అమీర్ ఖాన్ పై పెరుగుతున్న నెగిటివిటీ.. అసలు ఏమైందంటే?
ఇదిలా ఉండగా.. 2025 ఏప్రిల్ లో మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో హిందీని మూడో భాషగా చేర్చాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి మరాఠీ వర్సెస్ హిందీ అంటూ చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 16 Jan 2026 8:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా అటు వృత్తిపరమైన.. ఇటు వ్యక్తిగతంగా విమర్శలు ఎదుర్కొంటూ నెగిటివిటీ మూటగట్టుకుంటున్న ఈయన తాజాగా భాష గురించి చేసిన కామెంట్లతో మళ్ళీ వివాదాల్లో చిక్కుకున్నారని చెప్పవచ్చు. దీంతో మళ్లీ అమీర్ ఖాన్ పై నెగెటివిటీ పెరిగిపోతుందని అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలలో ఓటు వేసిన అమీర్ ఖాన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అందరూ ఓటు వేయాలని మరాఠీలో చెబుతుండగా.. ఒక రిపోర్టర్ హిందీలో చెప్పాలని కోరారు. దీనికి ఆయన మాట్లాడుతూ.. హిందీలో మాట్లాడాలా.. ఇది మహారాష్ట్ర భాయ్ అని అన్నారు.. వెంటనే రిపోర్టర్ ఈ లైవ్ ఢిల్లీలో కూడా ప్రసారమవుతుంది సార్ అని చెప్పడంతో.. ఇది ఢిల్లీ వరకు వెళ్తుందా.. చాలా ఏర్పాట్లు చేశారే.. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.. అంటూ కామెంట్ చేశారు. అయితే ఇది విన్న నెటిజన్స్ మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ వ్యంగంగా అమీర్ ఖాన్ సమాధానం ఇచ్చారు అంటూ ఆయనపై మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. 2025 ఏప్రిల్ లో మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో హిందీని మూడో భాషగా చేర్చాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి మరాఠీ వర్సెస్ హిందీ అంటూ చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమీర్ ఖాన్ మాట్లాడిన మాటలు వ్యంగ్యంగా ఉన్నాయని అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.
ఇకపోతే అమీర్ ఖాన్ ఇలా వివాదాలలో చిక్కుకోవడం ఇదేమి తొలిసారి కాదు..2015లో భారతదేశంలో పెరుగుతున్న అసహనం గురించి మాట్లాడుతూ.. తన భార్యతో కలిసి అసురక్షితంగా భావిస్తున్నట్లు వ్యాఖ్యానించి, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీనిపై రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా ఈయనపై విరుచుకుపడ్డారు. అలాగే సర్దార్ సరోవర్ డ్యామ్ ఎత్తు పెంచడానికి వ్యతిరేకంగా జరిగిన నర్మదా బచావో నిరసనకు మద్దతు ప్రకటించి విమర్శలు ఎదుర్కొన్నాడు. అలాగే తన సోదరుడు ఫైసల్ ఖాన్ ను బలవంతంగా ఇంట్లో నిర్బంధించాడని, తనను మానసిక రోగిగా ముద్రవేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే తన సినిమా లాల్ సింగ్ చద్దా సినిమాను బాయ్ కాట్ చేయాలనే డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి.
అలాగే వ్యక్తిగతంగా కూడా ఈయన విమర్శలు ఎదుర్కొన్నారు. బ్రిటీష్ జర్నలిస్ట్ జెస్సికా హైన్స్ తో సంబంధం పెట్టుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వదిలేసారనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అలాగే తన భార్యకు విడాకులు ఇచ్చిన సమయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈయన తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్ తో డేటింగ్ పై కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు కొన్ని సందర్భాలలో ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసేటప్పుడు ఆయన ధరించిన డ్రెస్సింగ్ స్టైల్ , మతపరమైన అంశాలపై కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు భాష పై నెగిటివిటీని మూటగట్టుకుంటున్నారు. మరి దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
