ఓటీటీల విషయంలో తెలుగు నిర్మాతలకు దిక్సూచి
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఓటీటీల రాకతో ఎగ్జిబిషన్ రంగం ఎదుర్కొంటున్న దారుణ పర్యవసానం గురించి మాట్లాడుతూ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసాడు.
By: Sivaji Kontham | 26 Oct 2025 9:47 AM ISTమిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఓటీటీల రాకతో ఎగ్జిబిషన్ రంగం ఎదుర్కొంటున్న దారుణ పర్యవసానం గురించి మాట్లాడుతూ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసాడు. ఓటీటీలు థియేటర్లలో సాంప్రదాయ సినిమా అలవాటును ప్రభావితం చేస్తున్నాయని, అరచేతి అద్దంలోనే అన్ని సినిమాలను నేటి జనం వీక్షిస్తున్నారని అన్నారు. వెండితెర మనుగడకు ముప్పు కలిగించే ఓటీటీల విషయంలో తన కఠినమైన వైఖరి ఏమిటో కూడా స్పష్టంగా చెప్పారు. దాని ప్రకారమే `సితారే జమీన్ పార్` (తారే జమీన్ పార్ సీక్వెల్) చిత్రాన్ని థియేటర్లలో విడుదలైన తర్వాత తన సొంత యూట్యూబ్ చానెల్ లో మాత్రమే రిలీజ్ చేసారు. తద్వారా ఓటీటీలకు చెక్ పెట్టాలన్న వ్యూహాన్ని అనుసరించారు. దేశంలో అతిపెద్ద హిట్ చిత్రాన్ని కేవలం 3శాతం మంది మాత్రమే థియేటర్లలో వీక్షిస్తే, 550 మిలియన్ల మంది (55 కోట్ల మంది) యూట్యూబ్ లో వీక్షిస్తున్నారని అతడు విశ్లేషించారు. ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి యూట్యూబ్ సరైన విధానం అని నిర్వచించారు.
అయితే అమీర్ ఖాన్ మోడల్ ని తెలుగు నిర్మాతలు అనుసరించలేరా? అంటే దీనికి ఇప్పటికి సమాధానం లేదు. ఇటీవలి కాలంలో ఓటీటీలతో డీల్స్ గిట్టుబాటు కాని వ్యవహారంగా చేదుగా మారాయి. శాటిలైట్ హక్కులు, హిందీ అనువాద హక్కుల విషయంలో సౌత్ సనిమాలకు కొంత డౌన్ ఫాల్ కనిపిస్తోంది. అదే సమయంలో ఓటీటీలు కూడా నిర్మాతల నెత్తికెక్కి సవారీ చేస్తున్నాయి. థియేటర్లలో సినిమా సాధించే వసూళ్ల ఆధారంగా మాత్రమే ఓటీటీ ధరల్ని నిర్ణయించేలా కొత్త ఎత్తుగడను అనుసరిస్తున్నాయి.
దీంతో ఫ్లాప్ సినిమాలకు ఓటీటీ ధర పూర్తిగా నేలకు పడిపోయింది. ఇటీవల విడుదలైన ఓ యువహీరో సినిమా థియేటర్లలో అంతంత మాత్రంగానే ఆడటంతో ముందు కుదుర్చుకున్న డీల్ విలువలో 50శాతం మాత్రమే సదరు ఓటీటీ చెల్లించింది. దీనిని బట్టి నిర్మాతలను ఓటీటీలు ఇష్టానుసారం ఎలా ఆడుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. నిజానికి పెట్టుబడులు పెట్టే నిర్మాత ఓటీటీ నుంచి చాలా ఆశిస్తుంటే దానికి విరుద్ధంగా కొత్త నియమం పుట్టుకొచ్చింది. డిజిటల్ దిగ్గజాలు థియేటర్ ఆదాయాల ఆధారంగా డిజిటల్ ఒప్పందాలను లెక్కిస్తున్నాయి. ఇది నిజంగా ఊహించని ట్విస్టు. పరీక్ష పేపర్లలో మార్కుల్లాగా, ఒప్పందంలో థియేటర్ల నుంచి సాధించే వసూళ్ల నంబర్లు గీటురాయిగా మారాయి. సినిమా ఫ్లాపైతే ఓటీటీ ధరలు నేలకు పడిపోతున్నాయి. యావరేజ్ గా ఆడితే దానికి తగ్గట్టే చెల్లిస్తున్నాయి. ఇకపై హిట్టు కొట్టే సినిమా తీయకపోతే ఓటీటీ బేరం లేనట్టే. దీనిని బట్టి ఔత్సాహిక దర్శకనిర్మాతలు ఓటీటీలను అస్సలు మార్కెట్ కింద పరిగణించాల్సిన పని లేదు. ఓటీటీలకు ఆల్టర్నేట్ ఏం ఉందో వెతుక్కోవడమే ఉత్తమ మార్గమని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. నిర్మాతలను కష్టంలో ఆదుకునేందుకు సిద్ధంగా లేని కార్పొరెట్ ని అనుసరించాలనుకోవడం మూర్ఖత్వమేనని కొందరు నిపుణులు విశ్లేషించారు.
