ఆమిర్ అందుకే ఆ సినిమాను లేట్ చేస్తున్నారా?
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఓ ప్రతిష్టాత్మక సినిమాను రూపొందించాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అదే దాదాసాహేబ్ ఫాల్కే బయోపిక్.
By: Sravani Lakshmi Srungarapu | 12 Jan 2026 11:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఓ ప్రతిష్టాత్మక సినిమాను రూపొందించాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అదే దాదాసాహేబ్ ఫాల్కే బయోపిక్. ఆమిర్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్టు ఇదే. ఫ్యాన్స్ కూడా ఈ మూవీ త్వరగా వస్తే బావుండని చూస్తున్నారు. కానీ ఆమిర్ ఈ సినిమా విషయంలో తొందరపడటం లేదు. సరైన టైమ్ కోసం వెయిట్ చేసి, అన్నీకుదిరినప్పుడే ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
త్వరగా రిలీజ్ చేయాలని చూస్తున్న రాజ్ హిరానీ
ఈ మూవీ గురించి డైరెక్టర్ రాజ్ హిరానీ, ఆమిర్ ఖాన్ మధ్య చాలా కాలంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి కానీ వారిద్దరూ తమ ప్రియారిటీలను అడ్జస్ట్ చేసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. అయితే డైరెక్టర్ రాజ్ హిరానీ ఈ బయోపిక్ ప్రాజెక్ట్ ను త్వరగా మొదలుపెట్టి, వీలైనంత త్వరగా రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని బాలీవుడ్ వర్గాలంటున్నాయి.
రెడీగా లేని ఆమిర్?
కానీ ఆమిర్ మాత్రం ఈ సినిమాకు కమిట్ అవడానికి రెడీగా లేరని, సినిమా స్క్రిప్ట్ విషయంలో పూర్తిగా శాటిస్‌ఫై అయ్యాకే ముందుకు వెళ్లాలనుకుంటున్నారని, అన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకునే ఆమిర్ ఖాన్, అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో ఆమిర్ ఫ్యాన్స్ అతనికే సపోర్ట్ చేస్తున్నారు.
ఇండియన్ సినిమా పితామహుడైన దాదాసాహేబ్ ఫాల్కే పై సినిమా తీస్తున్నారంటే అది చాలా గొప్ప స్థాయిలో ఉండాలని, అందుకోసం ఎంతో శ్రద్ధతో పాటూ కష్టం కూడా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. పైగా ఇలాంటి బయోపిక్ కు ఆమిర్ సరైన ఛాయిస్ అని కూడా వారు భావిస్తున్నారు. అయితే రీసెంట్ టైమ్స్ లో ఆమిర్ మార్కెట్ కాస్త తగ్గడంతో ఇలాంటి మంచి ప్రాజెక్టులను త్వరగా రిలీజ్ చేస్తే ఆయన మార్కెట్ తిరిగి పెరుగుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. కానీ ఈ విషయంలో ఆమిర్ నిర్ణయమే కరెక్ట్. ఎందుకంటే సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే స్క్రిప్ట్ విషయంలో ఫుల్ క్లారిటీ ఉంటే ఒక యాక్టర్ కు ఆ విషయమిచ్చే సంతృప్తే వేరు. అందుకే ఆమిర్ కూడా ఆ దారిలోనే వెళ్తున్నట్టున్నారు.
