Begin typing your search above and press return to search.

అమీర్‌ ఖాన్‌ వల్లే మేము తల్లిదండ్రులం అయ్యాం..!

విష్ణు విశాల్‌ భార్య జ్వాలా గుత్తా కుమార్తెకు జన్మనివ్వడం, ఆ పాపకు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ మీరా అని పేరు పెట్టడం జరిగింది.

By:  Ramesh Palla   |   29 Oct 2025 10:25 AM IST
అమీర్‌ ఖాన్‌ వల్లే మేము తల్లిదండ్రులం అయ్యాం..!
X

తమిళ నటుడు విష్ణు విశాల్‌ దంపతులు ఇటీవల తల్లిదండ్రులు అయ్యారు. విష్ణు విశాల్‌ భార్య జ్వాలా గుత్తా కుమార్తెకు జన్మనివ్వడం, ఆ పాపకు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ మీరా అని పేరు పెట్టడం జరిగింది. విష్ణు విశాల్‌, జ్వాలా గుత్తా ల బేబీకి అమీర్‌ ఖాన్‌ ఎందుకు పేరు పెట్టాడు, అసలు వీరి మద్య ఉన్న అనుబంధం ఏంటి, ఎప్పటి నుంచి వీరి మధ్య రిలేషన్ కొనసాగుతోంది. అమీర్‌ ఖాన్‌ ప్రత్యేకంగా విష్ణు విశాల్‌, జ్వాలా గుత్తాపై అభిమానం చూపించి వారి పాపకు పేరు పెట్టడం వెనుక ఉన్న కారణం ఏంటా అని అంతా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో విష్ణు విశాల్‌ ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. అమీర్ ఖాన్‌తోనూ, ఆయన ఫ్యామిలీతోనూ తనకు, జ్వాలా గుత్తాకు ఉన్న అనుబంధం, ఏర్పడిన పరిచయం గురించి చెప్పుకొచ్చాడు. తాము తల్లిదండ్రులం కావడానికి అమీర్‌ ఖాన్‌ కారణం అని విష్ణు విశాల్ చెప్పుకొచ్చాడు.




విష్ణు విశాల్‌, జ్వాలా గుత్తా దంపతులకు...

విష్ణు విశాల్‌ ఇటీవల ఒక చిట్‌ చాట్‌లో మాట్లాడుతూ... 2023లో అమీర్‌ ఖాన్‌ తల్లి జీనత్‌ హుస్సేన్‌ కు చెన్నైలో అనారోగ్య కారణాల వల్ల చికిత్స చేయించాల్సి వచ్చినప్పుడు, అలాగే ఆయన ఒక షూటింగ్‌ నిమిత్తం చెన్నైలో ఉండాల్సి వచ్చినప్పుడు తాను స్వయంగా చెన్నైలో బస ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఆ సమయంలోనే అమీర్ ఖాన్‌తో ఏర్పడిన సన్నిహిత్యం కారణంగా రెగ్యులర్‌గా ఆయనతో మాట్లాడుతూ ఉండేవాళ్లం. ఆ సమయంలోనే మేము తల్లిదండ్రులం కావడానికి ఇబ్బంది పడుతున్నట్లు ఆయన తెలుసుకున్నారు. ఒకానొక సమయంలో జ్వాలా తల్లి కావాలనే కోరికతో ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. అలాంటి సమయంలో అమీర్‌ ఖాన్‌ సలహా మేరకు మేము ఐవీఎఫ్‌ కి వెళ్లామని విష్ణు విశాల్‌, ఆయన వల్లే ఇప్పుడు మా జీవితంలో సంతోషం ఉందని పేర్కొన్నాడు.

అమీర్‌ ఖాన్‌తో పరిచయం...

అమీర్ ఖాన్‌ గారు ఆ సమయంలో మాకు ముంబైలో సరైన ఐవీఎఫ్‌ సెంటర్‌ను కనుగొనడంలో సహాయం చేశారు. అంతే కాకుండా చాలా ప్రత్యేకమైన శ్రద్ద కనబర్చి మాకు ఆసుపత్రిలో సరైన చికిత్స లభించే విధంగా సహాయం చేశారు. అంతే కాకుండా జ్వాలా ఏకంగా 10 నెలలు ముంబైలో ఉండాల్సి రావడంతో స్వయంగా ఆయన కుటుంబ సభ్యులు మాకు సహాయం చేశారు. వారు సొంత మనిషి మాదిరిగా వారి ఇంట్లోనే ఉంచుకుని మరీ సపర్యలు చేశారని, అమీర్‌ ఖాన్‌ గారి తల్లి, ఆయన సోదరి ఎంతగా జ్వాలాకు ఆ సమయంలో అండగా ఉన్నారో తనకు మాత్రమే తెలుసని విష్ణు విశాల్‌ అన్నాడు. అందుకే జ్వాలా గర్భంతో ఉన్న సమయంలోనే పుట్టబోయే బిడ్డకు ఖచ్చితంగా అమీర్‌ పేరు పెట్టాలని కోరుకున్నట్లు చెప్పాడు. అప్పుడే ఆ విషయాన్ని అమీర్‌ సర్‌ తో చెప్పాను, ఆయన అందుకు ఒప్పుకున్నాడని విష్ణు విశాల్‌ అన్నాడు.

అమీర్‌ ఖాన్‌ వల్లే జ్వాలా గుత్తా మాతృత్వం...

విష్ణు విశాల్‌ ఇంకా మాట్లాడుతూ... నాకు, జ్వాలాకు దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతి అమీర్‌ ఖాన్‌ గారు, జీవితం భారంగా సాగుతున్న సమయంలో, కొత్త జీవితం లేదని అనుకుంటున్న సమయంలో మాకు కొత్త వెలుగును తీసుకు వచ్చిన దేవుడు అమీర్‌ ఖాన్‌ గారు. అందుకే ఆయన మా జీవితంలో ఎప్పటికీ చాలా స్పెషల్‌ పర్సన్‌ అని విష్ణు విశాల్‌ అన్నాడు. అమీర్ మంచి మనసుతో విష్ణు విశాల్‌ దంపతులకు సహాయం చేశారు. ఆయన చేసిన సహాయం కారణంగానే తాము సంతోషంగా ఉన్నామని విష్ణు, జ్వాలా చెప్పుకోవడం గొప్ప విషయం.

మొత్తానికి అమీర్‌ ఖాన్‌ తో విష్ణు విశాల్‌, జ్వాలా గుత్తా దంపతులకు ఉన్న అనుబంధం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అమీర్‌ ఖాన్‌ వంటి సూపర్‌ స్టార్‌ విష్ణు విశాల్‌ దంపతులకు సహాయంగా నిలవడం, ఐవీఎఫ్‌ కి సూచించడం వంటివి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి విష్ణు విశాల్‌ దంపతులు, వారికి పుట్టిన బిడ్డ చాలా అదృష్టవంతులని పలువురు అంటున్నారు.