Begin typing your search above and press return to search.

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అమీర్ ఖాన్.. ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?

అభిమానులను మెప్పించడానికి సెలబ్రిటీలు ఏ రేంజ్ లో కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By:  Madhu Reddy   |   10 Sept 2025 3:00 AM IST
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అమీర్ ఖాన్.. ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?
X

అభిమానులను మెప్పించడానికి సెలబ్రిటీలు ఏ రేంజ్ లో కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తమ పాత్రకు తగ్గట్టుగా తమ శరీరంలో కూడా మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు సినిమాలలో బలమైన పాత్రల కోసం బక్కచిక్కిపోయిన వారు ఉన్నారు. అలాగే ఊహించని విధంగా బరువు పెరిగినవారు కూడా ఉన్నారు. అయితే ఇలా అనుకోకుండా పాత్రల కోసం బరువు పెరిగి, ఆ తర్వాత కెరియర్ ను కోల్పోయిన వారు కూడా లేకపోలేదు. ఉదాహరణకు అనుష్క శెట్టిని తీసుకుంటే.. ఒకప్పుడు వరుస సినిమాలతో గ్లామర్ బ్యూటీగా పేరు సొంతం చేసుకొని స్టార్ హీరోయిన్గా చలామణి అయిన ఈమె.. 'సైజ్ జీరో' సినిమాతో ఊహించని బరువు పెరిగిపోయింది. ఆ తర్వాత బరువు తగ్గడానికి ఎన్నో కష్టాలు పడింది. ఫలితంగా అవకాశాలు కూడా కోల్పోయింది.

ఇప్పుడు సినిమాలోని ఒక పాత్ర కోసం అమీర్ ఖాన్ కూడా ఇదే సాహసం చేస్తున్నట్టు అనిపిస్తోంది. తాజాగా ఆయన కనిపించిన లుక్ అభిమానులలో అనుమానాలు పెంచేసిందని చెప్పవచ్చు. గుర్తుపట్టలేనంతగా.. అధిక బరువుతో కనిపించి అభిమానులను సైతం ఆశ్చర్యపరిచారు అమీర్ ఖాన్. అసలేం జరిగింది అనే విషయానికి వస్తే.. అమీర్ ఖాన్ ఇటీవల 'సితారే జమీన్ పర్' అనే సినిమాలో చాలా యంగ్ గా, అందంగా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించి అమీర్ ఖాన్ కు కాసుల వర్షం కురిపించింది. అటు రజనీకాంత్ 'కూలీ' సినిమాలో కూడా చాలా స్టైలిష్ గా కనిపించి మెప్పించారు.

ప్రస్తుతం ఈయన భారత లెజెండ్ 'దాదాసాహెబ్ ఫాల్కే' బయోపిక్ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు. రాజకుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.

ఇలాంటి సమయంలో అమీర్ ఖాన్ అకస్మాత్తుగా భారీ లుక్ లో కనిపించేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈయన ఇలా ఉన్నట్టుండి బరువు పెరగడానికి కారణం దాదాసాహెబ్ ఫాల్కే సినిమా అని తెలుస్తోంది. ఇందులో ఆయన దాదాసాహెబ్ ఫాల్కేగా తెరపై కనిపించడానికి ఇలా బరువు పెరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అమీర్ ఖాన్ ఈ సినిమా కోసం దాదాపు చాలా చిత్రాలను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. రజనీకాంత్, కమలహాసన్ తో మల్టీస్టారర్ మూవీ చేసిన తర్వాత.. అమీర్ ఖాన్ తో ఒక సినిమా చేయబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కోసం ఈ సినిమాను అమీర్ ఖాన్ వాయిదా వేసినట్లు సమాచారం.

అలా ఈ బయోపిక్ కోసం పెద్దపెద్ద ప్రాజెక్టులను ఆయన పక్కకు పెట్టడమే కాకుండా ఇలా భారీగా బరువు పెరిగిపోయి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఏదేమైనా ఈ సినిమా కోసం భారీగా కష్టపడుతున్న అమీర్ ఖాన్ కచ్చితంగా సక్సెస్ అందుకోవాలి అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.