Begin typing your search above and press return to search.

నిజాయితీగా ప్లాప్ ని అంగీక‌రించిన స్టార్!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్- అమితాబ్ బచ్చన్ ల కలయికలో యష్ రాజ్ ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే.

By:  Srikanth Kontham   |   18 May 2026 9:00 PM IST
నిజాయితీగా ప్లాప్ ని అంగీక‌రించిన స్టార్!
X

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్- అమితాబ్ బచ్చన్ ల కలయికలో యష్ రాజ్ ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే. 2018లో భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేక తీవ్ర నిరాశను మిగిల్చింది. అయితే ఇన్నాళ్ల తర్వాత ఈ చిత్ర పరాజయంపై.. సినిమా కథా నేపథ్యంపై అమీర్ ఖాన్ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' చిత్రాన్ని భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఆల్-టైమ్ క్లాసిక్ హిట్టయిన 'షోలే' చిత్రంతో పోల్చారు. చాలా మంది ఈ సినిమాను చారిత్రాత్మక లేదా పౌరాణిక చిత్రంగా భావించారు. కానీ నిజానికి ఇది కమర్షి యల్ ఎంటర్‌టైనర్ మాత్రమే. `షోలే` సినిమాలో వీరూ, జై పాత్రలు ఎలాగైతే దొంగతనాలు చేస్తూ తిరుగుతారో.. ఈ చిత్రంలో నా పాత్ర ఫిరంగి మల్లా కూడా అలాంటి కమర్షియల్, కామిక్ , నెగటివ్ షేడ్స్ ఉన్న దొంగ పాత్రే అని అమీర్ వివరించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలుకావడానికి గల ప్రధాన కారణాలను కూడా అమీర్ ఖాన్ ఎంతో నిజాయితీగా అంగీకరించారు.

సినిమా విఫలమవడానికి ప్రేక్షకులు - ప్రమోషన్లు కారణం కాదన్నారు. తాము రాసుకున్న స్క్రిప్ట్ , ఎగ్జిక్యూషన్ లోనే లోపాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఒక నటుడిగా, కథకుడిగా మేము ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇవ్వాలని ప్రయత్నించాం. కానీ వెండితెరపై ఆ మ్యాజిక్ వర్కవుట్ కాలేదు. ప్రేక్షకులు ఆశించిన కంటెంట్‌ను మేము అందించలేకపోయామ‌ని అమీర్ పేర్కొన్నారు. భారీ బడ్జెట్, అగ్ర తారాగణం ,వైఆర్ఎఫ్ వంటి పెద్ద ప్రొడ క్షన్ హౌస్ వెనకుండటం వల్ల సహజంగానే ప్రాజెక్ట్ పై ట్రేడ్ వర్గాల్లో అభిమానుల్లో ఆకాశాన్ని తాకే అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఫస్ట్ డే రికార్డు వసూళ్లు సాధించినా? బలహీనమైన కథనం , ఆకట్టుకోని విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా రెండో రోజు నుండే సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ ల వంటి ఇద్దరు లెజెండరీ నటులను ఒకే స్క్రీన్ పై చూసినా? ఆ కాంబినేషన్ క్రేజ్‌ను దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య పూర్తిగా ఉపయోగించు కోలేకపోయారనే విమర్శలు వచ్చాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా? ఆ పరాజయం నుండి తాను ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకున్నట్లు అమీర్ ఖాన్ తెలిపారు. ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు దానికి పూర్తి బాధ్యత వహించడం మంచి మేకర్ లక్షణమని నిరూపించారు. ప్రేక్షకుల తీర్పును తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తదుపరి చిత్రాల విషయంలో కథల ఎంపికపై మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అమీర్ వెల్లడించారు.

'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' రిలీజ్ అయి ఏడేళ్లు గ‌డుస్తున్నా? బాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాల మేకింగ్ కు ఇదొక పెద్ద కేస్ స్టడీగా మిగిలిపోయింది. స్టార్ పవర్ .. షోలే వంటి క్లాసిక్ సినిమాల ఫార్ములాలను నమ్ముకుంటే సరిపోదని, బలమైన కథ , పక్కా స్క్రీన్‌ప్లే ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని అమీర్ ఖాన్ విశ్లేషణ ద్వారా మరోసారి స్పష్టమైంది. మరి ఈ పరాజయాల అనుభవాల నుండి అమీర్ రాబోయే ప్రాజెక్టులతో ఎలాంటి కంబ్యాక్ ఇస్తారో చూడాలి.