసం అని కూడా అన్నాడు.
నేను సందేశం ఇచ్చే కథల కోసం వేచి చూడను. నన్ను ఉత్తేజపరిచే స్క్రిప్ట్‌ల కోసం మాత్రమే వెతుకుతాను. ఒక గొప్ప స్క్రిప్ట్ సామాజిక సందేశాన్ని కలిగి ఉంటే, అది బోనస్ అవుతుందని ఆయన పేర్కొన్నారు.తారే జమీన్ పర్, 3 ఇడియట్స్, దంగల్, లాపాటా లేడీస్ ప్రపంచాలను రూపొందించినందుకు రచయితలను ప్రశంసించారు. ఇఫీ ముగింపు వేడుకల్లో సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు ఆమిర్‌ను సత్కరించారు.
