టాలీవుడ్ లో ఆఫియా పేరు బలంగా వినిపించబోతుందా?
నితిన్ నటించిన ‘అలియాస్ రుక్మిణి’ డిసెంబర్ 4న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో ఆఫియా సయ్యద్ కీలకమైన స్కూల్ టీచర్ పాత్రలో కనిపించింది. సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్‌లో ఆమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
By: Ramesh Palla | 27 Nov 2026 10:43 PM ISTనితిన్ హీరోగా నటించిన 'అలియాస్ రుక్మిణి' సినిమా విడుదలకు సిద్ధం అయింది. దండోర సినిమా ఫేం మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను డిసెంబర్ 4, 2026న విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. విడుదల తేదీ దగ్గర పడ్డ నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ట్రైలర్‌ను విడుదల చేసి అంచనాలు భారీగా పెంచారు. ఇప్పటి వరకు సినిమాలో హీరోయిన్ పేరు రుక్మిణి అయ్యి ఉంటుందని అంతా భావించారు. ప్రేక్షకుల అంచనాలను తల కిందులు చేస్తూ ట్రైలర్‌లో షాకింగ్ విషయాన్ని చూపించారు. ఈ సినిమాలో హీరో నితిన్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. అలాంటి విభిన్నమైన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకునే హీరోయిన్ పాత్రలో ఆఫియా సయ్యద్ నటించింది. గతంలోనే ఈ సినిమా నుంచి ఆఫియా లుక్‌ను రివీల్ చేశారు. స్కూల్ టీచర్ లుక్‌తో అందరినీ సర్‌ప్రైజ్ చేసిన విషయం తెల్సిందే.
అలియాస్ రుక్మిణి ట్రైలర్ విడుదల...
తాజాగా ట్రైలర్ విడుదల తర్వాత ఆఫియా సయ్యద్ పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఏదో గ్లామర్ పాత్ర చేయడం లేదా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించడం కాకుండా ఆఫియా సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి ముందు ఒక మాదిరిగా, పెళ్లి తర్వాత మరో మాదిరిగా కనిపించడంతో ఆమె తీవ్రమైన సంఘర్షణకు గురి అవుతుంది. దాంతో ఆమె ఏం చేసింది, కథను ఎలాంటి మలుపు తిప్పింది అనేది సినిమా కథాంశం. సినిమా కథలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ ఉంది. కనుక ఆఫియా సయ్యద్ యాక్టింగ్ తో కచ్చితంగా మెప్పించి ఉంటుంది. అలియాస్ రుక్మిణి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే కచ్చితంగా ఆఫియా సయ్యద్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.
బాలీవుడ్ న టి ఆఫియా సయ్యద్‌కి...
ఆఫియా సయ్యద్‌కు ఈ సినిమా మొదటి సినిమా కాదు. బాలీవుడ్‌లో ఈమె ఈ ఏడాదిలోనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ బలంగా ఉన్న ఆఫియా కేవలం బాలీవుడ్‌కి పరిమితం అయ్యి అక్కడే పెద్ద సినిమా ఆఫర్లు దక్కించుకోవచ్చు. కానీ సౌత్‌లోనూ సినిమాలు చేసి, తన ప్రతిభను చూపించుకోవాలని భావించినట్లుగా ఉంది. అందుకే బాలీవుడ్‌లో మొదటి సినిమా విడుదల అయిన వెంటనే టాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్‌లో ఈమె మొదటి సినిమా 'ప్రేమ్ కీతాను'. మలయాళ సూపర్ హిట్ మూవీ 'ప్రేమలు'కు రీమేక్ అనే విషయం తెల్సిందే. రీమేక్‌తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆఫియా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆమె కాస్త శ్రద్ద పెట్టి ప్రయత్నాలు చేస్తే బాలీవుడ్‌లో చాలా మంచి ఆఫర్లు ఆమెకు దక్కుతాయి. కానీ ఆమె మాత్రం వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో టాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్...
అలియాస్ రుక్మిణి సినిమాతో ఆఫియా నటిగా తనను తాను నిరూపించుకుంటే కచ్చితంగా టాలీవుడ్‌లో రాబోయే రోజుల్లో ఈమె పేరు బలంగా వినిపించడం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ మూలాలు ఉండటంతో ఈమెను ముందు ముందు పాన్ ఇండియా సినిమాలకు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే కచ్చితంగా వచ్చే ఏడాది ఆఫియా స్టార్ హీరోల సినిమాలో కనిపించడం ఖాయం అనే అభిప్రాయం ను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఆఫియా సయ్యద్ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాద్వాలా సయ్యద్ కి స్వయాన మేనకోడలు. ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ తన సినీ రంగ ప్రవేశం అంత ఈజీగా జరగలేదని గతంలో ఒక చిట్ చాట్‌లో ఆఫియా పేర్కొంది. మోడలింగ్ చేస్తూ చాలా యాడ్స్‌లో నటించిన తర్వాత సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ఎన్నో సినిమాల కోసం ఆడిషన్స్ ఇచ్చినట్లుగానూ చెప్పింది. అంది వచ్చిన అవకాశం ను ఆఫియా సద్వినియోగం చేసుకుంటూ తన ప్రతిభ చూపించే ప్రయత్నం చేస్తుంది. మరి ఎంత వరకు ఆమె సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.
