కూలీపై ఎలాంటి కామెంట్లు చేయలేదు.. అమీర్ ఖాన్ టీమ్
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన `కూలీ` విమర్శకుల కామెంట్లతో సంబంధం లేకుండా భారీ ఓపెనింగులు సాధించిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 14 Sept 2025 11:09 AM ISTసూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన `కూలీ` విమర్శకుల కామెంట్లతో సంబంధం లేకుండా భారీ ఓపెనింగులు సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఎన్ని విమర్శలొచ్చినా బాక్సాఫీస్ వసూళ్లకు డోఖా లేదని కథనాలొచ్చాయి. కానీ అమీర్ ఖాన్, నాగార్జున పాత్రలపై విమర్శలు రావడం ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా అమీర్ పాత్ర ఏమాత్రం ప్రభావం చూపలేదని, అంత పెద్ద సూపర్ స్టార్ ఇలాంటి పాత్రలో నటించాల్సిన అవసరం లేదని కూడా కామెంట్లు వినిపించాయి.
అయితే ఒక భారీ మల్టీస్టారర్ తెరకెక్కించినప్పుడు ఇలాంటి కామెంట్లు రావడం సహజం. దీనిని అమీర్ ఖాన్ బృందం అర్థం చేసుకుంది. కానీ ఇటీవల ముంబైకి చెందిన ఒక టాబ్లాయిడ్ లో అమీర్ ఖాన్ కూలీలో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలో నటించినందుకు, తనపై వచ్చిన కామెంట్లకు చిన్నబుచ్చుకున్నాడని సదరు కథనం పేర్కొంది. తన పాత్రను రాసిన విధానం బాలేదు.. ఈ పాత్రలో నటించడం పెద్ద తప్పు అని అమీర్ ఖాన్ భావించినట్టు కథనం వెలువడింది.
అయితే ఈ పుకార్లను తాజాగా అమీర్ ఖాన్ పీఆర్ బృందం ఖండించింది. కూలీలో తన పాత్ర ఎంపిక రాంగ్ డెసిషన్ అని ఎప్పుడూ భావించలేదని వివరణ ఇచ్చింది. ఆమీర్ ఖాన్ అలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కూలీ గురించి ఎటువంటి నెగెటివ్ కామెంట్లు చేయలేదు. మిస్టర్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్- కూలీ మొత్తం టీమ్ విషయంలో ఖాన్‌కు అత్యున్నత గౌరవం ఉంది`` అని వివరణ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాపై కామెంట్లా? ఈ ఫలితమే స్వయంగా చెబుతోంది కదా! అని ప్రశ్నించడం విశేషం. దీనిని బట్టి రజనీ కూలీ విషయంలో అమీర్ ఖాన్ కి ఎలాంటి ఇబ్బంది లేదని అర్థమవుతోంది. టాబ్లాయిడ్ వార్తను ఫేక్ కథనంగా భావించాలి.
