Begin typing your search above and press return to search.

మూడు పెళ్లిళ్ల హీరోనే కాదు.. 1800 కోట్ల సామ్రాజ్యానికి సృష్టిక‌ర్త‌

బాలీవుడ్ `మిస్టర్ పర్ఫెక్ట్` అమీర్ ఖాన్ జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

By:  Sivaji Kontham   |   6 July 2026 8:00 AM IST
మూడు పెళ్లిళ్ల హీరోనే కాదు.. 1800 కోట్ల సామ్రాజ్యానికి సృష్టిక‌ర్త‌
X

బాలీవుడ్ `మిస్టర్ పర్ఫెక్ట్` అమీర్ ఖాన్ జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త- బి బ్లంట్ సెలూన్ పార్ట్‌నర్ అయిన గౌరీ స్ప్రాట్‌ను జూలై 5న ముంబైలోని తన నివాసంలో అత్యంత ఆప్తుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 61 ఏళ్ల వయసులో అమీర్ చేసుకున్న ఈ మూడో వివాహం ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఆయన నిర్మించుకున్న కోట్లాది రూపాయ‌ల‌ సామ్రాజ్యం, ఆస్తుల వివరాలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత నమ్మకమైన.. క్వాలిటీ చిత్రాల మేకర్‌గా పేరొందిన అమీర్ ఖాన్ నికర ఆస్తి విలువ ప్రస్తుతం దాదాపు 1,862 కోట్లుగా అంచనా. కమర్షియల్ సక్సెస్‌తో పాటు సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఆధారిత సినిమాలను నిర్మించడం, ర‌క‌ర‌కాల వ్యాపార మార్గాల‌ ద్వారా అత‌డు ఈ స్థాయి సంపదను సృష్టించారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ ఒక సినిమాకు దాదాపు 85 కోట్ల నుండి 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. దీనికి తోడు పలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా ఒక్కో యాడ్‌కు 10 కోట్ల నుండి 12 కోట్ల వరకు చార్జ్ చేస్తూ అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచారు.

అమీర్ ఖాన్‌కు దేశ విదేశాలలో రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబ‌డులు ఉన్నాయి. అత‌డు ప్రస్తుతం ముంబైలోని అత్యంత విలాసవంతమైన పాలి హిల్ (బాంద్రా) ఏరియాలో సముద్రానికి ఎదురుగా ఉన్న 60 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ఇదే కాకుండా అదే ప్రాంతంలో హిల్ వ్యూ, బెల్లా విస్టా, మెరీనా అపార్ట్‌మెంట్స్ వంటి లగ్జరీ కాంప్లెక్స్‌లలో పలు ఫ్లాట్లను కొనుగోలు చేసారు. అలాగే మహారాష్ట్రలోని ప్రముఖ హిల్ స్టేషన్ పంచగనిలో 7 కోట్లకు పైగా విలువైన ఫార్మ్‌హౌస్, అమెరికాలోని బెవర్లీ హిల్స్‌లో 75 కోట్ల విలువైన భారీ మాన్షన్.. సెంటిమెంట్ పరంగా ఉత్తరప్రదేశ్‌లోని తన పూర్వీకుల గ్రామంలో 22 ఇళ్లను కొనుగోలు చేశారు.

ఆయన పర్సనల్ గ్యారేజీలో నిలిపి ఉంచే లగ్జరీ కార్ల కలెక్షన్ విలువ ఏకంగా 27 కోట్లు దాటుతుంది. ఇందులో అత్యంత సురక్షితమైన విఐపి రక్షణ కలిగిన బుల్లెట్ ప్రూఫ్ కారు మెర్సిడెస్ బెంజ్ S600 గార్డ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీని ధర సుమారు 10.5 కోట్లు. దీంతో పాటు దాదాపు 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్, లగ్జరీ సెడాన్ బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పుర్ వంటి అల్ట్రా-లగ్జరీ వాహనాలు ఆయన సొంతం.

నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై `లగాన్` (25 ఏళ్లు పూర్తి చేసుకున్న చిత్రం), `దంగల్`, `తారే జమీన్ పర్` వంటి క్లాసిక్ చిత్రాలను అందించారు. ప్రస్తుతం సన్నీ డియోల్, ప్రీతి జింతా ప్రధాన పాత్రల్లో వస్తున్న పీరియడ్ డ్రామా `బట్వారా 1947` చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అమీర్ ఒక ప్రత్యేక పాత్రలోనూ కనిపించనున్నారు. వ్యక్తిగత జీవితంలో రీనా దత్తా, కిరణ్ రావులతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్న అమీర్ ఖాన్ ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టి తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు.