అమీర్ లేటెస్ట్ టార్గెట్.. ఖాన్‌ల త్రయానికి గ్యాంగ్ స్టర్ బెదిరింపులతో టెన్షన్
తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌కు కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తీవ్ర హెచ్చరికలు రావడంతో ఆయన భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు.
By: Sivaji Kontham | 5 Aug 2026 5:00 PM ISTబాలీవుడ్ అగ్ర నటులైన 'ఖాన్'ల త్రయానికి వరుస బెదిరింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ మరియు ఆయన కుటుంబం గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి ప్రాణహాని బెదిరింపులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దశాబ్దాల నాటి కృష్ణజింకల వేట కేసు లారెన్స్ బిష్ణోయ్ రూపంలో ఆయనను నేటికీ వెంటాడుతుండటంతో, ఎల్లప్పుడూ బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో, భారీ పోలీసు రక్షణ నడుమ నిరంతర టెన్షన్ వాతావరణంలో కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో షారూఖ్ ఖాన్‌కు కూడా ఇలాంటి బెదిరింపులు ఎదురుకావడంతో బాలీవుడ్ స్టార్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌కు కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తీవ్ర హెచ్చరికలు రావడంతో ఆయన భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఆర్జూ బిష్ణోయ్, టైసన్ బిష్ణోయ్ లతో ముడిపడి ఉన్న ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇటీవల వైరల్‌గా మారింది. ఈ బెదిరింపుల నేపథ్యంలో అమీర్ ఖాన్ నివాసం వద్ద పోలీసు పహారాను పెంచడమే కాకుండా, ఆయన ఇంటి చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచారు.
ఈ బెదిరింపులకు ప్రధాన కారణం అమీర్ ఖాన్ ఇటీవల చేసుకున్న మూడో వివాహమేనని ప్రచారం జరుగుతోంది. గతంలో రీనా దత్తా, కిరణ్ రావులతో విడిపోయిన అమీర్ ఖాన్, జులై 2026లో ముంబైలోని తన నివాసంలో బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రెట్‌ను వివాహం చేసుకున్నారు. అయితే, ఈ వివాహాన్ని లక్ష్యంగా చేసుకుని, ఆయన 'లవ్ జిహాద్'ను ప్రోత్సహిస్తున్నారంటూ సదరు గ్యాంగ్ సోషల్ మీడియా పోస్ట్‌లో తీవ్ర ఆరోపణలు చేసింది.
సనాతన ధర్మానికి మరియు మన సంస్కృతికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్న వారికి ఇదే మా చివరి హెచ్చరిక అని, త్వరలోనే మాదైన శైలిలో సమాధానం చెప్తామని సదరు గ్యాంగ్ ఆ పోస్ట్‌లో బెదిరించింది. స్టార్‌డమ్ పేరుతో ఇటువంటి చర్యలకు పాల్పడే వారి ఊపిరి తీస్తామంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిణామాలపై మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి యోగేష్ రామ్‌దాస్ కదమ్ స్పందిస్తూ.. పోలీసులు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతున్నారని, నటుడికి ఉన్న సెక్యూరిటీని సమీక్షించి అవసరమైన భద్రతను పెంపొందిస్తామని స్పష్టం చేశారు.
ఒకప్పుడు తమ సినిమాలతో వినోదాన్ని అందించే ఖాన్ హీరోలు, ఇప్పుడు తాము మాట్లాడే ప్రతి మాటలోనూ, తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకవైపు సల్మాన్ ఖాన్, మరోవైపు అమీర్ ఖాన్‌లకు లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి వరుసగా వస్తున్న ఈ బెదిరింపుల పర్వం బాలీవుడ్ చిత్రసీమలోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
