ఆర్జీవీ- అమీర్ ఖాన్‌లా ఆటోవాలా తెలివైన ప్రచారం
మార్కెటింగ్ ప్రపంచంలో నిరంతరం కొత్త ధోరణులు పుట్టుకొస్తున్నా.. కొన్ని పాత పద్ధతులు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ అని నిరూపితమవుతున్నాయి.
By: Sivaji Kontham | 12 April 2026 11:51 PM ISTమార్కెటింగ్ ప్రపంచంలో నిరంతరం కొత్త ధోరణులు పుట్టుకొస్తున్నా.. కొన్ని పాత పద్ధతులు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ అని నిరూపితమవుతున్నాయి. దాదాపు 40 ఏళ్ల క్రితం.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన తొలి చిత్రం `ఖయామత్ సే ఖయామత్ తక్` ప్రచారానికి ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. అప్పట్లో భారీ బడ్జెట్ ప్రచారాలు లేకపోవడంతో ఆయనే స్వయంగా రోడ్లపైకి వచ్చి ఆటో రిక్షాల వెనుక తన సినిమా పోస్టర్లను అంటించేవారు. ఈ సామాన్యమైన ఆటోవాలా ప్రచార టెక్నిక్ ఆ సినిమాను బ్లాక్‌బస్టర్ చేయడమే కాకుండా అమీర్‌ను స్టార్‌గా నిలబెట్టింది.
ప్రస్తుతం అదే స్ఫూర్తితో 21 ఏళ్ల తన్మయ్ అనే యువ పారిశ్రామికవేత్త తన సరికొత్త వ్యాపార ప్రమోషన్ కోసం అచ్చం అమీర్ ఖాన్ బాటలోనే పయనిస్తున్నాడు. డిజిటల్ యుగంలో అందరూ సోషల్ మీడియా యాడ్స్ వెనుక పరుగులు తీస్తుంటే.. తన్మయ్ మాత్రం ఆటో రిక్షాల వెనుక పోస్టర్లు వేయించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తక్కువ ఖర్చుతో నగరమంతా తన బ్రాండ్‌ను ఎలా తీసుకెళ్లాలో అమీర్ ఖాన్ నాటి టెక్నిక్ ద్వారా ఈ యువకుడు చేసి చూపిస్తున్నాడు.
అయితే తన్మయ్ తన ప్రచారంలో ఒక ఆసక్తికరమైన, వ్యంగ్యపూరితమైన ట్యాగ్‌లైన్‌ను జోడించాడు. ``దయచేసి నా దగ్గర వస్తువులు కొనండి.. అప్పుడే నేను నిరుద్యోగిని కాదని మా తల్లిదండ్రులు నమ్ముతారు`` అనే వాక్యం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ మాటల్లోని హాస్యం ప్రజలను నవ్విస్తుండగా.. దాని వెనుక ఉన్న ఒక మధ్యతరగతి యువకుడి వ్యాపార తపన.. తల్లిదండ్రుల నమ్మకాన్ని గెలుచుకోవాలనే ఆరాటం అందరినీ ఆలోచింపజేస్తోంది.
కేవలం వస్తువుల గురించి చెప్పకుండా... ఇలా భావోద్వేగపూరితమైన విజ్ఞప్తి చేయడం తన్మయ్ మార్కెటింగ్ వ్యూహంలో మాస్టర్ స్ట్రోక్ అని చెప్పవచ్చు. ఈ పోస్టర్లను చూసిన నెటిజన్లు ఫోటోలు తీసి నెట్టింట షేర్ చేయడంతో అది కాస్తా భారీ ప్రచారంగా మారిపోయింది. ఖరీదైన యాడ్ ఏజెన్సీలతో పనిలేకుండా.. ఒక చిన్న ఆలోచనతో తన వ్యాపారానికి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకోవడంలో తన్మయ్ విజయం సాధించాడు.
ఈ ఉదాహరణ ఇతర యువ వ్యాపారవేత్తలకు కూడా ఒక గొప్ప స్ఫూర్తినిస్తోంది. వ్యాపారం చేయాలంటే భారీ పెట్టుబడి లేదా హై-టెక్ మార్కెటింగ్ మాత్రమే అవసరం లేదని.. కష్టపడే తత్వంతో పాటు కాస్త సృజనాత్మకత ఉంటే సామాన్యమైన ఆటో రిక్షా ద్వారా కూడా సంచలనం సృష్టించవచ్చని ఈ సంఘటన నిరూపించింది. అమీర్ ఖాన్ నాటి టెక్నిక్ 40 ఏళ్ల తర్వాత కూడా నేటి తరం పారిశ్రామికవేత్తలకు దిక్సూచిలా పనిచేయడం విశేషం. ఆసక్తికరంగా అప్పట్లోనే టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఇలాంటి ఎన్నో టెక్నిక్స్ ని ఉపయోగించి తన సినిమాకు తక్కువ ఖర్చుతో ప్రచారం చేసుకునేవారు. ఆయన టాక్సీలపైనా శివ పోస్టర్లు వేసి ప్రమోషన్ చేసారు ఆరోజుల్లో.
