ఫ్లాప్ మూవీ అంటే పిల్లాడిని కోల్పోయినట్టే.. ఆమిర్ షాకింగ్ స్టేట్‌మెంట్!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆమిర్ ఖాన్ మరోసారి తన సినిమాల పట్ల ఉన్న ఎమోషనల్ బాండింగ్‌ను బయటపెట్టారు.
By: Sravani Lakshmi Srungarapu | 27 May 2026 11:26 AM ISTబాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆమిర్ ఖాన్ మరోసారి తన సినిమాల పట్ల ఉన్న ఎమోషనల్ బాండింగ్‌ను బయటపెట్టారు. కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్‌లు అందించిన ఆయనకు, ఒక సినిమా ఫ్లాప్ అయితే అది పర్సనల్ గా ఎంతగా బాధిస్తుందో తాజాగా వెల్లడించారు. ఆడియన్స్ రిజెక్ట్ చేసిన ప్రతి సినిమా తన మనసును తీవ్రంగా కలచివేస్తుందని, అలాంటి సందర్భాల్లో తాను రెండు నుంచి మూడు నెలల వరకు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతానని ఆమిర్ చెప్పడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమిర్ ఖాన్ తన సినిమాల జయాపజయాలను చాలా పర్సనల్‌గా తీసుకుంటానన్నారు. ఆడియన్స్ కోసమే తాము సినిమాలు తీస్తామని, థియేటర్‌కు వచ్చి డబ్బు ఖర్చు చేసి మరీ ఆడియన్స్ సినిమా చూస్తారని, అలాంటి టైమ్ లో సినిమా వారికి నచ్చకపోతే తప్పు వాళ్లది కాదని, తమ పని లోపించింది అని అర్థమని, ఒక సినిమా ఫ్లాప్ అయితే తన గుండె విరిగిపోతుందని ఆయన ఎంతో ఎమోషనల్ గా చెప్పారు. సినిమా అనేది తనకు పిల్లల లాంటిదని, అది ప్రేక్షకుల చేత రిజెక్ట్ చేయబడితే ఎంతో బాధ కలుగుతుందని తెలిపారు. సినిమా వర్కవుట్ అవకపోతే అది ఓ పిల్లాడిని కోల్పోయినట్లే ఉంటుందని, ఆ బాధను బయటపెట్టాలి, ఏడవాలి, టైమ్ ఇవ్వాలి. అలా చేస్తేనే మళ్లీ ముందుకు వెళ్లగలమంటూ తన మనసులోని భావాలను ఆమిర్ పంచుకున్నారు.
ఇక సినిమాల నిర్మాణ ప్రక్రియ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆమిర్ ఖాన్. చాలా అరుదుగా షూటింగ్ సమయంలోనే కొన్ని సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ కావని అర్థమైందని తెలిపారు. సినిమా ఫస్ట్ కట్ చూసినప్పుడు తనను తాను మోసం చేసుకోనని, నచ్చకపోతే ఎక్కడో ప్రాబ్లమ్ ఉందని అర్థం చేసుకుంటానన్నారు. తారే జమీన్ పర్, ఢిల్లీ బెల్లీ, లాపతా లేడీస్ లాంటి సినిమాలు సరైన రూపం దాల్చేందుకు చాలా కాలం ఎడిటింగ్‌లో కష్టపడ్డామని చెప్పారు. ప్రేక్షకులకు చేరాల్సిన భావం వేరేలా వెళ్తే కమ్యూనికేషన్ మార్చాల్సి వస్తుందని, ఆ ప్రక్రియ ఫస్ట్ కట్ నుంచే మొదలవుతుందని వివరించారు.
ప్రేక్షకుల అభిప్రాయానికి తాను అత్యంత ప్రాధాన్యం ఇస్తానని కూడా ఆమిర్ వెల్లడించారు. స్పెషల్ స్క్రీనింగ్‌లు నిర్వహించి, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారో గమనిస్తామని చెప్పారు. వారి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సినిమా పనిచేస్తుందా లేదా అన్నది అంచనా వేస్తామని తెలిపారు. మనం అనుకున్నది ప్రేక్షకులకు సరైన విధంగా చేరితే అదే అసలైన సక్సెస్ అని ఆమిర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన 3ఇడియట్స్ కు సీక్వెల్ గా ప్రచారం జరుగుతున్న 4 ఇడియట్స్ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విక్కీ కౌశల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
