షాకింగ్ బిజినెస్.. OTTలకే 'తార' షాక్ ఇచ్చినట్లా..
సినిమా టీజర్ కూడా రాకముందే కోట్ల రూపాయల బిజినెస్ జరిగితే.. ఇక విడుదలకు ముందే ఇన్వెస్ట్మెంట్ మొత్తం వెనక్కి వస్తే.. ఆ ప్రాజెక్టుపై అందరి ఫోకస్ పడుతుంది.
By: M Prashanth | 19 Oct 2026 4:00 PM ISTసినిమా టీజర్ కూడా రాకముందే కోట్ల రూపాయల బిజినెస్ జరిగితే.. ఇక విడుదలకు ముందే ఇన్వెస్ట్మెంట్ మొత్తం వెనక్కి వస్తే.. ఆ ప్రాజెక్టుపై అందరి ఫోకస్ పడుతుంది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 'ఆకాశంలో ఒక తార' సినిమా విషయంలో అదే చర్చ నడుస్తోంది. ఓటీటీ సంస్థలు కొత్త సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సమయంలో, ఆ చిత్రానికి భారీ డీల్ కుదిరినట్లు వార్తలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దీంతో ఓటీటీలు సినిమాల విషయంలో కండీషిన్స్ పెడుతున్నట్లు తెలుస్తుండగా.. ఇప్పుడు వాటికే 'తార' షాక్ ఇచ్చిందా అనే చర్చ మొదలైంది. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా దాదాపు రూ.60 కోట్లు రాబట్టినట్లు సమాచారం. సినిమా బడ్జెట్ కూడా ఇంచుమించు ఇదే రేంజ్ లో ఉండటంతో రిలీజ్ కు ముందే పెట్టుబడి వెనక్కి వచ్చినట్లేనని తెలుస్తోంది.
ఆ లెక్కలు నిజమైతే థియేటర్ల ద్వారా వచ్చే ఇన్కమ్ నిర్మాతలకు ఎక్స్ ట్రా ప్రాఫిట్స్ తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అయితే కొంతకాలంగా ఓటీటీ మార్కెట్ లో పరిస్థితులు మారాయి. గతంలో పెద్ద హీరోల సినిమాలకు షూటింగ్ టైమ్ లోనే డిజిటల్ రైట్స్ కోసం పోటీ ఉండేది. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. సినిమా బడ్జెట్ ఎంత, హీరో మార్కెట్ ఏంటి, కథ కొత్తగా ఉందా.. ఇలా చాలా విషయాలను ఓటీటీ సంస్థలు చూస్తున్నాయి.
కొన్ని సినిమాల రైట్స్ ను కొనుగోలు చేసేందుకు విడుదల తర్వాత వచ్చే రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి సమయంలో 'ఆకాశంలో ఒక తార'కు ముందుగానే భారీ డీల్ కుదిరినట్లు వస్తున్న వార్తలు రావడం గమనార్హం. సాధారణంగా ఓటీటీ సంస్థలు తమకు ప్రాఫిటబుల్ ప్రాజెక్టు ఉంటుందనే నమ్మకం ఉన్న సినిమాలపైనే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడతాయి.
ఇప్పుడు ఆకాశంలో ఒక తార విషయంలో స్టోరీ, క్యాస్టింగ్, ప్రొడక్షన్ బ్యానర్స్ పై ఉన్న నమ్మకమే రీజన్ అయ్యి ఉండొచ్చు. అందుకే ఆ డీల్ ను మారుతున్న ఓటీటీ మార్కెట్ లో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. ఇక ఒక్క సినిమాకు వచ్చిన డీల్‌తో ఓటీటీ మార్కెట్ మొత్తం మారిపోయిందని చెప్పలేం. అలాగే భారీ ధరకు హక్కులు కొనుగోలు చేసినంత మాత్రాన సినిమా విజయం సాధించినట్లు కాదు.
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే కథ, మంచి ఆదరణ కూడా అవసరమే. 'ఆకాశంలో ఒక తార'లో పల్లెటూరి అమ్మాయి అంతరిక్ష పరిశోధకురాలిగా ఎదగాలనే కలను చూపించనున్నారు. ఆమె ప్రయాణంలో కృష్ణ అనే యువకుడు ఎలా తోడుగా నిలిచాడనేది కథ. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తుండగా, సాత్విక వీరవల్లి హీరోయిన్ గా కనిపించనున్నారు. శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తుండగా, జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పిస్తున్న ఆ మూవీ.. నవంబర్ 20న రిలీజ్ కానుంది. మరి ఆ 'తార' బిజినెస్ లోనే కాదు.. థియేటర్లలోనూ అదే రేంజ్ లో మెరుస్తుందా అనేది చూడాలి.
