మూడో పెళ్లికి ముహూర్తం: గౌరీతో అమీర్ ఖాన్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు.
By: Sivaji Kontham | 3 Jun 2026 5:46 PM ISTబాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న గౌరీ స్ప్రాట్ ను ఆయన త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. క్లోజ్ సోర్స్ సమాచారం మేరకు.. జూలై 5న ఒక ప్రైవేట్ వేడుకలో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. గతంలో రీనా దత్తా, కిరణ్ రావులను వివాహం చేసుకుని విడిపోయిన అమీర్ ఖాన్‌కు ఇది మూడో వివాహం. కాగా గౌరీ స్ప్రాట్‌కు ఇప్పటికే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. గత ఏడాది తన 60వ పుట్టినరోజు సందర్భంగా అమీర్ ఖాన్ తన ప్రేయసిని మీడియాకు అధికారికంగా పరిచయం చేశారు.
అమీర్ ఖాన్‌ను పెళ్లాడబోతున్న గౌరీ స్ప్రాట్ అసలు సిసలైన బెంగళూరు అమ్మాయి. తన జీవితంలో ఎక్కువ భాగం బెంగళూరులోనే గడిపారు. ఆమె తల్లి రీటా స్ప్రాట్ అక్కడ ఒక బ్యూటీ సెలూన్‌ను నడిపించేవారు. గౌరీ లండన్‌లోని `యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్` నుండి ఫ్యాషన్ స్టైలింగ్ - ఫోటోగ్రఫీలో కోర్సు పూర్తి చేశారు. ప్రస్తుతం ముంబైలో ఒక ప్రముఖ సెలూన్ బ్రాంచ్‌ను నిర్వహిస్తూనే... అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్‌లో కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది.
మీడియా కంట పడకుండా అమీర్ ఖాన్ తన ప్రేమాయణాన్ని దాదాపు 18 నెలల పాటు అత్యంత రహస్యంగా ఉంచడం విశేషం. దీనిపై గతంలో ఆయన మీడియా ప్రెస్ మీట్‌లో సరదాగా స్పందిస్తూ.. ``చూశారా.. మీకు అస్సలు అనుమానం రాకుండా ఎలా మేనేజ్ చేశానో`` అని చమత్కరించారు. గౌరీ బెంగళూరులో ఉండటం వల్ల ఆమెను కలవడానికి తాను తరచూ అక్కడికి వెళ్లేవాడినని... అక్కడ మీడియా నిఘా ముంబైతో పోలిస్తే తక్కువగా ఉండటం వల్ల తాము గుట్టుగా ఉండగలిగామని అమీర్ వెల్లడించారు. బాలీవుడ్‌కు సంబంధం లేని వెలుపలి వ్యక్తి కావడం వల్ల కూడా ఆమెను మీడియా గ్లేర్ నుండి దూరంగా ఉంచడానికి అమీర్ ఈ జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ తన తాజా రిలేషన్‌షిప్‌పై ఎంతో ఓపెన్‌గా మాట్లాడారు. గౌరీ తన జీవితంలోకి వచ్చినప్పటి నుండి తాను ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నానని చెప్పారు. నేను గౌరీని కలవడం నా అదృష్టం. మా బంధం చాలా బాగుంది.. ఆమె పక్కన ఉంటే నాకు మనశ్శాంతి లభిస్తుంది. నా మాజీ భార్యలు కిరణ్ రావు, రీనా దత్తాలతో కూడా నాకు ఎంతో చక్కని అనుబంధం ఉండేది.. కానీ కొన్ని కారణాల వల్ల అవి వర్కవుట్ అవ్వలేదు. గౌరీ రాకతో నా జీవితం పరిపూర్ణమైనట్లు అనిపిస్తోంది`` అని అమీర్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యారు. గత ఏడాది కాలంగా వీరిద్దరూ పలు అంతర్జాతీయ ఈవెంట్లలోను కలిసి జంటగా సందడి చేస్తున్నారు.
అమీర్ ఖాన్ గత వివాహాల విషయానికి వస్తే.. ఆయన 1986లో రీనా దత్తాను రహస్యంగా పెళ్లాడారు. వీరికి జునైద్, ఇరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 16 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2002లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్న అమీర్ 2021లో ఆమె నుంచి విడిపోయారు. అయినా వీరిద్దరూ తమ కుమారుడు ఆజాద్ బాధ్యతలను కలిసి చూసుకుంటున్నారు. ఇప్పుడు 61వ ఏట అమీర్ ఖాన్ గౌరీ స్ప్రాట్‌తో కలిసి తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుండటం బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
